పేద దేశాలకు అనుగుణంగా నిబంధనలు మారుద్దాం: జి-77

Let's change the rules to suit poor countries: G-77ప్రతి ఏడాది సెప్టెంబరు పదహారవ తేదీని ”పేద దేశాల శాస్త్ర, సాంకేతిక, నవీకరణ దినం”గా పాటించాలని 2023 సెప్టెంబరు 15-16 తేదీలలో క్యూబా రాజధాని హవానాలో జరిగిన జి-77+చైనా సభ పిలుపునిచ్చింది. నూతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, సామర్థ్యాలు, పరిస్థితులకు సంబంధించి ప్రస్తుతం అభివృద్ధి చెందిన, వర్థమాన దేశాల మధ్య తీవ్ర అసమానతలు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని సభ ఆమోదించిన తీర్మానంలో పేర్కొంది. దానికి నిదర్శనంగా కరోనా వాక్సిన్‌లను ఉదహరించింది. వర్తమాన సంవత్సరంలో కూటమి అధ్యక్షస్థానంలో ఉన్న క్యూబా అధ్యక్షుడు మియల్‌ డియాజ్‌ కానెల్‌ మాట్లాడుతూ కేవలం పది దేశాలు 90శాతం పేటెంట్లు, డిజిటల్‌ పరిజ్ఞాన ఎగుమతుల్లో 70శాతం కలిగి ఉన్నాయని చెప్పారు. సమాన అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక వ్యవస్థ ఏర్పడాలంటే అభివృద్ధి చెందిన దేశాల సాంకేతిక పెత్తనం కొనసాగితే కుదరదని అన్నాడు. అందువలన పేద, వర్థమాన దేశాల మధ్య ఈ రంగంలో మరింత సహకారం అవసరమని, అందుకే ఆట నిబంధనలను మార్చేందుకు పేద దేశాలు ముందుకు రావాలని చెప్పాడు. ధనిక దేశాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రపంచాన్ని తీసుకుపో తున్నాయి, పేద దేశాలు ఆట నిబంధనలను మార్చాల్సిన తరుణం వచ్చిందన్నాడు. ప్రపంచంలో ప్రస్తుత బహుముఖ సంక్షోభంలో పేద దేశాలు బాధితులని, అసమాన వాణిజ్యం ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగటానికి కారణమని అన్నాడు. హవానా సభ ఆమోదించిన తీర్మానంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి… అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను సమూలంగా సంస్కరించాలి. ప్రపంచ విధానాల రూపకల్పన, నిర్ణయాల సంస్థలలో మరింత సమన్వయంతో పాటు వర్ధమాన దేశాలకు ప్రాతినిధ్యం పెరగాలి. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, నవకల్పనలు ఈ దేశాలకు అందుబాటులోకి వచ్చే విధంగా విధానాల రూపకల్పన జరగాలి. డిజిటల్‌ గుత్తాధిపత్యం, అనుచిత పద్ధతులకు జి-77 వ్యతిరేకం. డిజిటల్‌ అసమానతలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. వర్థమాన దేశాల మీద ఆంక్షలు, ఆర్థికపరమైన బలవంతాలను ఈ కూటమి వ్యతిరేకిస్తుంది. ఇవి అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించటమే గాక సామాజిక, ఆర్థిక వృద్ధిని అడ్డుకుంటున్నాయి.
