మంత్రిగారూ… సాక్ష్యాలివిగో…

Minister... bear witness...– గ్రూప్స్‌కు దరఖాస్తు చేసిన ప్రవళిక
– సమాచారం తెలుసుకోకుండా మాట్లాడిన కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇటీవల హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ప్రవళిక గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 రాతపరీక్షలకు దరఖాస్తు చేసింది. ఆమె ఆ పరీక్షలకు దరఖాస్తు చేసిన వివరాలు దరఖాస్తు ఫారం, హాల్‌టికెట్లు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆమె ఆసలు గ్రూప్స్‌కే దరఖాస్తు చేయలేదంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. నిరుద్యోగులు, ఓయూ జేఏసీ నాయకులు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. కేటీఆర్‌ గారూ… సాక్ష్యాలివిగో అంటూ ప్రవళిక గ్రూప్స్‌కు దరఖాస్తు చేసిన వివరాలను వారు పొందుపర్చడం గమనార్హం. గ్రూప్‌-2 వాయిదా, డీఎస్సీ వాయిదా పడిన నేపథ్యంలో ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె మరణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలపైనా ప్రభావం చూపే పరిస్థితి తలెత్తింది. ఇంత క్లిష్టమైన సమయంలో మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ మాటలు ఆయన మాటల్లోనే ‘ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు చెప్పారు. అది తెలుసుకోకుండా ప్రతిపక్షాలు హడావుడి చేశాయి. ఆమె ఆత్మహత్యపై చర్చ జరిగి వాట్సాప్‌ చాట్‌ బయటికి వస్తే ఆమె కుటుంబం పరువు పోదా?. అసలు ఆ అమ్మాయి గ్రూప్స్‌కే దరఖాస్తు చేయలేదంటున్నారు. తెలుసుకోండి మీరు. రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున్‌ ఖర్గే ట్వీట్‌ చేస్తారు. కనీసం ఆ సమాచారం?, నిజమా కాదా? అని తెలుసుకోకుండా ధ్రువీకరించుకోకుండా ఒక అమ్మాయి మరణం పట్ల ఇంత దిగజారుడుతనంతో రాజకీయం చేయడం కరెక్టా?. ఓట్లు, రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. దేశానికి ప్రధాని అవుతానని కలలు కనేవారు, మాట్లాడే ముందు ఆలోచించాలి కదా?. జాగ్రత్తగా ట్వీట్‌ చేయాలి.’అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. దీనిపై నిరుద్యోగులు, ఓయూ జేఏసీ నాయకులు, కొన్ని మీడియా సంస్థలు ముఖ్యంగా సోషల్‌ మీడియాలో మంత్రి వ్యాఖ్యలు అబద్ధమని తేలిపోయిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉండి, బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి కనీస సమాచారం తెలుసుకోకుండా మాట్లాడ్డాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. అయితే ఆయన తెలుసుకోకుండా మాట్లాడ్డమే కాకుండా రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే ట్వీట్లపై స్పందించడం, ఆమె మరణాన్ని దిగజారుడుతనంతో రాజకీయం చేయడంపై వ్యాఖ్యానించడం సరైంది కాదంటున్నారు. ప్రవళిక కుటుంబానికి మంత్రి కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలనీ, ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనీ, ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్లు వస్తున్నాయి.