స్వాతంత్రోద్యమ స్పూర్తిని కొన‌సాగిద్దాం…

94900 98251ఎన్నో ఆశలు, మరెన్నో ఆకాంక్షలు. తరాల నాటి దోపిడీ పోతుందని, ఆనందంగా గడిపే రోజులు వస్తాయని కళ్లనిండా కలలు. అణిచివేత ఆగిపోతుందని, ఆత్మ గౌరవ జీవితం అందివస్తుందని, ఆర్థికంగా వ్యక్తి, వ్యవస్థ బలపడుతుందని అంచనాలు. బ్రిటీష్‌ పరిపాలన పోయి, దేశానికి స్వాతంత్య్రం వస్తే ఇవన్నీ జరుగుతాయని నాటి 30 కోట్ల మంది భారతీయులు కలలుగన్నారు. బ్రిటీష్‌ దుర్మార్గపు దోపిడీ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. లాఠీదెబ్బలు తిన్నారు. జైలు గోడల మధ్య జీవనాన్ని కొనసాగించారు. ఉరికంభాలను ముద్దాడారు. తుపాకీ గుండ్లను వెక్కిరించారు. చేయని త్యాగం లేదు. చూపించని తెగువా లేదు. వందలకొద్దీ రణాలు, వేలకొద్దీ మరణాలు. శతాబ్దానికి పైగా సాగిన స్వాతంత్య్ర సమరాలు. చివరికి 1947, ఆగస్టు 15న బ్రిటీష్‌ పాలన ముగిసి, మన పాలన ముందుకు వచ్చింది. దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. స్వతంత్ర పాలనాయుగంలోకి చేరుకుంది.
స్వాతంత్రోద్యమం, దేశ ఉజ్వల భవిష్యత్తును కోరుకుంది. మరి నిజంగా దేశం ఉజ్వల భవిష్యత్తును సాధించిందా? నాటి స్వాతంత్య్రోద్యమ స్పూర్తిని, నేటి దేశ పాలకులు కొనసాగిస్తున్నారా? పేదరికాన్ని నిర్మూలించడంలో, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించడంలో ప్రభుత్వాలు సఫలం అవుతున్నాయా? అందరికీ అభివృద్ధి ఫలాలు సమానంగా అందుతున్నాయా? అన్ని రకాల వివక్షలు, అణచివేతలు ఆగిపోయాయా? ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో ప్రజాస్వామిక విలువలు అమలు జరుగుతున్నాయా? మౌలిక అంశాలైన విద్య, వైద్యం, ఉపాధి దేశ ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చాయా? కులం పేర, మతం పేర, లింగ బేధం పేర సాగే దారుణ ఆధిపత్యాలు ఆగిపోయాయా? దేశ ప్రజల శ్రమతో, తెలివితో సృష్టించబడుతున్న సంపద, సౌకర్యాలు ప్రజలందరికీ సమానంగా అందుతున్నాయా? ఇవన్నీ ప్రశ్నలు. ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా కేవలం జాతీయ జెండాను ఎగురవేయడమే కాకుండా జాతి ప్రజల ప్రస్తుత జీవన అజెండాను చర్చించడం సమంజసం.
