మహిళారక్షిత సమాజం నిర్మిద్దాం

– రాష్ట్రంలో తగ్గిన మాతా శిశుమరణాలు
– స్త్రీ, శిశుసంక్షేమానికి ప్రభుత్వం కృషి : రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
మహిళారక్షిత సమాజం నిర్మిద్దామని, మహిళలకు అండగా నిలుద్దామని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. పోషకాహార లోపాన్ని నివారించి, ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ మహిళా ప్రాంగణంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో శనివారం ‘పోషణ మహా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతాక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, పిల్లలు పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పారు. అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలతో పోషణ పంచాయతీ కమిటీల సమావేశం ఏర్పాటు చేసి పోషణ లోపం, ఆరోగ్యంపై అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో న్యూట్రీగార్డెన్స్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. ఆదివాసీ, గిరిజన మహిళలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని శాశ్వతంగా దూరం చేసేందుకు తెలంగాణ సర్కారు ‘గిరి పోషణ’ కార్యక్రమాన్ని అమలు చేసిందన్నారు.
మహిళలకు సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు కానీ మహిళా హెల్ప్‌లైన్‌ నంబర్‌ 181 లేదా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ వాట్సప్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 9490555533కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్‌ సభ్యులు షాహిన్‌ అఫ్రోజ్‌, కుమ్ర ఈశ్వరి భారు, కటారి రేవతిరావు, గద్దల పద్మ, సుధాం లక్ష్మి, కటారి రేవతిరావు, డైరెక్టర్‌ శారద, సెక్రెటరీ కృష్ణకుమారి, డీఆర్డీవో ప్రభాకర్‌, సీడీపీవో సృజన తదితరులు పాల్గొన్నారు.