– దుబ్బాకలో మహాసభల వాల్ పోస్టర్లు ఆవిష్కరణ
నవతెలంగాణ – దుబ్బాక
కేంద్రంలోని బీజేపీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజా,కార్మిక,రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొడదామని సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీ.భాస్కర్ పిలుపునిచ్చారు.సరళీకరణ ఆర్థిక విధానాలతో పేద,మధ్య తరగతి ప్రజలపై భారం మోపుతూ బడా కార్పొరేట్లకు లాభాలు చేకూరుస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు.ఈనెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డి పట్టణంలో జరగనున్న సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర నాల్గవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం దుబ్బాకలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ సర్కార్ నియంతృత్వ విధానాల వల్ల దేశంలో నిరుద్యోగం,నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని.. కార్మికులకు కనీస వేతనాలు,రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.మహిళలు,దళిత,గిరిజను లు,మైనార్టీలపై అనేక దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు.విద్యా,వైద్య,ప్రభుత్వ రంగాలన్నింటిని ప్రైవేటీకరణ చేస్తుందని విమర్శించారు.మతం పేరుతో ప్రజల మధ్య వైశామ్యాలు సృష్టిస్తూ.. రాజ్యాంగ హక్కులను,రాష్ట్రాల హక్కులను హరిస్తున్న బీజేపీ ని ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ప్రజా సమస్యల పరిష్కారం,ప్రజాస్వామ్యం,లౌకిక విలువల పరిరక్షణకై అనునిత్యం పోరాడే సీపీఐ(ఎం) వామపక్ష ఉద్యమాన్ని బలపరచాలని.. సంగారెడ్డిలో జరిగే సీపీఐ(ఎం) రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.సీపీఐ(ఎం) దుబ్బాక పట్టణ కార్యదర్శి కొంపల్లి భాస్కర్ నాయకులు ఎండీ.సాజిద్,బత్తుల రాజు,మెరుగు రాజు,లక్ష్మీనరసయ్య,ఎల్లయ్య,పలువురున్నారు.