2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ ప్రస్తుతం దేశాన్ని పరిపాలిస్తుంది. దేశభక్తి, స్వదేశీపాలన, అవినీతి రహిత ప్రభుత్వ ఏర్పాటు అంటూ కేంద్రంలో అధికారాన్ని కైవశం చేసుకుంది. రెండు పర్యాయాలు నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా వ్యవహరించారు. 3వ సారి తన మిత్రుల సహకారంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అధికారంలోకి రాకముందు 2014లో తాను అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని పెద్ద ప్రచారం చేసింది. 2015 నుండి 2022 వరకు ఇది చేసి తీరుతామని ప్రగల్భాలు పలికింది. అయితే ఆచరణలో ఇది జరగకపోగా, రైతుల నడ్డి విరిచేలా అనేక చర్యలు తీసుకుంది. పచ్చని పల్లెల్లో కార్పొరేట్‌ చిచ్చును రాజేసింది. దేశానికి అన్నం పెట్టే అన్నదాతను, భూమి నుండి తరిమే చర్యలు చేపట్టింది. దేశంలోని రైతాంగానికి అండదండగా వున్న 1960 ల నాటి వ్యవసాయ చట్టాలను నిర్వీర్యం చేయాలని చూసింది. వ్యవసాయ రంగంలో ప్రమాదకరమైన మూడు నూతన చట్టాలను ముందుకు తెచ్చింది. కాంట్రాక్టు వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా ఈ చట్టాలను రూపొందించింది. రైతులకు ఎంతో కొంత ఉపయోగపడుతున్న ప్రస్తుత వ్యవసాయ మార్కెట్‌ వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా చట్టాలను తయారు చేసింది. రైతు కొనుగోలు కేంద్రాలకు మంగళం పాడి, కార్పొరేట్‌ వ్యాపారుల చేత కొనుగోలు అవుట్‌ లెట్స్‌లను ఏర్పాటు చేయాలని చూసింది. మద్దతు ధర, గిట్టుబాటు ధరల గ్యారంటీలను గంగలో కలపాలని చూసింది. మరోవైపు విద్యుత్‌ రంగంలో సంస్కరణలను తీసుకొచ్చి, రైతులకు ఉరి పేనాలని చూసింది. అంబానీ, అదానీ, టాటా, రహేజా, ఆర్పీజీ, ఫ్యూచర్స్‌ గ్రూప్స్‌ వంటి భారీ ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలకు రెడ్‌ కార్పెట్‌ పరిచి, భారత వ్యవసాయ రంగాన్ని వారి చేతిలో పెట్టేలా విధానాలను రూపొందించింది. దేశ రైతాంగం నడ్డి విరిచేలా చేసింది. స్వదేశీ పెట్టుబడిదారీ సంస్థలనే కాక, విదేశీ పెట్టుబడిదారులను సైతం వ్యవసాయరంగంలోకి ఆహ్వానించింది. విత్తన రంగాన్ని, ఎరువుల రంగాన్ని వారికి అప్పగించి రైతుల ఆదాయానికి గండి కొట్టింది. ఈ చర్యలతో రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా క్రమంగా వ్యవసాయం నుండి రైతులు తప్పుకుంటున్నారు. అందుకే దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి జీడీపీలో వ్యవసాయరంగ వాటా 55 శాతం కాగా, ప్రస్తుతం అది 15 శాతానికి పడిపోయింది.
మరో వైపు పారిశ్రామిక రంగంలో సైతం మోడీ ప్రభుత్వం ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంది. స్వదేశీ నినాదాన్ని గాలికి వదిలి, విదేశీ కార్పొరేట్‌ వ్యాపారులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టింది. ప్రైవేటీకరణ విధానాలను వేగవంతం చేసింది. 12 రంగాలకు చెందిన పారిశ్రామిక సంస్థలను ప్రైవేట్‌ పెట్టుబడిదారులకు తనఖా పెట్టే చట్టాన్ని ముందుకు తెచ్చింది. లాభాల్లో వున్న 171 ప్రభుత్వ రంగ సంస్థలను సైతం తనఖా పెట్టాలని నిర్ణయించింది. రోడ్లు, నౌకాయానం, విమానరంగం, రైల్వేలు తదితర రవాణా వ్యవస్థలను స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులను చేతుల్లో పెట్టేందుకు చర్యలు తీసుకుంది. ఆధునిక భారతదేశానికి కీలకమైన టెలికాం వ్యవస్థ, విద్యుత్‌ వ్యవస్థ, ఇంధన వ్యవస్థలలోకే భారీగా పెట్టుబడిదారులను ఆహ్వానించింది. చివరికి హోటల్స్‌, పిల్లలు ఆడుకునే స్టేడియంలను కూడా వదలకుండా తనఖా చట్టంలోకి తీసుకొచ్చింది. 