– ఎమ్మెల్యేల సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజలు అందించిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారకరామారావు సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, పార్టీ సీనియర్ నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారితో కేటీఆర్ మాట్లాడారు. పదేండ్లలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో అనేక అద్భుత కార్యక్రమాలు చేపట్టామనీ, అందుకే ప్రజలు ఇంకో పార్టీకి అవకాశం ఇచ్చారని తెలిపారు. తమ పార్టీకి గౌరవప్రద స్థానాలను కట్టబెట్టారన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామన్నారు. ఎన్నికల తర్వాత ప్రజల నుంచి తమ పార్టీ నాయకత్వంపైన సానుకూల స్పందన వస్తున్నదని చెప్పారు. తమ పార్టీ అధికారం కోల్పోతుందని అనుకోలేదన్నారు. సమాజంలోని అన్ని వర్గాల నుంచి వందలాది మెసేజ్‌లు వస్తున్న విషయంపై చర్చించారు. త్వరలోనే పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకుపోతామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సచివాలయం, ప్రగతిభవన్ కేంద్రంగా విధులు నిర్వహించిన మనమంతా, ఇకపైన పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు.