మతోన్మాద బీజేపీని ఓడిద్దాం… లౌకిక శక్తులను గెలిపిద్దాం

– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పాండురంగారావు, మల్లూరు
నవతెలంగాణ-సత్తుపల్లి
మతోన్మాద బీజేపీని ఓడించడం, లౌకిక శక్తుల గెలుపుకు కృషిచేయడం లక్ష్యంగా సీపీఐ(ఎం), దాని అనుబంధ సంఘాలు, ఇతర వామపక్ష భావజాల కార్మిక సంఘాలు అవిరళ కృషి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లూరు చంద్రశేఖర్‌ అన్నారు. స్థానిక రావి వీరవెంకయ్య భవన్‌ (ప్రజా సంఘాల భవన్‌)లో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆ సంఘ జిల్లా నాయకుడు కొలికపోగు సర్వేశ్వరరావు అధ్యక్షతన వివిధ కార్మిక సంఘాలతో శనివారం ఏర్పాటు చేసిన జనరల్‌ బాడీ సమావేశంలో పాండురంగారావు, చంద్రశేఖర్‌ ముఖ్య వక్తలుగా ప్రసంగించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా విభజించి కార్మికుల పనిగంటలను పెంచే యోచనలో బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న బీజేపీని రేపు జరగబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా మనమంతా పనిచేయాల్సిన తక్షణావసరం ఏర్పడిందన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చాక ఈ 10యేండ్ల కాలంలో దేశంలో నిరుద్యోగం, ఆత్మహత్యలు, మత్తుమందు వాడకం, గోహత్యలు, నడిరోడ్లపై మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించి అఘాయిత్యాలకు పాల్పడటం, అసమానతలు చోటు చేసుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పెద్ద ఎత్తున అరాచకం రాజ్యమేలుతుంటే ప్రధాని మోడీలో చలనం లేకపోవడం ఈ దేశ ప్రజలు తమంతట తాముగా చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. కార్పొరేట్‌ శక్తులకు రాయితీలిస్తూ, సామాన్య, మధ్య తరగతి ప్రజలపై భారాలు మోపుతూ పేదలు జీవనం సాగించలేని స్థితికి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బీజేపీని ఓడించాలనే ఆలోచనలో దేశంలోని వామపక్ష పార్టీలతో పాటు ఆ భావజాలం ఉన్న ప్రతి పౌరుడు కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. ప్రపంచ శ్రామికుల దినోత్సవాన్ని (మేడే)ను వాడవాడలా జరుపుకుందామని, మేడేను స్ఫూర్తితో మతశక్తుల భరతం పడదామన్నారు.ఈ సమావేశంలో వలీ, మురళి, రవి, కిశోర్‌, శ్రీను, వెంకట్రావు, రాము, శేషు పాల్గొన్నారు.