160 చోట్ల గనులను సైతం తనఖా పెట్టాలని నిర్ణయించింది. పేరుకి తనఖా. కానీ ఈ చట్టం సారాంశం జాతి సంపదను క్రమంగా పెట్టుబడిదారులకు అందించడమే అని, దేశంలోని అనేకమంది ఆర్థికవేత్తలు, ప్రతిపక్ష పార్టీలు విమర్శించినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. తనఖా చట్టాన్ని వెనక్కి తీసుకోలేదు. ఇది ఇలా వుండగా, మరోవైపున 8 కీలక రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని 49 నుండి 74 శాతానికి పెంచింది. బొగ్గు, గనులు (ఇతర ఖనిజాలు), విద్యుత్‌, అణు, రక్షణ, అంతరిక్ష, విమానయాన, రవాణా రంగాలలో ఎఫ్‌.డి.ఐ. ల శాతాన్ని 74 వరకు పెంచింది. పేరుకే స్వదేశీ నినాదం. ఆచరణలో మాత్రం ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారీ వర్గానికి ఊడిగం చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో కోట్లమంది కార్మిక వర్గానికి రక్షణగా మనం 29 చట్టాలను రూపొందించుకున్నాం. పనిగంటలు, ఉద్యోగ భద్రత, ఉద్యోగ విరమణ తర్వాత కుటుంబ జీవనానికి గ్యారంటీ వంటి విషయాలు ఈ చట్టాల కార్మికులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తూ వచ్చాయి. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను నిర్వీర్యం చేస్తూ, 4 కార్మిక లేబర్‌ కోడ్‌లను తీసుకువచ్చింది. పారిశ్రామిక యజమానులకు అనుకూలంగా, అశేష శ్రామిక ప్రజలకు వ్యతిరేకంగా ఈ కోడ్‌లను రూపొందించింది. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా వుంటున్న ఎస్‌.బి.ఐ. బ్యాంకింగ్‌ వ్వస్థను ప్రైవేటీకరణ చేయాలనే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. 18 వేల బ్రాంచీలతో, 40 లక్షల కోట్ల సంపదతో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ వ్వవస్థగా వున్న ఎస్‌.బి.ఐ. ని ప్రైవేటు పరం చేయడమంటే దేశ ప్రజలను వంచించడమే అవుతుంది. 38 లక్షల కోట్ల ఆస్తులతో, 40 కోట్ల మంది పాలసీ దారులతో కళకళలాడుతున్న ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఎల్‌.ఐ.సి పైన కూడా ప్రైవేటు పెట్టుబడిదారుల కన్ను పండింది. వీరికి సహకరించడానికి, ఎల్‌ఐసి ని ప్రైవేటుపరం చేయడానికి కేంద్రం ఆలోచనలు చేస్తోంది. దేశ ప్రజల భవిష్యత్‌ను అత్యంత ప్రమాదకర వలయంలోకి నెడుతోంది. ఇది చాలదన్నట్లు… తన 10 సంవత్సరాల పాలనలో 16 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్‌ రుణాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుండి 22 శాతానికి తగ్గించింది. 20 లక్షల కోట్ల రూపాయల కరోనా ప్యాకేజీని దేశంలోని పెట్టుబడిదారీ వర్గానికి అప్పనంగా అందించింది. అంబానీ, ఆదానీ ఆదాయాలను వందల రెట్లు పెంచింది. 1 శాతం మందికి, 44 శాతం దేశ ప్రజల సంపదను అందించింది. మరోవైపు 99 శాతం దేశ ప్రజల జీవితాలలో వెలుగులు లేకుండా చేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ప్రజలు, ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాల వైపు చూస్తున్నారంటేనే దేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందో అర్థమవుతోంది. తమ శ్రమతో, జ్ఞానంతో దేశానికి సంపదను అందిస్తున్న ప్రజలు ఆత్మగౌరవంతో బతకడం లేదని తెలుస్తుంది. ఇది స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి కానేకాదు. స్వదేశీ పాలన సారం లేనే లేదు. నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, సొంత కాళ్లపైన నిలబడి ఆత్మగౌవరంతో పని చేయడానికి అవసరమైన రక్షణపూరిత ఉపాధి సృష్టించబడుతున్న సంపద, సౌకర్యాలు దేశ ప్రజలందరికీ సమంగా అందనంత కాలం స్వాతంత్య్ర ఫలాలు ప్రజలకు దక్కనట్లుగానే భావించాలి.
