పొగాకు రహిత పాఠశాలలను నిర్మిద్దాం: సబితారాణి 

నవతెలంగాణ పెద్దవంగర: పొగాకు రహిత పాఠశాలలను నిర్మిద్దామని అవుతాపురం పల్లె దావఖాన వైద్యాధికారి సబితారాణి అన్నారు. గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల పొగాకు రహిత పాఠశాలగా సోమవారం గుర్తించారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి, పొగాకు ఉత్పత్తులు, మత్తు పదార్థాలు, గుట్కా, క్యాన్సర్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కళాధర్ తో కలిసి మాట్లాడుతూ.. పాఠశాలలు వాటి పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల రహిత వాతావరణం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగా పాఠశాలకు 100 గజాల్లోపు సిగరెట్ ఇతర పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించినట్లు తెలిపారు. విద్యాసంస్థలు వాటి పరిసరాలు పొగాకు రహిత ప్రాంతాలుగా ఉండేలా, ఇతర కార్యక్రమాలను సైతం వైద్య ఆరోగ్య శాఖతో కలిసి సంయుక్తంగా చేపడుతున్నామని వివరించారు. విద్యార్థులు పొగాకు మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. పొగాకు వాడకంతో మానవాళికి ముప్పు కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, హెల్త్ అసిస్టెంట్ జ్యోత్స్న, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.