కామ్రేడ్‌ ఏచూరి వారసత్వాన్ని కొనసాగిద్దాం!

కామ్రేడ్‌ ఏచూరి వారసత్వాన్ని కొనసాగిద్దాం!సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కామ్రేడ్‌ సీతారాం ఏచూరి భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి అందించిన సేవలు, వారసత్వం హఠాత్తుగా, అనూహ్యంగా నిలిచిపోయాయి. ఆయన అకాల మరణంతో అతను చేయాల్సిన పని అసంపూర్తిగా మిగిలిపోయింది. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి ఏచూరి చేయాల్సింది ఇంకా చాలా ఉంది. అంతే కాదు. వారి హఠాన్మరణం వల్ల భవిష్యత్‌ తరాలు వారి అమూల్యమైన మార్గదర్శ కత్వాన్ని కోల్పోయాయి.
సీతారాం ఏచూరి కమ్యూనిస్టు ఉద్యమంలో అత్యున్నతమైన, బహు ముఖ ప్రజ్ఞ కలిగిన నాయకుడు. అతను మార్క్సిజం, లెనినిజంపై పాండిత్యం, గట్టి సైద్ధాంతిక పునాది ఉన్నవాడు. అంతే కాదు, మార్క్సిస్టు అర్థశాస్త్రంలో అతని నైపుణ్యం కూడా ఎన్నతగ్గది. కమ్యూనిస్టు ఉద్యమ వ్యతిరేకులు కూడా సైద్ధాంతిక లేదా ఆర్థిక అంశాలపై అతనితో సవాల్‌ చేయడానికి సాహసించే వారు కాదు. ఎందుకంటే, అతను తన పదునైన, ఫలవంతమైన వాదనలతోనే కాకుండా శక్తివంతమైన రచనలతో తమను ఎలాగైనా ఒప్పిస్తాడన్న సంగతి వాళ్లకి కూడా తెలుసు. సీపీఐ(ఎం) తరఫున ఒక అంశంపై వాదించే ముందు దానికి సంబంధించిన విభిన్న కోణాలను విస్మరించేవాడు కాదు. చర్చల్లో పాల్గొనేటప్పుడు తీవ్రమైన వాదోపవాదాలు చేస్తూనే వాటిని ఆస్వాదించేవాడు. అదే సమయంలో విశాల దక్పథంతో వ్యవహరించేవాడు.
అంకితభావం కలిగిన సీరియస్‌ విద్యార్థి నాయకుడిగా సీతారాం ఏచూరి దేశం నలుమూలలా విస్తతంగా పర్యటించారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక లక్షణాలను, వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి వివిధ రాష్ట్రాలను సందర్శించారు. ఈ లోతైన అధ్యయనం అతను వివిధ రాష్ట్రాల్లో విద్యార్థి ఉద్యమాలను సమర్ధవంతంగా నిర్మించడానికి తోడ్పడింది. అతని ప్రయత్నాలు భారతదేశమంతటా విద్యార్థి ఉద్యమం, దాని నిర్మాణం పెరుగుదల, విస్తరణకు తోడ్పడ్డాయి. విద్యార్థి నాయకుడిగా అంతర్దష్టి, గడించిన అనుభవం అమూల్యమైనవనే విషయం తర్వాతి కాలంలో అతడు పార్టీలో సమర్థవంతమైన నాయకుడిగా ఎదిగే క్రమంలో నిరూపించబడింది.