జాత్యహంకారానికి వ్యతిరేకంగా, నిరాయుధీకరణ, నూతన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాలతో 1964 జూన్‌ 15న ఆంక్టాడ్‌లో ఐరాస ప్రధాన కేంద్రంగా 77 దేశాల కూటమి ఏర్పడింది. దాని నుంచి రెండు ప్రారంభ దేశాలు తప్పుకోగా తరువాత కాలంలో మరో 60దేశాలు చేరాయి. చైనాను తమ సభ్యురాలిగా ఆ కూటమి పరిగణిస్తున్నది. అయితే చైనా మాత్రం తాను సభ్యురాలిని కాదని, కూటమికి అన్ని విధాలుగా సహకరిస్తానని ప్రకటించింది. అన్ని సమావేశాల నిర్ణయాలు, అమలులో భాగస్వామిగా ఉంది. అందువలన సాంకేతికంగా ఇప్పుడు 134 దేశాలే ఉన్నప్పటికీ చైనాను కలుపుకొని పోయేందుకు గాను అది జరిపే సమావేశాలు, చేసే ప్రకటనల్లో జి-77+చైనాగా వ్యవహరిస్తున్నారు. జనాభాలోనూ, ఐరాస దేశాల్లో ఎక్కువ సంఖ్యలోనూ ఈ కూటమిలో ఉన్నాయి. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రెస్‌ అందరికోసం పని చేసే ప్రపంచం కోసం పోరాడాలని పిలుపునిచ్చాడు. ఇటీవలి దశాబ్దాలలో పేద దేశాలు కోట్లాది మందిని దారిద్య్రం నుంచి వెలుపలికి తెచ్చినప్పటికీ ఇప్పుడవి పెరుగుతున్న దారిద్య్రం, ఆకాశానికి అంటుతున్న ధరలు, ఆకలి, పెరుగుతున్న రుణభారం, వాతావరణ నాశనం వంటి అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయని చెప్పాడు. ప్రపంచ వ్యవస్థలు, చట్రాలు పేద దేశాలను దెబ్బతీశాయి, ముగింపు ఏమిటో స్పష్టమే, దేశాలను అభివృద్ధి చేయటంలో ప్రపంచం విఫలమవుతున్నదని స్పష్టం చేశాడు. ఈ మాటలు ధనిక దేశాలను అభిశంసించటం తప్ప మరొకటి కాదు. పర్యావరణ న్యాయం జరగాలంటే ఆర్థిక న్యాయం జరగాలి, వాగ్దానం చేసినట్లుగా ధనిక దేశాలు అందుకోసం వంద బిలియన్‌ డాలర్లను విడుదల చేయాలి, 2025 నాటికి రెట్టింపు నిధులు ఇవ్వాలి, 2027నాటికి ప్రకృతి వైపరీత్యాల గురించి ప్రతి ఒక్క పౌరుడినీ ముందుగానే హెచ్చరించి రక్షణ కల్పించాలన్నాడు. నిరంతర అభివృద్ధి(ఎస్‌డీజీ) లక్ష్యాల సాధనకు ఏటా 500బిలియన్‌ డాలర్లు సమకూర్చాలి, అభివృద్ధి చెందుతున్న దేశాలలో తద్వారా అభివృద్ధి, వాతావరణ పరిరక్షణ కార్యాచరణకు పూనుకోవాలన్నాడు.
తన మిలిటరీ బలాన్ని చూపి అదిరించి బెదిరించి ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకొనేందుకు అమెరికా, దాని కూటమిలోని దేశాలు చూస్తున్నాయి. తమకు నచ్చని, తమ బాటలో నడవని దేశాల మీద ఉగ్రవాదం మీద పోరు, మరొక సాకుతో దాడులు, అక్రమణలకు, ఆంక్షల విధింపు వంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నాయి. ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు వంటి ధనికదేశాల పెత్తనంలోని సంస్థలతో పాటు ధనిక దేశాలు ఇచ్చే రుణాలకు అనేక షరతులు విధిస్తాయి, వడ్డీ రేటు కూడా ఎక్కువే. అదే చైనా ఇచ్చే రుణాలు తక్కువ వడ్డీతో పాటు సాధారణం తప్ప ఐఎంఫ్‌ మాదిరి షరతులేమీ ఉండవు. ఉదాహరణకు శ్రీలంక, పాకిస్థాన్‌ వంటి దేశాలకు ఐఎంఎఫ్‌ ఇచ్చిన రుణాలకు ప్రయివేటీకరణ, పన్నుల పెంపు, అన్నింటినీ ప్రయివేటు రంగానికి అప్పగించాలన్న షరతులతో దేశ ఆర్థిక విధానాల్లో చేయాల్సిన మార్పుల వంటివి ఉన్నాయి. చైనా రుణాలకు సాధారణ హామీ తప్ప మరొక షరతులేదు. ఈ కారణంగానే అనేక పేద, వర్థమాన దేశాలు చైనా రుణాల కోసం చూస్తున్నాయి. ప్రస్తుతం 160 దేశాలు రుణాలు తీసుకున్నాయి. వాటిలో 150 దేశాల్లో చైనా బీఆర్‌ఐలో పెట్టుబడులు కూడా పొందుతున్నాయి. గడచిన రెండు దశాబ్దాల్లో ప్రపంచ బలాబలాల్లో స్పష్టమైన మార్పు జరుగుతోంది. పేద దేశాల మధ్య వాసి, రాసి పరంగా సహకారం పెరుగుతోంది. నాలుగు దశాబ్దాల క్రితం వర్ధమాన దేశాలు ప్రపంచ జీడీపీలో 24శాతం సమకూర్చితే ఇప్పుడు నలభై శాతానికి పెరిగింది.