ఈ నేపథ్యంలో స్వాతంత్రోద్యమ స్పూర్తి నిర్వీర్యం అవుతోందని, స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందడం లేదని మనం ఆలోచించాలి. దేశ ప్రజలుగా దేశ భవిష్యత్తును గురించి చర్చించాలి. అయితే ఇలాంటి ఆలోచనలు, చర్చలు చేస్తే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ లు సహించవు. ఎందుకంటే ప్రజాస్వామిక ఆలోచనలు, చర్చలు వారి సిద్ధాంతానికి వ్యతిరేకం.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల సైద్ధాంతిక భావజాలానికి పునాది మనువాదం. భారత రాజ్యాంగం అంటే వారికి గిట్టదు. రాజ్యాంగ మౌలిక భావనలైన లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద, సోదరభావాలు వారికి నచ్చవు. కార్పొరేట్‌ అనుకూల ఆర్థిక విధానాల గురించి దేశ ప్రజలు ఆలోచిస్తారని, వాటికి వ్యతిరేకంగా పోరాడతారని వారికి తెలుసు. ప్రజలు స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఐక్యంగా సోదరభావంతో జీవిస్తారని తెలుసు. ప్రజలు ఐక్యంగా వుంటే, తమ పప్పులు ఉడకవనీ తెలుసు. అందుకే దేశంలో ప్రమాదకర ఉన్మాద రాజకీయాలకు ఊతమిస్తున్నారు. ఐక్యంగా సోదరులుగా జీవిస్తున్న దేశ ప్రజలను మతం పేర విభజిస్తూ, విష భావజాలాన్ని విరజిమ్ముతున్నాయి. అందుకు రాజకీయాలను వాడుకుంటున్నారు. వ్యక్తిగత విషయమైన ఆధ్యాత్మిక జీవనాన్ని రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ప్రజలకు మెజారిటీ, మైనారిటీ మత రంగులను అద్ది, పబ్బం గడుపుతున్నారు. ప్రజల ఐక్యతను విచ్చిన్నం చేసేందుకు ద్వేషాన్ని పావుగా వాడుకుంటున్నారు. విద్వేషాలను ప్రజల మెదళ్లలో నాటేందుకు ప్రణాళికా బద్దంగా కృషి చేస్తున్నారు. అందుకు ఉదాహరణే గోరక్షణ పేర హత్యలు. దళిత, గిరిజనులపైన దాడులు. అన్య మతస్థులపైన అరాచకాలు. సాంస్కృతిక పోలీసింగ్‌ పేర మహిళలపైన దుర్మార్గపు చర్యలు. హిజాబ్‌ తొలగింపులు, శ్రామిక ప్రజల ఆహార అలవాట్లపైన రాజ్యాంగేతర ఆంక్షలు. కట్టుబాట్లు, ఆచార వ్యవహారాల పైన అనధికార ఆధిపత్యాలు. చివరికి దేశం తలదించుకునేలా భారతమాత ముద్దుబిడ్డలైన మణిపూర్‌ మహిళల నగ ఊరేగింపులు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశం చిన్నబోతుంది. స్వేచ్ఛా, స్వాతంత్య్రం, సమానత్వాలు, జవసత్వాలు కోల్పోతాయి. ఇవి చాలవన్నట్లు పసిపిల్లలు, విద్యార్థులు, యువకుల మెదళ్లలో విషబీజాలు నాటేందుకు చరిత్రను వక్రీకరిస్తూ పాఠ్యపుస్తకాల రచనలు. సీరియల్స్‌, సినిమాల చిత్రీకరణలు, ప్రదర్శనలు. మనిషిని, మనిషి ఆలోచనల్ని మతోన్మాద గుంజలకు కట్టి, వారి చుట్టూ శాశ్వతంగా వుంచుకునేలా కుయుక్తులు. వర్తమానాన్నే కాదు, భవిష్యత్తునూ వారికి అనుకూలంగా మార్చుకునేందుకు దేశాన్ని వారి చేతుల్లో ఉంచుకునేందుకు పన్నాగాలు.
