– జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క
– సిర్పూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభం
నవతెలంగాణ-కాగజ్‌నగర్
రాజకీయాలను పక్కన పెట్టి జిల్లాను అన్ని రంగాలలో అంకితభావంతో అభివృద్ది చేసుకుందామని రాష్ట్ర పరచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, స్త్రీ, శిశుసంక్షేమ శాఖా మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. ఆదివారం జిల్లాలోని సిర్పూరు నియోజకవర్గంలో ఆమె సుడిగాలి పర్యటన చేపట్టి పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్‌తివారి, దాసరి వేణు, జెడ్పీ ఇన్‌ఛార్జి ఛైర్మన్ కోనేరు కృష్ణారావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అధికారంలో లేని సమయంలో కూడా తాను ఈ ప్రారతంలో పర్యటించి నియోజకవర్గ అభివృద్దికి తన వంతు కృషి చేశానన్నారు. ఇపుడు ప్రజల ఆశీర్వాదంలో అధికారంలోకి వచ్చామని, ఈ అధికారాన్ని ప్రజల సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తానని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకుపోయి అమలు చేసే బాధ్యత అధికారులపై ఉందన్నారు. అభివృద్ది పనులు కూడా సక్రమంగా నిర్వహించేలా అధికారయంత్రాంగానికి పూర్తి స్వేఛ్చనిచ్చినట్లు తెలిపారు. అధికారుల బదిలీలలో కూడా రాజకీయ జోక్యం ఉండదని అన్నారు. ప్రస్తుతం నూతనంగా ఎన్నికైన కాగజ్‌నగర్ మార్కెట్ కమిటీ కార్యవర్గం రైతుల సంక్షేమం కోసం పాటుపడాలని సూచించారు. ఈ ప్రాంతంలో పోడు భూముల సమస్య అధికంగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు. ఇదివరకే సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలిచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని, కొత్తగా పోడు వ్యవసాయం చేపట్టరాదని సూచించారు.
ములుగు రీతిలో అభివృద్దికి చర్యలు తీసుకోవాలి : డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు
అనంతరం సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు మాట్లాడుతూ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గాన్ని ఇటీవల తాను సందర్శించానని, ఆ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ది చెందిందన్నారు. అలాగే మా నియోజకవర్గానికి కూడా అధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. పోడు రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రాణహితపై ప్రాజెక్టును నిర్మించి ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు, సిర్పూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి రావి శ్రీనివాస్, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పలు అభివృద్ది పనులు ప్రారంభం
కాగజ్‌నగర్‌లో ఆదర్శనగర్, కాపువాడ, మండలంలోని ఈజ్‌గాం నజ్రుల్‌నగర్-12లలో ఒక్కొక్కటి రూ. 20 లక్షలతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య ఉప కేంద్రాలను మంత్రి సీతక్క కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్‌తివారి, దాసరి వేణు, ఎమ్మెల్యే హరీష్‌బాబు, జడ్పీ ఇన్‌ఛార్జి ఛైర్మన్ కోనేరు కృష్ణారావులతో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా కాగజ్‌నగర్‌లో రూ.44 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ (అర్బన్) పథకాన్ని ప్రారంభించి మంచినీటిని విడుదల చేశారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.