ఈ మధ్య కార్పొరేట్ దిగ్గజాలు కొందరు పని గంటలు పెంచాలనే డిమాండ్‌ను బలంగా ముందుకు తెస్తున్నారు. ఈ డిమాండు ఈనాటిది కాదు. పెట్టుబడిదారీ విధానం ప్రాణం పోసుకన్న దగ్గర నుండి పెట్టుబడిదారీ వర్గం నిరంతరం ఈ పని గంటలు పెంచే ప్రయత్నం చేస్తూనే వుంది. కార్మికవర్గం దాన్ని అంతేబలంగా తిప్పి కొట్టి వుండకపోతే, ఈపాటికి వాళ్లు పని దినాలను పూర్తిగా 24 గంటలకు పెంచి వుండేవాళ్లేమో! 24 గంటలా, అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే, చరిత్రలో వాళ్లు పని గంటలను పెంచుకున్న తీరును చూస్తే, వాళ్ల దురాశకు హద్దులుండవని మనకు అర్థమౌతుంది.
ఇంగ్లాండులో ఫాక్టరీ ఇన్‌స్పెక్టర్ల నివేదికలు చూస్తే, మార్క్స్‌కే ఆశ్చర్యం కలిగింది. అక్కడ పని గంటలు 13,14,15 అట్లా హనుమంతుని తోకలా 16,17,18 గంటల వరకు పెరుగుతూ పోయాయి. ఇంకా ముందుకు పోవాలనే వాళ్ల కోరిక. కాని పోలేక పోయారు. కారణం, వున్నది రోజుకు 24 గంటలే. వాటిలో 18 పోతే, ఇక మిగిలేది ఆరు గంటలు మాత్రమే. ఆ ఆరు గంటల్లో ఉదయాన్నే నెరవేర్చాల్సిన కాలకృత్యాలు, వంట, రెండుసార్లు తిండి, పిల్లలను సముదాయించటం, నిద్రపోవటం- ఇవన్నీ సాధ్యమా? అసాధ్యమనే, మనం అనుకుంటాం. అయినా, రాజు తల్చుకుంటే, దెబ్బలకు కొదవా, అన్నట్లు పెట్టుబడిదార్లు తలచుకుంటే జరగంది ఏముంటుంది? వాళ్లు అనుకున్నారు, కార్మికులు అన్నిటినీ ఆ ఆరుగంటల్లోనే ముగించారు.
కార్మికులను ఫాక్టరీలోనే వుండమన్నారు. అక్కడే తిండి, అక్కడే పడక, అక్కడే సంసారం. అక్కడే అన్నీ ఎట్లా? ఫాక్టరీ ఆవరణలోనే గూళ్లు లాంటి చిన్నచిన్న గదులు కట్టారు. ఒక్కొక్క దాంట్లో, నలుగురైదుగురిని కుక్కారు. అక్కడే ఆడవాళ్లు, అక్కడే మగవాళ్లు, అక్కడే బాల కార్మికుల్లోని మగ పిల్లలు, ఆడ పిల్లలు. అందరూ కలిసే వుంటారు. కలిసే తింటారు. కలిసే నిద్రపోతారు. ఈ క్రమంలో ఎన్ని ఘోరాలు జరుగుతాయో మనం ఊహించగలమా? (ఇదంతా పూర్తిగా అర్థం కావాలంటే మార్క్స్ కాపిటల్ గ్రంథం చదవాల్సిందే.) ఆ పుట్టే బిడ్డల బాధ్యత ఎవరిది? ఇంత అమానుషత్వానికి, ఇంత దుర్మార్గానికి పాల్పడ గలిగింది, ఒక్క పెట్టుబడిదారీ వర్గమే. వీళ్ల వారసులే ఇప్పటి మన కొర్పొరేట్ దిగ్గజాలు. ఆనాడు వాళ్లు ఎందుకు చేశారు ఈదుర్మార్గమంతా? ఆ 18 గంటలు పని చేయించుకుని గరిష్ట లాభాలను గుంజటానికే. వారి సంపదలు పెంచుకోటానికే, కదా!
ఈ పరిస్థితిని ఇట్లాగే ఎల్లకాలం కొనసాగించాలని వారు కలలు కన్నారు. కాని, అది వారి పేరాసే, అని తరువాత రుజువైంది. పని గంటల తగ్గింపు కోసం పోరాటం మొదట 1866లో చికాగో నగరంలో జరిగింది. దానిమీద ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఆరుగురు కార్మికులు ఆ పోరాటంలో నేలకొరిగారు. వారి రక్తంతో తడచిన బట్టే ఈనాటి మన ఎర్రజెండా. కార్మికవర్గ పోరాటాలకు అది శాశ్వత చిహ్నంగా నిలిచిపోయింది.