ఇలా కేంద్రం తన మనువాద భావజాలాన్ని ప్రజల మనస్సుల్లోకి జొప్పించి, ప్రజలను చీల్చాలని చూస్తోంది. మరోవైపు తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపైన, పోరాడేవారిపైన అధికార వ్యవస్థల ద్వారా దాడులు చేపిస్తోంది. అందుకు రాజ్యాంగబద్ద సంస్థలను సైతం పావులుగా వాడుకుంటుంది. ఇడి, సిబిఐ, పోలీసు, ఎన్నికల కమిషన్‌ తదితర ప్రభుత్వ సంస్థలను, వ్వవస్థలను తన వ్యతిరేకులపై ఉసిగొల్పుతుంది. ప్రజాస్వామిక లక్షణమైన భిన్నత్వాన్ని, విమర్శని అంగీకరించకుండా నియంత పోకడ పాలన కొనసాగిస్తోంది. నాటి స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని నీరుగారుస్తోంది. ఐక్యతను విచ్ఛిన్నం చేస్తోంది. ప్రజల ప్రశాంత జీవనాన్ని ప్రమాదంలోకి నెడుతోంది.
అందుకే స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రజలంతా దేశంలో నాటి ఉద్యమ స్ఫూర్తి కొనసాగుతుందా లేదా అనే చర్చ చేయాలి. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందుతున్నాయా లేవా అని ఆలోచించాలి. దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు, నాటి ఉద్యమ స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తుంటే, అందుకు వ్యతిరేకంగా గళం విప్పాలి. స్వాతంత్య్ర ఫలాలను అందరికీ కాకుండా కొందరికే అందిస్తుంటే పోరాటం చేయాలి. నాటి స్వాతంత్య్ర పోరాటాన్ని నెమరు వేసుకుంటూ, ప్రస్తుత ప్రమాదకర విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. దేశ ప్రజలు ఇప్పటికే ఇలాంటి స్ఫూర్తిని సందర్భానుసారంగా ప్రదర్శిస్తూనే వున్నారు. పాలకవర్గాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. ఆ స్ఫూర్తిని రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెనక్కి కొట్టడంలో, లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా జరిగిన కార్మిక సమ్మెలలో, మణిపూర్‌ అల్లర్ల వ్యతిరేక పోరాటంలో మనం చూడొచ్చు. అలాగే ఇటీవల జరిగిన దేశ సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ బలాన్ని గణనీయంగా తగ్గించడంలో సైతం, ప్రజల ఉద్యమ స్ఫూర్తిని చూడొచ్చు. ఇది భవిష్యత్తులో కొనసాగాలని, మరింత బలంగా ముందుకు రావాలని ఆశిద్దాం. కావాలని పాలకులు వదిలేస్తున్న స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని, దేశ ప్రజలుగా మనం కొనసాగించాల్సిన అవసరం వుందని, స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా గుర్తిద్దాం.
బండారు రమేష్‌
94900 98251