వేడివేడిగా..లాగించేద్దాం..

Hot.. let's pull it..ఎప్పుడూ ఒకేలాంటి వంటలంటే ఎవరికైనా బోరు కొడుతుంది. పిల్లలకైతే మరీనూ. అమ్మా ఈరోజు ఏం చేస్తాం అంటూ తెగ మారాం చేస్తుంటారు. అలాంటి వారి కోసం అప్పుడప్పుడు కొత్త వెరైటీలు చేయాల్సిందే. సాధారణంగా మినపప్పుతోనే గారెలు, వడలు చేస్తుంటాం. ఎప్పుడూ మినపప్పుతోనేనా? ఈ సారి కొంచెం కొత్తగా ప్రయత్నిద్దాం. నోరూరించే ఈ వడలు, గారెల తయారీ చూద్దాం. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి అవేంటో చూద్దాం…
మైసూరు వడ
కావలసిన పదార్థాలు: పచ్చి శెనగపప్పు, కంది పప్పు, పెసర పప్పు, మినపప్పు – ఒక్కొక్క కప్పు చొప్పున, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి – మూడు చెంచాల చొప్పున(సన్నగా తరిగినవి), ఉప్పు, నూనె – తగినంత.
తయారీ విధానం: అన్ని రకాల పప్పులను మూడు గంటల సేపు నీటిలో నానబెట్టి బరకగా రుబ్బుకోవాలి. దీనికి ఉప్పు, తరిగిన పదార్థాలన్నింటినీ కలిపి వడలుగా చేసి నూనెలో దోరగా వేయించాలి. అంతే వేడివేడి మైసూరు వడ రెడీ…
క్యాబేజీ వడ
కావలసిన పదార్థాలు: మినపప్పు, తరిగిన క్యాబేజీ – కప్పు చొప్పున, కరివేపాకు – రెండు రెబ్బలు, ఉప్పు, నూనె – తగినంత.
తయారీ విధానం: మినపప్పును నానబెట్టి రుబ్బుకోవాలి. దీనిలో క్యాబేజీ తరుగు, కరివేపాకు, ఉప్పు కలిపి వడలుగా చేసి నూనెలో దోరగా వేయించాలి.
అరటి గారెలు
కావల్సిన పదార్థాలు: మినపప్పు – కప్పు, అరటికాయ – ఒకటి(పొట్టు తీసి చిన్న ముక్కల్లా తరగాలి), పచ్చిమిర్చి – మూడు, కరివేపాకు – రెండు రెబ్బలు, అల్లం – చిన్నముక్క, ఉప్పు, నూనె – తగినంత.
తయారీ విధానం: నానబెట్టిన మినపప్పుకు అరటి ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఉప్పు చేర్చి గట్టిగా రుబ్బాలి. తర్వాత గారెల్లా చేసి, మధ్యలో చిన్న చిల్లు పెట్టి నూనెలో వేయించాలి.
బొబ్బర్ల వడలు
కావలసిన పదార్థాలు: బొబ్బర్లు – కప్పు, అల్లం – చిన్న ముక్క (తరగాలి), పచ్చిమిర్చి తరుగు – మూడు, కరివేపాకు – రెండు రెబ్బలు, ఉప్పు, నూనె – తగినంత.
తయారీ విధానం: బొబ్బర్లను నానబెట్టి గట్టిగా రుబ్బాలి. దీనికి అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు కలిపి వడల్లా చేసి నూనెలో వేయించాలి.
స్వీట్‌ కార్న్‌-తోటకూరతో..
కావలసిన పదార్థాలు: లేత స్వీట్‌ కార్న్‌ గింజలు, లేత తోటకూర ఆకులు రెండున్నర కప్పుల చొప్పున (శుభ్రం చేసి పెట్టుకోవాలి), అల్లం- కొద్దిగా, వెల్లుల్లి రెమ్మలు – 7, ఉప్పు – తగినంత, జీలకర్ర – ఒక టీ స్పూన్‌, సోంపు – అర టీ స్పూన్‌, ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు (చిన్నగా తరుగుకోవాలి)
బియ్యంపిండి – పావు కప్పు, పచ్చిమిర్చి – 4 (చిన్నగా తరగాలి), నూనె – సరిపడా.
తయారీ విధానం : ముందుగా మిక్సీలో స్వీట్‌ కార్న్‌, వెల్లుల్లి రెమ్మలు, అల్లం, తోటకూర ఆకులు (కాడల్లేకుండా) బరకగా మిక్సీ పట్టుకోవాలి. అవసరం అయితే కొన్ని నీళ్లు కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. జీలకర్ర, సోంపు, బియ్యప్పిండి, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. మిశ్రమం మరీ జారుగా మారితే బియ్యప్పిండి పెంచుకోవచ్చు. వీటిని చిన్న చిన్న వడల్లా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి.