కోపం ఓ సాధారణ భావోద్వేగం. ఏదో ఒక సమయంలో ప్రతి మనిషికీ కోపం వచ్చితీరుతుంది. అయితే తమ భావాద్వేగాలను ఎవరితో పంచుకోవాలో తెలియక మహిళలు లోలోపలే కుమిలిపోతుంటారు. అలా అణిచిపెట్టుకున్న భావాలు ఒక్కసారిగా బద్దలై తీవ్రమైన బాధ కోపం రూపంలో బయటకు వచ్చేస్తుంది. అయితే తీవ్రమైన కోపం సమస్యలు పరిష్కరించకపోగా ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందుకే కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం.
కోపం వచ్చినప్పుడు శరీరంలో ‘ఫైట్-ఆర్-ఫ్లైట్’ అనే హార్మోన్ ప్రతిచర్యను చూపిస్తుంది. ఇది యాడ్రినల్ గ్రంథులలో కార్టిసోల్, యాడ్రినలిన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తాయి.
దీని కారణంగా
రక్తపోటు పెరుగుతుంది: దీర్ఘకాలిక కోపం హైపర్‌టెన్షన్‌కు దారి తీస్తుంది.
గుండె జబ్బులు: గుండె వేగంగా కొట్టుకోవడం, కొవ్వు పేరుకుపోవడం జరిగి కార్డియాక్ సమస్యలు తలెత్తుతాయి.
ఇమ్యూనిటీ తగ్గుతుంది: ఒత్తిడి, కోపం కలిసి రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయి.
మానసిక ప్రభావాలు
కోపం మానసిక స్థితిని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
ఒత్తిడి, ఆందోళన: విపరీతమైన కోపం కారణంగా డిప్రెషన్, ఆందోళన వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి.
తక్కువ ఏకాగ్రత: కోపం మనసును అస్థిరంగా మార్చి, ఏకాగ్రతను దెబ్బతీస్తుంది.
నిర్ణయాలు తప్పు: కోపంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు అధ్వాన్నంగా ఉండే అవకాశాలే ఎక్కువ.
భావోద్వేగ ప్రభావాలు
కోపం వల్ల భావోద్వేగ సమతుల్యతకు విఘాతం కలుగుతుంది
సంబంధాల లోపం: కోపం ఎక్కువగా ఉంటే, వ్యక్తిగత, సామాజిక సంబంధాలు దెబ్బతింటాయి.
ఆత్మ విశ్వాసం తగ్గుదల: ఎక్కువగా కోపం వ్యక్తికి నెగటివ్ పర్సనాలిటీని ఏర్పరుస్తుంది.
శరీర శక్తిని ఎలా దెబ్బతీస్తుంది
కోపం మన శరీర శక్తిని మాత్రమే కాదు, శక్తి శరీరాన్ని (Energy Body) కూడా ప్రభావితం చేస్తుంది. శక్తి శరీరం అనేది మన జీవశక్తి (ప్రాణశక్తి) ప్రవాహానికి ఆధారమైనది. కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలు ఈ శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి, దెబ్బతీస్తాయి.
ప్రాణశక్తి తగ్గుదల: కోపం వచ్చినప్పుడు శక్తి కేంద్రాలు (చక్రాలు) అసమతుల్యమవుతాయి. ఇది ప్రాణశక్తి తగ్గుదలకు దారితీస్తుంది.
శక్తి వ్యర్థం: కోపం సమయంలో శరీరం, మనసు శక్తిని అధికంగా ఖర్చు చేస్తాయి. ఇది అలసట, నిస్సహాయతకు దారి తీస్తుంది.
శక్తి బ్లాక్‌లు: దీర్ఘకాలిక కోపం శక్తి మార్గాలను మూసివేస్తుంది. ఇది శారీరక, మానసిక అనారోగ్యాలకు కారణమవుతుంది.
చక్కెర స్థాయిలపై ప్రభావం
కోపం రక్తంలోని చక్కెర (Blood Sugar) స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది. కోపం వచ్చినప్పుడు శరీరం అత్యవసర పరిస్థితులకు సిద్ధమవుతుంది. దీని కారణంగా యాడ్రినలిన్, కార్టిసోల్ వంటి హార్మోన్లు విడుదల అవుతాయి. వీటి ప్రభావం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
కార్టిసోల్ ప్రభావం: కోపం లేదా ఒత్తిడి కారణంగా కార్టిసోల్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది గ్లూకోజ్‌ను విడుదల చేసి, రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.
