సెక్స్ వర్కర్ల కష్టాలను కడతేరుద్దామ్

– జిల్లాజడ్జి సునీత కుంచాల
నవతెలంగాణ-  కంటేశ్వర్
సామాజిక, ఆర్థిక, పరిస్థితుల ప్రభావంతో సెక్స్ వర్కర్లుగా మారిన వారు ఆ వృత్తి నుండి మార్పు కోసం ప్రయత్నించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల అన్నారు. న్యాయసేవా సంస్థ, స్నేహ సొసైటీ ల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాకోర్టు ప్రాంగణంలో గల పి.పి.గంగారెడ్డి మెమోరియల్ హాల్ లో “భారీ ప్రమాద సముదాయం న్యాయవాదం”అనే అంశంపై నిర్వహించిన సెమినార్ లో ఆమె ప్రధానోపన్యాసం చేశారు.భయంతో ,అబద్రతభావంతో జీవిస్తు ఆర్ధిక కడగండ్ల పాలుకావడం మానుకోవాలని ఆమె హితవుపలికారు. వివిధ రకాల స్వయం ఉపాధి అవకాశాలు వెతుకోవాలని సూచించారు. చిన్న,చిన్న వ్యాపారులు చేస్తు గౌరవప్రదమైన జీవనమే మేలని తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం తోడ్పాటు తీసుకుకోవాలని అందుకు న్యాయసేవ సంస్థ తరపున సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఆమె తెలిపారు. సెక్స్ వర్కర్ల పిల్లల భవిష్యత్ కు చదువే కొలమానం కావాలని ఆ దిశగా అడుగులు వేయాలని ఆమె పేర్కొన్నారు. సర్కారు బడులలో,హాస్టళ్లలో చేర్పించి పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుకోవాలని ఉద్భోదించారు. న్యాయసేవ సంస్థ, ప్రభుత్వ ఆసుపత్రిల ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని చెప్పారు. సెక్స్ వర్కర్ల వృత్తిని మార్పించడానికి, మార్చడానికి న్యాయవ్యవస్థకు,ప్రభుత్వ శాఖలకు స్వచ్ఛంద సంస్థల సహకారం చాలా అవసరమని, అందరం కలిసి సెక్స్ వర్కర్లను ఆ ఊబిలో నుండి బయట పడేద్దామని జిల్లాజడ్జి సునీత అన్నారు.అదనపు పోలీస్ కమిషనర్(లా అండ్ ఆర్డర్) జయరామ్ మాట్లాడుతు సెక్స్ వర్కర్లకు పోలీసు శాఖ నుండి ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ప్రతి సీజన్ కు తగ్గట్టుగా వ్యవసాయ ఉత్పత్తుల, పండ్ల, పూల వ్యాపారాలు చేసుకోవాలని అందుకు జిల్లా అధికార యంత్రాంగం సహకరిస్తుందని అన్నారు.నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పోలీసుల నుండి ఇబ్బందులు ఉండవని కాని చిన్న పెట్టుబడి వ్యయంతో దీర్ఘకాలిక స్వయం ఉపాధి కి అవకాశాలు దండిగా ఉన్నాయని తెలిపారు. సెమినార్ లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ యెండల ప్రదీప్, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య ,న్యాయసేవ సంస్థ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్ ,నిజామాబాద్ నగర సర్కిల్ ఇన్స్పెక్టర్ నరహరి తదితరులు పాల్గొన్నారు.