సీపీఐ(ఎం) అభ్యర్థిది ప్రజా ఉద్యమ చరిత్ర ఆదరించి గెలిపించండి

సీపీఐ(ఎం) అభ్యర్థిది ప్రజా ఉద్యమ చరిత్ర ఆదరించి గెలిపించండి– కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
– 19న జహంగీర్‌ నామినేషన్‌
– హాజరుకానున్న ఏచూరి, బృందాకరత్‌
నవతెలంగాణ-ఆలేరుటౌన్‌
సాధారణ నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, 35 సంవత్సరాలుగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న సీపీఐ(ఎం) భువనగిరి పార్టమెంట్‌ అభ్యర్థి జహంగీర్‌ను ఆదరించి గెలిపించాలని కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు కోరారు. యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని లక్ష్మీగార్డెన్‌లో సోమవారం సీపీఐ(ఎం) నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నాయకులు ఎంఏ ఇక్బాల్‌, దుపటి వెంకటేష్‌, బోలగాని జయరాములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుపల్లి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అభ్యర్థి శ్యామల కిరణ్‌కుమార్‌ రెడ్డిని, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి క్యామ మల్లేశంను నియోజకవర్గంలో ప్రజలు ఎవరూ గుర్తు పట్టరన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిన బూర నర్సయ్యగౌడ్‌తోపాటు ఇతర పార్టీల అభ్యర్థులందరూ.. డబ్బులు సంపాదించడం, ఆస్తులను కాపాడు కోవడం కోసం తరచూ పార్టీలు మారుతూ పోటీలో ఉంటున్నారని విమర్శించారు. సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్‌ నీతి నిజాయితీతో పాటు మచ్చలేని మనిషి అని చెప్పారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి జహంగీర్‌ను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీ దేశంలో ప్రమాదకరమైన పార్టీగా మారిందన్నారు. ప్రశ్నించే వారిని అణగదొక్కడం, సీబీఐ ఈడీ, సీఐడీతో బెదిరింపులు, కేసులు, అరెస్టు చేయించడంతో ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ ముస్లిముల మధ్య తగాదాలు పెంచుతున్నారన్నారు. ఎదురు నిలబడి ప్రశ్నిస్తున్న ప్రాంతీయ పార్టీల నాయకులు కేజ్రీవాల్‌, కవిత వంటి నాయకులను ఈడీ, సీఐడీ, సీబీఐ సంస్థలతో అరెస్టు చేయించి జైళ్లలో పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఏర్పర్చిన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారన్నారు. దేశంలో 50 ఏండ్ల తర్వాత ప్రతిపక్షాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి బీజేపీ విధానాలను నిరసిస్తూ.. ఢిల్లీలో రాంలీలా మైదానంలో సభ ఏర్పాటు చేశారని చెప్పారు.
సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి జహంగీర్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌లో అనేక పదవులు పొంది ఆ తర్వాత బీజేపీలో చేరి ఆస్తులు కాపాడుకోవడానికి బూర నర్సయ్యగౌడ్‌ మళ్లీ పోటీ చేస్తున్నారని చెప్పారు. సీపీఐ(ఎం) ఉద్యమ ఫలితంగానే ఆలేరు గొలనుకొండలో, మాటూరులో భూ పంపిణీ జరిగిందని చెప్పారు. పిట్టలగూడెంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశామన్నారు. కట్కూరి సుశీలాదేవి, రాఘవరెడ్డి, ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి లాంటి కమ్యూనిస్టులు ఏనాడూ పదవుల కోసం పాకులాడ లేదని, ప్రజల కోసమే బతికారని చెప్పారు. తాను 1992 నుంచి ప్రజా ఉద్యమంలో ఉన్నానని, ఏనాడూ పదవుల కోసం ఎదురు చూడలేదని అన్నారు. ప్రజాసమస్యలపై నిత్యం పోరాడే తనకు ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఏప్రిల్‌ 19వ తేదీన నామినేషన్‌ కార్యక్రమానికి సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకారత్‌ హాజరవుతారని చెప్పారు. రాష్ట్ర సోషల్‌ మీడియా కన్వీనర్‌ జగదీష్‌ మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మంగ నరసింహులు, కల్లూరు మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.