ఇన్సులిన్ ప్రతిరోధకత: దీర్ఘకాలిక కోపం, ఒత్తిడి ఇన్సులిన్‌కు ప్రతిరోధకత (Insulin Resistance)ను కలిగిస్తుంది. ఇది టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుంది.
అధిక చక్కెర స్థాయి: కోపం, ఆందోళన కారణంగా నిరంతరం చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు జరుగుతాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి మరింత హానికరం.
రక్తపోటుపై ప్రభావం
కోపం రక్తపోటును (Blood Pressure) తీవ్రమైన విధంగా ప్రభావితం చేస్తుంది. కోపం వచ్చినప్పుడు శరీరం ‘ఫైట్-ఆర్-ఫ్లైట్’ మోడ్‌లోకి వెళుతుంది. తద్వారా యాడ్రినలిన్, కార్టిసోల్ వంటి హార్మోన్లు విడుదల అవుతాయి. వీటి ప్రభావం రక్తపోటును గణనీయంగా పెంచుతుంది.
తాత్కాలిక రక్తపోటు పెరుగుదల: కోపం వచ్చిన వెంటనే గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. రక్త నాళాలు కుదించబడతాయి, ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది.
దీర్ఘకాలిక ప్రభావం: తరచుగా కోపం వస్తూ ఉంటే, రక్తపోటు స్థాయి స్థిరంగా అధికంగా ఉంటుంది. దీర్ఘకాలికంగా చూస్తే ఇది హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు)కి దారితీస్తుంది.
గుండె సమస్యలు: అధిక రక్తపోటు గుండెకు అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలకు దారితీస్తుంది.
పెరుగుతున్న ప్రమాదం: రక్తపోటు నియంత్రణలో లేకపోతే కళ్ళు, మూత్రపిండాలు వంటి అవయవాలు దెబ్బతింటాయి
నియంత్రణ
కోపం శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై విస్తృత ప్రభావం చూపిస్తుంది. కోపాన్ని గుర్తించి అదుపులో పెట్టుకోవడం వల్ల మన జీవన విధానంలో నాణ్యతను మెరుగుపరచుకోవచ్చు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ధ్యానం, శ్వాస, యోగా, వ్యాయామాలు వంటి పద్ధతుల ద్వారా కోపాన్ని నియంత్రించుకోవచ్చు. అలాగే నిత్య జీవితంలో సహనం, క్షమ, సహనం, ప్రేమ వంటి విలువలను అలవర్చుకోవడం చాలా ముఖ్యం. కోపం నియంత్రణలో భావోద్వేగ పరిణతి(ఎమోషనల్ ఇంటెలిజెన్స్) ముఖ్య పాత్ర పోషిస్తుంది. భావోద్వేగ పరిణతి అంటే స్వీయభావాలు, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, ఎలా స్పందించాలో నేర్చుకోవడం. ఎమోషనల్ పరిణతి ఉన్న వ్యక్తులు కోపం వంటి తీవ్రమైన భావోద్వేగాలను గుర్తించి వాటిని సానుకూల మార్గంలో వాడుకోవడం నేర్చుకుంటారు.
ఉదాహరణకు
ఆత్మ పరిశీలన: మన కోపానికి గల కారణాలను అర్థం చేసుకోవడం ద్వారా వాటిపై నియంత్రణ సాధించవచ్చు.
ఇతరుల స్థితిని అర్థం చేసుకోవడం: ఎదుటి వ్యక్తి దృష్టికోణాన్ని అర్థం చేసుకోవడం, సహనంతో స్పందించడం వల్ల విభేదాలు తగ్గుతాయి.
భావోద్వేగాలను వ్యక్తీకరించడం: నిగ్రహం లేకుండా కోపాన్ని బయటపెట్టడం కంటే చర్చల ద్వారా భావాలను స్పష్టంగా వ్యక్తీకరించడం మంచిది. భావోద్వేగ పరిణతి పెంపుతో కోపాన్ని శాంతంగా, సమర్థవంతంగా ఎదుర్కొని వ్యక్తిగత, సామాజిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
విష్యూ ఆల్ ఏ హెల్థీ అండ్ హ్యాపీ లైఫ్.
Dr.Prathusha. Nerella
MD(General Medicine) CCEBDM; CCGDM; NLP; FID
Senior General Physician
Positive Psychologist certified Nutritionist
Diabetes And Lifestyle Expert
Pranic Healer Chiief Holistic Health Consultant And Medical Director @ Praveha General, Diabetes And Lifestyle Clinic – A Holistic Centre With Integrated Approach.
Ph: 8897684912/040-49950314