గతేడాది కంటే తక్కువే !

 Less than last year!– పెరగని జలశయాల నీటిమట్టాలు
–  శ్రీశైలం, తుంగభద్రలో
– వరద అంతంత మాత్రమే
కర్నూలు : శ్రీశైలం, తుంగభద్ర జలాశయాల్లో నీటి మట్టాలు పెరగడం లేదు. గతేడాది కంటే చాలా తక్కువ స్థాయిలో నీటి మట్టాలు నమోదయ్యాయి. జురాల, హంద్రీ, సుంకేసుల ద్వారా మొత్తంగా శ్రీశైలానికి 82.055 క్యూసెక్కులు, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్రకు 48,058 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయంలో విద్యుదుత్పత్తి పేరుతో అటు తెలంగాణ, ఇటు ఎపి ప్రభుత్వాలు ఇష్టానుసారంగా నీటిని తోడేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. పదేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. కీలకమైన సమయంలో సాగు నీరందక ఇరు రాష్ట్రాల రైతులూ ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 846.70 అడుగులు ఉండగా… గతేడాది ఇదే సమయానికి 881.60 అడుగుల నీటి మట్టం నమోదైంది.
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టిఎంసిలు. ప్రస్తుతం 73.2313 టిఎంసి ఉండగా… గతేడాది ఇదే సమయానికి 196.5611 టిఎంసిల నీటి నిల్వ ఉన్నాయి. ఏటా ఈ ప్రాజెక్టులో నీటిమట్టం 854 అడుగులు, నీటి నిల్వ 53 టిఎంసిలు మెయింటెన్‌ చేయాలని బచావత్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించింది. కానీ, రాష్ట్ర విభజన సమయం నాటి నుంచి ఏ యేడాదీ ఈ సీజన్లో 854 అడుగుల నీటిమట్టం లేదు. ఏటా 600 టిఎంసిల నుంచి 2 వేల టిఎంసిల వరకూ వరద నీరు వథాగా సముద్రంలోకి పోతోంది. రాయలసీమ ప్రాంత పరిధిలో కృష్ణా నది వెంట ఎక్కడా రిజర్వాయర్లు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. శ్రీశైలం డ్యామ్‌ నీటి నిలువ డెడ్‌ స్టోరేజీకి పడిపోతే జీవరాశులకు నీటి లభ్యత తగ్గిపోతుంది. దీంతోపాటు వాతావరణం వేడెక్కి పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. శ్రీశైలం జలాశయంపై ఆధారపడి రాయలసీమలోని గాలేరు నగరి, తెలుగుగంగ, హంద్రీనీవా, కెసి కెనాల్‌, ఎస్‌ఆర్‌బిసి కింద లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటి వరకు మంచి వర్షాలు కురవకపోవడంతో తుంగభద్ర డ్యాం వెలవెలబోతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 105.788 టిఎంసిలు కాగా ప్రస్తుతం కేవలం 74.003టిఎంసిల నీరు మాత్రమే నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదే సమాయానికి నీటి నిల్వ 104.905 టిఎంసిలుగా ఉంది. జలాశయ గరిష్ట నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1624.80 అడుగులుగా నీటి మట్టం ఉంది. గతేడాది ఇదే సమయానికి జలాశయ నీటి మట్టం 1632.78 అడుగులుగా ఉంది. దీంతో ఈ ఏడాది ఎల్‌ఎల్‌సి కింద వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది.