ఆరు గ్యారంటీల అమలు కోసం పోరాడుతాం : కాసం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆరు గ్యారంటీల అమలు కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల పక్షాన పోరాడుతామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఎన్నికల ముందు ఏవేవో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు గుంజడం కోసమా? కేసీఆర్‌ కుటుంబాన్ని అవినీతి నుంచి రక్షించడం కోసమా? అని ప్రశ్నించారు. జ్యుడీషియల్‌ విచారణ పేరుతో కాలయాపన చేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. శనివారం హైదరా బాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పాలన విషయంలో దశదిశా లేదనీ, పదవుల మోజులో రాజకీయం చేద్దామనే ఆలోచనలో ఆ పార్టీ నేతలున్నట్టు కనిపిస్తున్నదని విమర్శించారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి లాంటి వారే ప్రకటిస్తున్నా రనీ, అలాంటప్పుడు బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిం చారు. అదానీది అవినీతి సొమ్ము అయితే తెలంగాణలో పెట్టుబడుల కోసం అతని కంపెనీతో ఎలా ఒప్పందం చేసుకున్నారని రేవంత్‌రెడ్డిని నిలదీశారు.