వృత్తిదారులకు చేయూతనివ్వాలి..

– మండల సొసైటీలకే ప్రభుత్వ సంస్థల బట్టలు ఉతికే పనిని కేటాయించాలి
– రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారికి వినతి
– తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వృత్తిదారులకే ప్రభుత్వ సంస్థల బట్టలు ఉతికే పనిని కేటాయించాలని జీవో నెం102ను విడుదల చేసిందనీ, అందులో స్పష్టమైన విధివిధానాలను రూపొందించాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వెనుకబడిన తరగ తుల సంక్షేమ శాఖ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. మున్సిపాలిటీ, మండలాన్ని యూనిట్‌గా తీసుకుని సొసైటీలను గుర్తించాలని కోరారు. మండలం సొసైటీలకే ప్రభుత్వ సంస్థల బట్టలు ఉతికే పనిని కేటాయించాలని డిమాండ్‌ చేశారు.ప్రభుత్వ ఆస్పత్రులు, పోలీసు శాఖ, ప్రత్యేక బెటాలియన్లు, విశ్రాంతి భవనాలు, దేవస్థానాలు, హాస్టళ్లలో వాషింగ్‌ ప్లాంట్లను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. టెండర్‌ విధానం లేకుండా ఇవ్వాలని కోరారు. పీసు రేటు నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. సొసైటీ సభ్యులకు ఆరోగ్య, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. వృత్తిదారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలనీ, బీసీ, సాంఘీక సంక్షేమ, మైనార్టీ గురుకులాలతోపాటు టూరిజంశాఖ పనులను కూడా రజక వృత్తిదారులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య, ఉపాధ్యక్షులు ఎం బాలకృష్ణ, జ్యోతి ఉపేందర్‌,సి మల్లేశ్‌, సీహెచ్‌ వెంకటస్వామి, ఎస్‌ సునీత పాల్గొన్నారు.