– కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
నవతెలంగాణ-ఆసిఫాబాద్
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరం సమిష్టిగా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం సిర్పూర్ పేపర్ మిల్లు లిమిటెడ్-కాగజ్‌నగర్ ఆధ్వర్యంలో కళాకారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు, కాగజ్‌నగర్ ఆర్డీఓ కాసబోయిన సురేష్‌లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిషేధిత ప్లాస్టిక్ వాడకాన్ని అందరూ సమిష్టిగా నిరోధించాలని, ప్లాస్టిక్ వినియోగం నివారణకు ప్రజలందరూ స్వచ్ఛందంగా కృషి చేయాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల భావితరాలకు జరిగే నష్టాన్ని ప్రజలకు అవగాహన కార్యక్రమాల ద్వారా వివరించి చైతన్యం చేయాలన్నారు. ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్ధాలను బయట పడవేయడం వల్ల వాటిని పశువులు తిని మరణించే అవకాశం ఉందని, ప్లాస్టిక్ వ్యర్థాలను పారిశుధ్య నిర్వహణలో భాగంగా చెత్త సేకరణకు వచ్చే వారికి అందించాలని తెలిపారు. జీవరాశికి సహజ వాయువును అందించి, వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ వన మహోత్సవం కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలు నాటి సంరక్షించేందుకు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలన్నారు. అనంతరం స్వచ్ఛతపై అధికారులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిర్పూర్ కాగితపు పరిశ్రమ ప్రతినిధులు రీనాజార్జ్, అశోక్, కళాకారులు, ప్రజలు పాల్గొన్నారు.