ఏ కూటమి సమావేశాలు కూడా రాజకీయాలకు అతీతంగా ఉండవు అన్నది గమనించాలి. బహుముఖ సంక్షోభంలో పేద దేశాలు బాధితులు గనుక ధనిక దేశాలకు వ్యతిరేకంగా సంఘటితం కావాలన్నది ఈ సమావేశాల్లో ముందుకు వచ్చిన అంశం. పేద దేశాలు ఈ పరిస్థితిని ఇంకేమాత్రం భరించే స్థితిలో లేనందున ధైర్యవంతమైన చర్యలకు పూనుకోవాలని వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో పిలుపునిచ్చారు. క్యూబా మీద ఆరు దశాబ్దాలుగా అమలు జరుపుతున్న ఆంక్షలు నేరపూరితమైనవని వర్ణించాడు. అమెరికా అనుచిత ఆంక్షలకు బలవుతున్న దేశాల్లో వెనెజులా కూడా ఒకటి అన్నది తెలిసిందే. నికరాగువా అధ్యక్షుడు డేనియల్‌ ఓర్టేగా మాట్లాడుతూ గత రెండు శతాబ్దాలుగా శత్రువు ఒకటే మనందరికీ తెలుసు, అదే అమెరికా అన్నాడు. పర్యావరణానికి హాని కలిగించే బొగ్గు, చమురు కర్బన ఉద్గారాలతో నిమిత్తం లేని ఆర్థిక వ్యవస్థ కావాలని కొలంబియా అధ్యక్షుడు గుస్తావ్‌ పెట్రో కోరాడు. వర్తమాన వాతావరణ మార్పుల కారణంగా 300కోట్ల మంది నెలవులు తప్పుతారని, సారవంతమైన భూములు ఎండిపోతాయని, ఆహార సంక్షోభం ఏర్పడుతుందని, ప్రజాస్వామ్యంలేని పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించాడు. రష్యా-ఉక్రెయిన్‌ పోరు మీద ఒక వైఖరి అనుసరిస్తున్నదేశాలు ఇజ్రాయెల్‌-పాలస్తీనా మీద భిన్నవైఖరిని అనుసరిస్తున్నాయని పశ్చిమ దేశాల మీద ధ్వజమెత్తాడు.
హవానా సమావేశాల్లో 30మంది వరకు దేశాధినేతలు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ జి-20 సమావేశాల్లో ఆఫ్రికా యూనియన్ను సభ్యురాలిగా చేర్చటంలో ప్రముఖ పాత్ర పోషించి పేద దేశాల ఛాంపియన్‌గా నిలిచినట్లు, వాటి వాణిగా ఉన్నట్లు చెప్పుకున్న ప్రధాని నరేంద్రమోడీ మొత్తం పేద, వర్థమాన దేశాలతో కూడిన జి-77 సమావేశాలకు ఒక దేశాధినేతగా హాజరు కావాల్సి ఉంది. కనీసం విదేశాంగ మంత్రి జై శంకర్‌నైనా పంపాల్సి ఉండగా మొక్కుబడిగా ఒక అధికారిని పంపటం ఈ కూటమి దేశాల్లో మన గురించి ఎలాంటి అభిప్రాయాలకు తావిస్తుందో వేరే చెప్పనవసరం లేదు. ఈ నెల పద్దెనిమిది నుంచి 22వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల కారణంగా మంత్రి హాజరు కావటం లేదని ప్రకటించారు. హవానా సమావేశాలు 15, 16 తేదీల్లో ముగిశాయి. పద్దెనిమిదవ తేదీన పార్లమెంటులో జరిగిందేమీ లేదు. పార్లమెంటులో ప్రతిపక్షాలతో సంప్రదింపులు, ఇతర అవసరాల కోసం పార్లమెంటరీ శాఖ మంత్రి ఉన్నారు. విదేశాంగ మంత్రి చేసేదేమీ లేదు. పార్లమెంటు సమావేశాలకు హాజరుకావటానికి తగినంత సమయం ఉన్నప్పటికీ వెళ్లకపోవటానికి కారణం ఏమిటి ?