వివిధ ముఖ్యమైన ప్రచురణలను రాసే, సంపాదకత్వం వహించే క్రమంలో ఏచూరి తన అసాధారణమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ పత్రిక ‘స్టూడెంట్‌ స్ట్రగుల్‌’కి సంపాదకునిగా దానిని విభిన్నంగా, ఆకర్షణీయమైన రూపంతో తీర్చి దిద్దడమే కాక, మంచి నాణ్యత, వైవిధ్యమైన అంశాలతో అభివద్ధి చేశాడు. ఇది ఆ సమయంలో విద్యార్థి ఉద్యమ నాయకుల దష్టిని ఆకర్షించడమే కాక అగ్రశ్రేణి మేధావులు, విమర్శకులను కూడా ఆకట్టుకుంది. ఇదే ఒరవడిని కామ్రేడ్‌ ఏచూరి సీపీఐ(ఎం) వారపత్రిక ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ త్రైమాసిక సైద్ధాంతిక పత్రిక ‘ది మార్క్సిస్టు’కు సంపాదకునిగా పనిచేసిన సమయంలో కూడా కొనసాగించారు. వీటన్నిటితో పాటు ఏచూరి అసంఖ్యాకమైన విలువైన పుస్తకాలు కూడా రాశారు. అనేకమంది కమ్యూనిస్టులకు రాజకీయ సైద్ధాంతిక పోరాటాల సందర్భంగా ఈ పుస్తకాలు ముఖ్య వనరులుగా ఉపయోగపడ్డాయి.
సీపీఐ(ఎం)తో సంబంధాన్ని కొనసాగించింది వియత్నాం కమ్యూనిస్టు పార్టీనే
1964లో సీపీఐ(ఎం) ఏర్పడిన ప్రారంభ దినాలలో అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం నుంచి ఒంటరిపాటుకు గురైంది. ప్రధాన రాజకీయ పార్టీలైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ యుఎస్‌ఎస్‌ఆర్‌, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా సీపీఐ(ఎం) పట్ల ప్రతికూల వైఖరిని అవలంబించాయి. ఒక్క వియత్నాం కమ్యూనిస్టు పార్టీ మాత్రమే ఈ కాలంలో సీపీఐ(ఎం)తో సంబంధాన్ని కొనసాగించింది. ఒంటరిగా ఉన్నప్పటికీ సీపీఐ(ఎం) తన సైద్ధాంతిక, రాజకీయ విధానాలపై స్థిర నిర్ణయంతో ఉంది. తన పార్టీ సొంత కార్యక్రమాన్ని అనుసరిస్తూ, వర్గ, సామూహిక పోరాటాలను అభివద్ధి చేయడంపై దష్టి పెట్టింది. కాలక్రమేణా సీపీఐ(ఎం) కార్మిక, రైతాంగ, మధ్య తరగతి వర్గాల్లో గుర్తింపు, ఆమోదాన్ని పొందింది. ఈ పెరుగుతున్న మద్దతు కేరళ, పశ్చిమ బెంగాల్‌, త్రిపురలో వామపక్ష ప్రజాతంత్ర, వామపక్ష నాయకత్వంలోని ప్రభుత్వాల ఏర్పాటులో ప్రతిబింబించింది. ఈ అనుభవాల ద్వారా ప్రధాన అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీలు సీపీఐ(ఎం) పట్ల గతంలో ఉన్న అపార్ధాలను సరిచేసుకుని పార్టీల మధ్య రాజకీయ సంబంధాలు అభివద్ధి చేయడం ప్రారంభించాయి. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి అవటానికి ముందు హరి కిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ ప్రపంచవ్యాప్తంగా వివిధ కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలతో రాజకీయ సంబంధాలు నెలకొల్పడంలోనూ, కొనసాగించడంలోనూ కీలక పాత్ర పోషించారు. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా కామ్రేడ్‌ ఏచూరిని ఈ బాధ్యత ల్లోకి ప్రవేశపెట్టారు. చివరికి ఆయన పార్టీ అంతర్జాతీయ విభాగానికి ఇన్‌చార్జిగా నియమించబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలతో బలమైన సంబంధాలను నేరపుతూ సీతారాం ఏచూరి కీలక పాత్రను నిర్వహించారు. అతని పని లాంఛనప్రాయ సంబంధాలకు మించి ఉండేది. సోదర పార్టీల సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణాత్మక అంశాలను ఏచూరి చాలా లోతుగా అధ్యయనం చేశాడు. ఈ ప్రయత్నం సీపీఐ(ఎం)కి అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంపై సమగ్ర అవగాహన పెంపొందించుకో వడానికి, అంతర్జాతీయ వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవటంలోనూ దోహదపడింది.
