ఇలా చేద్దాం…

ఇలా చేద్దాం...వంట గదిలో బొద్దింకలు సంచరించడం సర్వసాధారణమైన సమస్య. దాదాపు అందరి ఇంట్లో ఈ సమస్య ఎదురయ్యే ఉంటుంది. బొద్దింకలు రాగానే వెంటనే మార్కెట్లో లభించే స్ప్రేలను కొనుగోలు చేస్తుంటాం. అయితే వీటి ధర అధికంగా ఉంటుంది. నిత్యం ఇలా డబ్బులు పెట్టి కొనుగోలు చేయలేము, అలా అని బొద్దింకలను అలానే వదిలేయలేము. పొరపాటున అవి మనం తినే ఆహార పదార్థాలపై వాలితే భారీ మూల్యం చెల్లించాల్సిందే. మరి బొద్దింకలను సహజమైన పద్ధతిలో ఎలా తరిమికొట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
లవంగం, వేప నూనెతో బొద్దింకలను తరిమికొట్టవచ్చు. ఇందుకోసం ముందుగా కొన్ని లవంగాలను తీసుకొని వాటిని మిక్సీలో పొడిగా మార్చుకోవాలి. అనంతరం అందులో వేప నూనె పోయాలి. ఈ మిశ్రమాన్ని బొద్దింకలు తిరిగే చోట పెట్టాలి అంతే బొద్దింకలు అటు సైడ్‌ రమ్మన్నా రావు.
పెప్పర్‌మింట్‌ ఆయిల్‌ కూడా బొద్దింకలను తరిమికొడుతుంది. ఇందుకోసం పెప్పర్‌మింట్‌ ఆయిల్‌లో ఉప్పు, నీటిని కలిపి స్ప్రే చేయాలి. దీంతో బొద్దింకలు అటువైపు రావు.
కిరోసిన్‌ వాసనకు కూడా బొద్దింకలు రావు. బొద్దింకలు ఎక్కువగా ఉండే చోట కాస్త కిరోసిన్‌ను చల్లాలి దీంతో బొద్దింకలు పారిపోతాయి.
బొద్దింకలను తరిమికొట్టడానికి, బేకింగ్‌ సోడాలో కొంచెం పంచదార కలిపి బొద్దింకలు ఎక్కడ వస్తున్నాయో అక్కడ వేస్తే అటువైపు రావు.
దాల్చిన చెక్కను చిన్న ముక్కలుగా చేసి అక్కడక్కడ వేయండి. ఈ వాసనకు కూడా బొద్దింక అటువైపు రాదు. పుదీనా ఆకులు కూడా బొద్దింకలు రాకుండా చేస్తాయి.
బొద్దింకలు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం కిచెన్‌ సింక్‌లో ఉండే పగుళ్లు కాబట్టి వాటిని వైట్‌ సిమెంట్‌తో పూడ్చేయాలి. ఈ పగుళ్లలో బొద్దింకలు గుడ్లు పెడుతాయి.