దశాబ్దాల తరబడి అమెరికా, దాని మిత్ర దేశాల అన్ని రకాల దిగ్బంధనానికి గురి అవుతున్న క్యూబా జి-77కు ఆతిధ్యం ఇస్తున్నది. ఇది సహజంగానే అమెరికాకు ఇష్టం ఉండదు. లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ ప్రాంతంలోని అనేక దేశాలను అమెరికాకు వ్యతిరేకంగా కూడగట్టటంలో క్యూబా కీలకపాత్ర పోషిస్తున్నది. ఆ ప్రాంత దేశాలతో చైనా సంబంధాలు, పలుకుబడి కూడా పెరుగుతున్నది. ఆగస్టు 21న సెంట్రల్‌ అమెరికన్‌ పార్లమెంటు సమావేశం ఆమోదించిన తీర్మానంలో చైనాను శాశ్వత పరిశీలక దేశంగా ఆమోదిస్తూ అంతకు ముందు ఆ స్థానంలో ఉన్న చైనా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌కు ఇచ్చిన హౌదాను రద్దు చేసింది. చైనా-లాటిన్‌ అమెరికా దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం ఏటా 18శాతం పెరుగుతూ 2022 నాటికి 485.8 బిలియన్‌ డాలర్లకు చేరింది. చైనా పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున పెరిగాయి. ఆ కూటమిలోని దేశాలు అమెరికా, ఇతర ధనిక దేశాల పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నాయి. రష్యా -ఉక్రెయిన్‌ వివాదంలో అమెరికాకు వంతపాడేందుకు నిరాకరించాయి. మరోవైపున చైనా సహకారాన్ని దెబ్బతీసేందుకు పేద దేశాల మధ్య విభజనకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. పేద దేశాల ఛాంపియన్‌ భారత్‌ అని చెబుతున్నది. చైనాను వర్ధమాన దేశంగా గుర్తించకూడదంటూ ఏకంగా అమెరికా పార్లమెంటులో ఒక తీర్మానాన్నే చేశారు. చైనా ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ జనాభా ఎక్కువగా ఉన్న కారణంగా తలసరి జీడీపీ, ఆదాయం కూడా వర్థమాన దేశాల స్థాయిలోనే ఉంది. వర్థమానదేశంగా గుర్తిస్తే కొన్ని రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది, వాటిని ఎగవేసేందుకే తిరస్కరణ అన్నది స్పష్టం. ఇటీవలి కాలంలో చైనాను ఎంతగా దెబ్బతీయాలని చూస్తే అంతగా అమెరికా, దాని మిత్రదేశాలు విఫలం, చైనా ముందుకు పోవటం చూస్తున్నదే. అన్నింటినీ మించి పూర్తి సభ్యురాలు కాకున్నా చైనాకు కూటమిలో పెద్దపీట వేయటం, అమెరికా వ్యతిరేక విమర్శలకు వేదికగా ఉన్న చోట భారత్‌ ప్రేక్షకురాలిగా ఉండటం అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు సుతరామూ ఇష్టం ఉండదు. బహుశా విదేశాంగ మంత్రి గైర్హాజరుకు బయటకు వెల్లడించలేని అసలు కారణం ఇదే కావచ్చు.

ఎం. కోటేశ్వరరావు
8331013288