ఐరోపాలో జరిగిన పునరుజ్జీవనోద్యమం తరువాత పెట్టుబడిదారీ విధానం బాగా బలపడింది. ఇటు కార్మికవర్గం, అటు బూర్జువావర్గం రెండూ కూడా బలపడ్డాయి. కార్మికవర్గం ఆరోజుల్లో వేతనాల పెంపు, పని గంటల తగ్గింపు కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించింది. దానికి మార్క్సిస్టు సిద్ధాంతం తోడవడంతో అది మరింత బలపడింది. అనేక ఐరోపా దేశాల్లో జరిగిన కార్మికవర్గపోరాటాలు తిరుగుబాటు రూపం కూడా తీసుకున్నాయి. సామ్రాజ్యవాదుల మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో కార్మిక వర్గ నాయకత్వాన రష్యాలో సోషలిస్టు రాజ్యం ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధంలో అదే కార్మికవర్గాల నాయకత్వాన అనేక ఐరోపా దేశాల్లో సోషలిస్టు రాజ్యాలు ఏర్పడ్డాయి. మరికొన్ని ఐరోపా దేశాల్లో సోషల్ డెమోక్రాట్ల నాయకత్వాన పురోగామి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ కాలంలో పెట్టుబడిదారీ శక్తులు బలహీన పడటం, సోషలిస్టు శక్తులు బలపడటం మనం చూస్తాము. ఈ పోరాటాల్లో, అంటే పని గంటలు, వేతనాల కోసం జరిగిన పోరాటాలతో పాటు జరిగిన తిరుగుబాట్లు, యుద్ధాలు, విప్లవాల్లో కష్టజీవుల రక్తం ఏరులై పారింది. రష్యాలో సోషలిస్టు వ్యవస్థను కాపాడుకోటానికి ఫాసిస్టు జర్మనీ (హిట్లర్)కి వ్యతిరేకంగా జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక్క రష్యాలోనే నాలుగు కోట్ల మంది కష్ట జీవులు ప్రాణత్యాగం చేశారు. ఇట్లా అనేక పోరాటాల్లో కోట్లాది మంది ఛిందించిన రక్తం ఫలితంగానే 18 గంటల పనిదినం క్రమ క్రమంగా తగ్గి, అది ఎనిమిది గంటలకు చేరింది. ఈ పోరాటాల ఫలితంగానే బూర్జువా ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథóకాలను అమలు జరపక తప్పని పరిస్థితి ఏర్పడింది. అలాంటి రాజ్యాల్నే సంక్షేమ రాజ్యాలంటున్నాము.
ఇన్ని త్యాగాలతో సాధించిన 8 గంటల పని దినాన్ని మన కష్టజీవులు అంత తేలిగ్గా వదులుకుంటారా?
ఈ సందర్భంగా మరొక విషయం కూడా ప్రస్తావించాలి. మన కార్పొరేటు దిగ్గజాలు పని గంటలు పెంచమని ఎందుకు డిమాండు చేస్తున్నాయి? తమ సంపదలు పెంచుకోటానికే, కదా! దానధర్మాలు చేయటానికి కాదు, కదా! దానధర్మాలు చేసేవాళ్లు ప్రభుత్వ ఖజానాలు కొల్లగొడతారా? కాని జరిగిందేమిటి? మన ప్రధాని నరేంద్ర మోడీ అంబానీ, అదానీల లాంటి కార్పొరేట్ దిగ్గజాల బ్యాంకు అప్పులు పదహారు లక్షల కోట్ల రూపాయలు రద్దు చేశాడు. ఇది అప్పనంగా ప్రజాధనాన్ని వాళ్లకు దోచిపెట్టటమే కదా! ఇలా ప్రభుత్వాలు ప్రజా ధనాన్ని, వనరులను పాలక వర్గాలకు దోచి పెడతాయి కాబట్టే వారి ఆస్తులు రాకెట్ స్పీడుతో మిలియన్లు, బిలియన్లు, ట్రిలియన్లకు పెరుగుతూ వుంటాయి. లక్షల కోట్లలో కార్పొరేట్లకు అప్పులు రద్దు చేసిన మోడీ రైతుల అప్పులను ఎందుకు మాఫీ చేయడు?
వాళ్ల ఆస్తులను ఒకసారి పరిశీలిద్దాము.
అంబానీ ఆస్తి 8,37,810 కోట్ల రూపాయలు, ఆదానీ ఆస్తి 7,02,960 కోట్ల రూపాయలు.సాధారణ వ్యవసాయ కార్మికుని సగటు ఆస్తి 2 లక్షల రూపాయలు వాళ్లేమో లక్షల కోట్లలో వుంటారు.వీళ్లేమో వట్టి లక్షల్లో మాత్రమే వుంటారు. ఈదిగ్గజాల ఆస్తి వ్యవసాయ కార్మికుల ఆస్తుల కంటే నాలుగు కోట్ల రెట్లు ఎక్కువ. ఆకాశానికి భూమికి వున్నంత తేడా.
