నేర ప్రవృత్తిని వీడి సన్మార్గంలో పయనించాలి

Adilabad– తాండూర్‌ సీఐ కుమార స్వామి
నవతెలంగాణ-తాండూర్‌
పాత నేరస్తులు వారి నేర ప్రవృత్తిని విడనాడి సన్మార్గంలో పయనించాలని తాండూర్‌ సీఐ కుమారస్వామి అన్నారు. బుధవారం తాండూర్‌ పోలీసు సర్కిల్‌ కార్యాలయ ఆవరణలో పాత నేరస్తులు, రౌడీషీటర్లకు జీవిత విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నేర ప్రవత్తి మానుకొని సన్మార్గంలో నడవాలని సూచించారు. దీమమ తెలిసి తెలియక జరిగిన కొన్ని ఉదంతాల వల్ల నేరస్తులుగా గా ముద్రించబడ్డారని నేర చరిత్ర మాని సన్మార్గంలో నడిచేందుకు పోలీసు శాఖ సహకారాలు అందిస్తామన్నారు. పోలీసు శాఖ వారి సూచనలు పాటించకుండా పాతదారిలో వెళితే పీడీ యాక్ట్‌ అమలు చేయడం జరుగుతుందన్నారు. గతంలో నేరాలకు పాల్పడిన వారు సమాజంలో మంచి పేరు సంపాదించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. క్షణికావేశంలో చేసిన నేరానికి కుటుంబ సభ్యులు సమాజంలో ఇబ్బందులు పడతారని అన్నారు. రౌడీషీటర్లు తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని జీవితంలో మారాలని హితవు పలికారు. రౌడీషీటర్‌ అనే పదం తమ బిడ్డల భవిష్యత్‌ను నాశనం చేస్తుందన్నారు. నేరప్రవృత్తిని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నామని, ఒకవేళ మారకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. రౌడీ షీటర్‌ ఉన్న ప్రతీ ఒక్కరిపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీ షీట్‌ రికార్డ్‌లో వారు చేసే మంచి పనులు కూడా నమోదు చేయడం జరుగుతుందన్నారు. పూర్తిగా మారితే రౌడీ షీట్‌ తొలగించేందుకు కూడా అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాండూర్‌ ఎస్‌ఐ కిరణ్‌ కుమార్‌, కన్నెపల్లి ఎస్‌ఐ గంగారాం పాల్గొన్నారు.