కేంద్రీకత ప్రజాస్వామ్యం అనేది కమ్యూనిస్ట్‌ పార్టీ యొక్క ప్రాథమిక నిర్మాణ సూత్రం. ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి దాని ఆచరణకు గట్టిగా కట్టుబడి ఉన్నారు. కమ్యూనిస్ట్‌ పార్టీలో, సంఘటిత నిర్ణయాలను అమలుచేసే క్రమంలో, నిర్మాణ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటూనే, స్వేచ్ఛాయుతంగా చర్చ జరిపే స్వేచ్ఛ ఉండాలి. ఈ సూత్రానికి ఆయన చైతన్యపూర్వకంగా కట్టుబడి ఉండడం ఆయన హయాంలో పార్టీని ఏకీకతం చేయడంలో దోహద పడింది. సీతారాం ఏచూరి మనముందు అనేక ముఖ్యమైన పాఠాలు, అసంపూర్తిగా ఉన్న అనేక పనులను మిగిల్చివెళ్లారు. అతను మనతో లేకపోవడం నిస్సందేహంగా మనల్ని కలవరపరుస్తుంది. కానీ నిరాశ చెందేందుకు, లేదా అలసత్వం వహించేందుకు ఇది సమయం కాదు. వామపక్ష ఐక్యతను పెంపొందించుకుంటూ, వామపక్ష- ప్రజాస్వామ్య లౌకిక కూటమిని బలపరుస్తూ, తనను తాను బలోపేతం చేసుకోవడం పార్టీ ముందున్న తక్షణ కర్తవ్యం. కామ్రేడ్‌ సీతారాం ఏచూరి స్మతిని నిజంగా గౌరవించటమంటే, ఈ సవాళ్లను మనం చిత్తశుద్ధితో, సీరియస్‌గా ఎదుర్కోవాలి. నిబద్ధతను పునరుద్ధరించు కుని ప్రజలకు చేరువ కావాలి. వివిధ పోరాటాలలో ప్రజలను సమీకరించడానికి సానుకూల ప్రయత్నాలు చేయాలి. యువతరాన్ని ఆకర్షించడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అడ్డంకులను అధిగమించి దాని లక్ష్యాలను సాధించగల సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా పార్టీని చైతన్యవంతం చేయాలి.
వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులను ఏకం చేయడంలో కీలకపాత్ర
ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీ కూటమిని ఒంటరిని చేసి, ఓడించాలంటే దేశంలోని వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులను ఏకం చేయడం అత్యంత అవసరం. ఈ కీలక పనిలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి కీలక పాత్ర పోషించారు. ఈ ఐక్యతను నిర్మించడానికి అవసరమైన రాజకీయ మెళకువలను, వ్యూహాలను వినమ్రతతోనూ, నైపుణ్యంతోనూ సాధించారు. ఇతర రాజకీయ పార్టీలతో సమావేశాలు, చర్చల్లో హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌తో కలిసి పాల్గొనే క్రమంలో యేచూరి తన సామర్థ్యాలను పదును పెట్టుకున్నారు. పార్లమెంటు ఎగువ సభ సభ్యునిగా సీతారాం రాజకీయ పరిపక్వతను, సమర్థతను ప్రదర్శిస్తూ గణనీయమైన ప్రభావాన్ని చూపారు. పార్లమెంటులో విభిన్న రాజకీయ పార్టీలతో కలివిడిగా ఉండే అతని సామర్థ్యం లౌకిక శక్తుల మధ్య సమన్వయం, ఐక్యతను పెంపొందించడానికి సహాయపడింది. గత కొన్ని సంవత్సరాలలో, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇండియా బ్లాక్‌ని ఏర్పాటు చేయడంలో ప్రభావవంతంగా వ్యవహరించడంలో అతని పాత్ర ప్రత్యేకంగా చెప్పుకోదగినది.
మాణిక్‌ సర్కార్‌