వీళ్ల వ్యవహారం ఇంకా బాగా అర్థం కావాలంటే, వాళ్ల దినసరి ఆదాయాలు కూడా పరిశీలించాలి. అదానీ ఆదాయం రోజుకు 1600 కోట్ల రూపాయలు.వ్యవసాయ కార్మికుని దినసరి సగటు ఆదాయం కేవలం 33 రూపాయలు. దేశంలో ఇంత దరిద్రం వుంది కాబట్టే ఆకలి సూచీలో మనదేశం 105వ స్థానంలో వుంది. (లెక్కలు తీసిన మొత్తం దేశాలు 121). మన చుట్టూ వున్న దేశాలు-చైనా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మన కంటే బాగా మెరుగైన స్థానాల్లోనే వున్నాయి. మనతోపాటు, మన స్థాయిలో వున్నది ఒక్క పాకిస్థాన్ మాత్రమే. ఆకలిసూచీ మాత్రమే కాదు.
మనదేశంలో అవసరమైన పోషకాలందక పిల్లలు గిడసబారి పోతున్నారు. మనదేశంలో వున్న దరిద్రాన్ని చూసి ఈ రిపోర్టు తయారు చేసిన పరిశోధకులు ఆందోళన వెలిబుచ్చారు. దేశంలో ఇంత దరిద్రం ఎందుకున్నట్లు? కారణం, సంపన్నుల దగ్గర మేరు పర్వతాల్లా సంపదలు పోగు పడడమే. వాళ్ల దగ్గర వున్న సంపదలను కొంతవరకు తగ్గిస్తే దానితో పేదలు కొంతవరకు తేరుకో గలుగుతారు.
సంపదలు పోగుపడటానికి కారణం, దోపిడీయేనని అందరికి తెలిసిందే. బ్రిటీష్‌వాళ్లు మనదేశాన్ని పాలిస్తున్న కాలంలో అనేక కరువులు సంభవించాయి. కోట్లాది మంది కరువువాత పడ్డారు. ఒక్క బెంగాల్ కరువులోనే 44 లక్షల మంది చనిపోయారు. బ్రిటీష్‌వాళ్ల దోపిడీయే మన కరువులకు కారణమని ఆనాటి మన మేధావులు కరెక్టుగానే చెప్పారు. బ్రిటీష్‌వాళ్లు పరోక్షంగానైనా దాన్ని అంగీకరించారు. కాబట్టే వాళ్లు మన నదులకు ఆనకట్టలు కట్టి రైతులకు సాగునీరందించారు. ఆ విధంగా ధాన్యం ఉత్పత్తిని పెంచి కరువుల తీవ్రతను తగ్గించారు.
అట్లాగే మూడవ ప్రపంచ దేశాల దారిద్య్రానికి సామ్రాజ్యవాదులు పోగేసుకుంటున్న సంపదలు కారణం కావా? అయినప్పుడు ఈ కార్పొరేట్ల దగ్గర పోగుపడ్డ సంపదలే మనదేశంలో దరిద్రానికి కారణమవుతాయి. కదా! అట్లాగే ఇప్పుడు మనదేశంలో తాండవిస్తున్న దరిద్రానికి ఈ బడా కార్పొరేట్లే కారణం. కాబట్టి ఈ పరిస్థితికి సంబంధించి వాళ్ల స్పందన కనీసం బ్రిటీష్ పాలకుల స్థాయిలోనైనా వుండాలి, కదా? కాని వాళ్లు దానికి సిద్ధం కాకపోగా మరింతగా ఆస్తులు పోగేసుకోటానికి పని గంటలు పెంచమని నిర్లజ్జగా డిమాండు చేస్తున్నారు. ఎంత దురాశ? ఎంత అమానుషం? అయినా కోట్లాది మంది కష్టజీవుల బలిదానంతో సిద్ధించిన ఈ 8 గంటల పనిదినాన్ని నేటి కష్టజీవులు అంత తేలిగ్గా వదులు కుంటారా? కనీస మద్ధతు ధర కోసం లక్షలాది రైతాంగం సంవత్సరాల తరబడి ఎండనక, వాననక, చలి అనక సాగిస్తున్న సమరశీల పోరాటాన్ని మనం చూస్తూనే వున్నాం. 8గంటల పని దినాన్ని కాపాడుకోటానికి ఇంతకుమించిన పట్టుదలతో ప్రతిఘటనను కష్టజీవులు చేపట్టాలని, అలా చేపడతారని ఆశిద్దాం.
– సి.సాంబిరెడ్డి, 9490300107