కేరళ పట్ల కేంద్రం అలసత్వాన్ని ఎత్తిచూపుదాం

– 11 నుంచి 21వరకు దేశవ్యాప్తంగా ప్రచారం
– సీఐటీయూ, ఏఐకేఎస్‌, ఎఐఏడబ్ల్యూయూ నిర్ణయం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కేరళ సంఘీభావ ప్రచారాన్ని డిసెంబరు 11 నుంచి 21వరకు సమిష్టిగా చేపట్టాలని సీఐటీయూ, ఏఐకేఎస్‌, ఎఐఏడబ్ల్యూయూ రాష్ట్ర శాఖలు నిర్ణయించాయి. ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వ ప్రజానుకూల విజయాలు, ప్రత్యామ్నాయాలపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనుంది. కేరళ ప్రభుత్వ రుణ పరిమితులను కుదించడం, సహకార సమాఖ్య వాదానికి ముప్పు వాటిల్లేలా చట్టబద్ధమైన ఆర్థిక కేటాయింపులను నిరాకరించడంతో సహా కేరళ ప్రజల హక్కులను అణచివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా తీసుకుంటున్న కక్షసాధింపు చర్యలను ఈ ప్రచార సమయంలో ఎండగట్టనున్నారు.
ఈ మేరకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌, ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్షన్‌, ఎఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌లు ఒక ప్రకటన జారీ చేశారు. వాయనాడ్‌ కొండచరియలు విరిగిపడిన విపత్తు బాధితులకు సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఈ విషాద ఘటనలో దాదాపు 400మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత విషాదం సంభవించినా ఈ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న కేరళ ప్రభుత్వ అభ్యర్ధనను కేంద్రం తిరస్కరిస్తోంది. బాధితులకు ఎంతగానో అవసరమైన సాయాన్ని అందించకపోవడం అమానుషమని, తీవ్రమైన వివక్ష అని దీన్ని ఏ రకంగానూ సమర్ధించలేమని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పది రోజుల ప్రచార పర్వంలో భాగంగా రాష్ట్రాల రాజధానులు, ప్రధాన నగరాల్లో సెమినార్లు నిర్వహించనున్నారు. మూడు సంఘాలకు చెందిన అఖిల భారత నేతలు ఈ సెమినార్లలో పాల్గొంటారు.