‘చాపకింద నీరోలే..
చీకట్లు అలుముకోకుండా..
పసిగట్టి ఊడ్చిపారెయ్యాలి..
బంగారానికి మెరుగుపెట్టినట్టు..
పోరాటానికి పుటం పెట్టుకోవాలి..
ఊట చెలిమల్ని తరిమి..
ఊపిరులను ఊదుకోవాలి..
పోరు దారిలో దివిటి లెక్క
వెలుగుపూలై పూయాలి’ అని కవి పిలుపిచ్చినట్టు గత స్మృతులను నెమరేస్తూనే కొత్త ఆశలకు ఊపిరి పోసుకోవాలి. అనుభవాల నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి. జ్ఞాపకాల్లో ఉండే ప్రయోజనం అదే మరి. ఈ ఉదయం ఒక్కసారి వెనక్కి చూసి ముందుకు పురోగమించాలి. కొత్త వత్సరాన్ని ఉత్సాహంగా పరిగెత్తించాలి.
రాజకీయంగా చూస్తే గత పదేండ్ల నుండి దేశంలో తమకు తిరుగులేదని, తాము చేసిందే శాసనమని విర్ర వీగే మతతత్వ, నిరంకుశ శక్తులకు 2024 ఎన్నికల్లో ప్రజలు కీలెరిగి వాత పెట్టారు. గతేడాది మనకందించిన ఓ స్ఫూర్తిదాయకమైన తీర్పుగా దీన్ని చెప్పుకోవచ్చు. అయితే ఎన్ని వాతలు పెట్టినా కాషాయ దళం మాత్రం ప్రజలను విచ్ఛిన్నం చేసే విధానాల నుండి వెనక్కు తగ్గకపోవడం గమనిం చాల్సిన విషయం. ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగించే జమిలి ఎన్నికల అజెండాను పదే పదే ముందుకు తెస్తూనే ఉన్నారు. ఏదో ఒక రూపంలో దేశ సంపదను కార్పొరేట్లకు అప్పగిస్తున్నారు. న్యాయవ్యవస్థలోనూ మార్పులు తెచ్చారు. కార్మికుల గొంతు కోసేందుకు నాలుగు నల్ల చట్టాలు తెచ్చిపెట్టారు. ఇలా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానిస్తున్నారు. ప్రజలు గతేడాది ఎంత అప్రమత్తంగా ఉన్నా చాపకింద నీరులా బీజేపీ ప్రభుత్వం తన విధానాలను అమలు చేస్తూనే ఉంది. ఇలా మతోన్మాద ప్రమాదం వెన్నంటే ఉంటూ ప్రజలపై దాడి కొనసాగి స్తోంది. దేశ ఆర్థిక పరిస్థితులూ దిగజారిపోతున్నాయి. ఒకవైపు రూపాయి విలువ పాతాళానికి పడిపోతున్నది. మరోవైపు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
గత కాలపు పీడననొకమారు పరామర్శిస్తే.. మహిళలు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలపై దాడులు విపరీతమైన పెరిగిపోయాయి. కోల్‌కతా మహిళా డాక్టర్ ఉదంతం దీనికి ఓ ఉదాహరణైతే.. గురువు చేత విద్యార్థి కాళ్లు పట్టించిన దారుణ ఘటన మన పాలకుల మతోన్మాద విధానాలకు పరాకాష్టగా చెప్పుకోవచ్చు. మణి పూర్ మంటలు ఇంకా చల్లారలేదు. అక్కడి సమస్య రావణకాష్టంలా రగులుతూనే ఉంది. నిజానికి మన పాలకులకు కావల్సింది కూడా ఇదే. కాశ్మీర్‌లో ఉగ్రదాడులూ ఆగలేదు. ఒక్క మన దేశమే కాదు ప్రపంచం యావత్తు అభద్రతలోనే ఉంది. బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతుంటే పాలస్తీనా, ఉక్రెయిన్ వంటి దేశాల్లో ఏండ్ల తరబడి సాగుతున్న యుద్ధాలు అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ యుద్ధాల్లో బలైపోతుంది సామాన్య, సాధారణ, బలహీన ప్రజలే. అందునా పిల్లలు, మహిళలే. పాలుతాగే పసిపిల్లల శవాలు మన కండ్ల ముoదు నిత్యం కదలాడుతూనే ఉన్నాయి. ఈ అంతర్జాతీయ యుద్ధాలకు సామ్రాజ్య వాదాలు కారణమైతే మన దేశంలో జరుగుతున్న ఆరాచకాలకు, విధ్వంసాలకు కారకులు ఫాసిస్టు శక్తులుగా ఉన్న మతోన్మాదులనేది జగమెరిగిన సత్యం.
ఇటువంటి పరిస్థితుల్లో సీపీఐ(ఎం)కు ప్రతిభా వంతంగా నేతృత్వం వహించిన ఏచూరి మరణం దేశ మతో న్మాద వ్యతిరేక ఉద్యమాలకు తీరని నష్టం. ఇటీవల మనల్ని వదిలి వెళ్లిపోయిన లౌకికవాది, మాజీ ప్రధాని మన్మో హన్ మరణం మరో దెబ్బ. అలాగే మన దేశ కళను విశ్వవ్యాపితం చేసిన జాకీర్ హుస్సెన్ మరణం, సినీ ప్రపంచంలో ఓ ప్రత్యామ్నాయానికి మార్గం వేసిన శ్యాంబెనగన్‌లను కోల్పోవడం గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు. వీరి మరణం దేశ అభ్యుదయ ఉద్యమాలకు, రాజకీయ, కళా రంగాలకు తీరని లోటు.
గత అనుభవాలను పరిశీలిస్తే.. ప్రజలు ఎక్కడైతే చైతన్యయుతంగా పోరాటం చేస్తున్నారో అక్కడ పాలకులు వెనకడుగు వేస్తున్నారనేది కూడా గతేడాది నుండి మనం నేర్చుకున్న పాఠం. అక్కడక్కడ తమ పోరాటాలతో ప్రజలు పాలకుల మెడలు వంచుతున్నారనే నిజాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఈ పాఠాన్ని మనం 2024 నుండి నేర్చుకోవల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలోనూ పాలకుల విధానాలను తిప్పికొట్టేందుకు పోరాటాలే మార్గమని ఈ అనుభవాలే చెబుతున్నాయి. కనుక గతేడాది ఘటనలు, ప్రభుత్వ విధానాల నుంచి గుణపాఠాలు తీసుకొని, వచ్చే ఏడాదికి మరింత చైతన్యవంతమై పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఇదే సందర్భంలో లౌకికశక్తులు మరింత బలపడాల్సిన అవసరమూ కనిపిస్తున్నది. 2025లో మరింత సంఘటితమై ప్రజలు పోరాడకపోతే మరిన్ని దాడులు జరిగే ప్రమాదముంది. ఐక్య పోరాటాలే నేడు ప్రజల ముందున్న కర్తవ్యం.