– తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్
చెన్నై: ప్రధాని మోడీపై తమిళనాడు మంత్రి, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ విరుచుకుపడ్డారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రంపై ఆయన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. ఇకపై మోడీని 28 పైసల ప్రధాని అని పిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎందుకంటే పన్ను రూపంలో రాష్ట్రం చెల్లించే ప్రతి రూపాయిలో కేంద్రం 28 పైసలు మాత్రమే తిరిగి మనకు వస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకే రాష్ట్రాలకే అత్యధిక నిధులు కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే మనం మోడీని 28 పైసల ప్రధాని అని పిలుద్దామని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామనాథపురం, థేనిలో ఉదయనిధి ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు చిన్నారుల భవిష్యత్తును దెబ్బతీయడానికే కేంద్రం జాతీయ విద్యా విధానాన్ని (ఎన్‌ఈసీ) తీసుకొచ్చిందని ఆరోపించారు. అదేవిధంగా నిధుల పంపిణీ, అభివృద్ధి కార్యక్రమాలు, నీట్ నిషేధం వంటి అంశాల్లో తమిళనాడుపై కేంద్రం వివక్ష చూపిందని విమర్శించారు. మధురైలో నిర్మిస్తున్న ఎయిమ్స్ హాస్పిటల్‌కు సంబంధించి శంకుస్థాపనకు ఉపయోగించిన ఇటుకను ప్రదర్శించారు. నీట్ నిర్మాణం ముందుకు సాగడం లేదనడానికి ఇదే నిదర్శమన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే ప్రధాని తమిళనాడు పర్యటనకు వస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి.