– ఫిబ్రవరి 16న మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమ్మె : ఎస్వీ.రమ
– మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా వై.స్వప్న
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పికొట్టడంలో భాగంగా లక్షలాది కుటుంబాల దగ్గరకు వెళ్లి వివరించాలనీ, ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని మధ్యాహ్న భోజన పథకం కార్మి కుల యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ.రమ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆ యూనియన్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల ప్రజల కోసం 40 ఏండ్ల నుంచి కొనసాగుతున్న పథకాలకు కేంద్ర ప్రభుత్వం కోతపెడుతున్నదని విమర్శించారు. దీనివల్ల కోటిమంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ప్రజలకు పథకాలు దూరం అవుతున్నాయని తెలిపారు. ఐఎల్‌డీ తీర్మానం ప్రకారం స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీసవేతనాలివ్వాలనీ, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికం, ఆకలి మొదలైన కీలక అంశాలనుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మతం పేరుతో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. అనంతరం తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా వై.స్వప్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో ఆ యూనియన్ ఆఫీస్ బేరర్లు బాలలక్ష్మి, మాయ, కృష్ణమాచారీ, రాధాబాయి, యాకలక్ష్మి, యూనియన్ రాష్ట్ర నాయకులు విజేందర్, చిన్నన్న, గీత, రజిత, భాగ్య, సిద్ధమ్మ, శారద తదితరులు పాల్గొన్నారు