దేశీయ అత్తరు సువాసనలు ఆస్వాదిద్దామా…!

Domestic incense aromas
Let's enjoy...!దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు శాండిల్‌ వుడ్‌ అత్తర్లుకు ప్రసిద్ధి చెందింది. జాస్మిన్‌ అత్తర్లకు తమిళనాడులోని మధుర, వివిధ పరిమళాలు వెదజల్లే వాటితో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ అత్తర్లు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగపడేలా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి అనేక రకాలైన అత్తర్లు, సెంట్లు, పెర్ఫ్యూమ్‌ తయారవుతున్నాయి. భారతీయుల జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి.
పెర్ఫ్యూమ్‌ అంటే తెలియని వారుండరు. ఎందుకంటే ఏదో సందర్భంలో ప్రతీ ఒక్కరూ అత్తరు, సువాసనలు వెదజల్లే పెర్ఫ్యూమ్స్‌, సెంట్లు, పన్నీరు వాడతారు. అసలు ఈ భారతీయ సువాసనల చరిత్రను పరిశీలిస్తే ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. పెర్ఫ్యూమ్‌ అంటే ‘సెంట్స్‌ మిక్సింగ్‌’ అని తెలుస్తోంది. ‘పెర్‌ ఫ్యూమస్‌’ అనే లాటిన్‌ పదం నుండి పెర్ఫ్యూమ్‌ వచ్చింది. అంటే పొగ ద్వారా (ఆవిరి ద్వారా) తయారు చేయబడిన ద్రవం. రోమన్స్‌, పర్షియన్లు, అరబ్‌ దేశస్థులు ఈ సెంట్లను కాలక్రమేణా మరింత నాణ్యమైన, సువాసనలు వెదజల్లే విధంగా తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇక సింధూ నాగరికత కాలంలోనే సెంట్లు తయారు చేసేవారని సింధు నాగరికత తవ్వకాలలో బయటపడిన ఎర్రరాతి పాత్రల ద్వారా తెలుస్తోందని ప్రముఖ ఆర్కియాలజిస్టు 1975లో ‘పాలో రొవెస్టి’ తెలిపారు. అంతేకాకుండా, విలియం డాత్రింపుల్‌ ‘సెంట్స్‌ అండ్‌ సెన్సువిటీ’ అనే సందేశంలో సింధూ నాగరికత కాలంలోనే సెంట్లు తయారు చేసేవారని తెలిపారు. ‘ఇండియన్‌ హిస్టరీ ఆఫ్‌ పెర్ఫ్యూమ్‌’ అనే అంశంపై ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ రీసెర్చ్‌ థాట్స్‌’ ప్రకారం భారతదేశానికి పెర్ఫ్యూమ్స్‌ కొత్త కాదని, అనాదిగా తయారు చేసి, వాడుతున్నారని తెలిపారు. పూర్వకాలంలో భారతదేశంలో పూలు, బెరడులు, కాండాలు, సుగంధ ద్రవ్యాలతో పెర్ఫ్యూమ్‌ తయారు చేసేవారు. ఇలా తయారు చేసిన అత్తర్లు, సెంట్లు సాధారణంగా మణికట్టు (రిస్ట్‌), మెడ, చెవుల వెనుక భాగంలో రాసుకునే వారని తెలుస్తోంది.
ఇక హిందూ ఆయుర్వేద గ్రంథాలైన ‘చరక సంహిత, శుశ్రుత సంహిత, రెండవ చంద్రగుప్త’ కాలంలో నవరత్నాలలో ఒకరైన వరాహమి హిరుడు రాసిన ‘బహత్‌ సంహిత’లో కూడా అత్తరు సువాసనల ప్రస్తావన ఉంది. ‘గంధకుటీ’ పుస్తకంలో సువాసనలు వెదజల్లే పెర్ఫ్యూమ్స్‌ గురించిన అంశాలున్నాయి. ఆ రోజుల్లో రాజులు, రాణులు, చెలికత్తెలు, రాజవంశీయులు మాత్రమే అత్తర్లు, సెంట్లు వాడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సైంటిఫిక్‌ మెథడ్‌ లోనే అత్తర్లు, సెంట్లు తయారు చేసేవారు. ఇక ‘వేదాలు’ కూడా అందం కోసం, అలంకరణ కోసం, సువాసనలు వెదజల్లే విధంగా పెర్ఫ్యూమ్‌ వాడినట్లు తెలుస్తోంది. ఋగ్వేదంలో పూలదండలు, లిల్లీ పూల ప్రస్తావన ఉంది. సుగంధ, సువాసన వస్త్రాలు విషయం ఉంది. అధర్వణవేదంలో ‘పుణ్యగంధం’ అనే పదాలు ప్రయోగించారు. కోరైస్‌, కుష్ట, కమలం వంటి మొక్కల ప్రస్తావన ఉంది. హిందూ, జైన మత కార్యక్రమాల్లో సువాసనలు వెదజల్లే పెర్ఫ్యూమ్స్‌ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. బౌద్ధ సన్యాసులు పెర్ఫ్యూమ్‌ వాడకానికి దూరంగా ఉండాలనే నియమం ఉండేది.
పురాణాలలో కాస్మోలజీ గురించి ఉంది. అగ్ని దేవునికి పూజ కార్యక్రమంలో సువాసనల ప్రస్తావన ఉంది. వాల్మీకి రామాయణం, మహాభారతంలో కూడా అత్తర్లు, సెంట్లు వాడినట్లు తెలుస్తోంది. ఎంతో ప్రాధాన్యత ఉన్న కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో కూడా అగరువత్తులు, గంధం ప్రస్తావన ఉంది. దీనికితోడు యూకలిప్టస్‌ ఆయిల్‌ గురించి కూడా ప్రస్తావించారు. దీపాలు వెలిగించడానికి సుగంధ ద్రవ్యాలతో కూడిన ఆయిల్‌ వాడినట్లు తెలుస్తోంది. వివిధ మత పరమైన కార్య క్రమాల్లో, పూజల్లో, వివిధ సంతోషకరమైన సమయంలో, పండుగలు, వివాహాలు, వేడుకల సందర్భాల్లో అత్తరు, పన్నీరు, సువాసనలు వెదజల్లే పెర్ఫ్యూమ్స్‌ వాడినట్లు తెలుస్తోంది. నేడు మనదేశంలో ఎన్నో వేలరూపాయలు వెచ్చించి పెర్ఫ్యూమ్స్‌ కొంటున్న పరిస్థితి. వయస్సుతో నిమిత్తం లేకుండా యువత, పెద్దవారు అత్తర్లు, సెంట్లు, పెర్ఫ్యూమ్‌ వాడుతున్నారు. కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. ‘బ్యూటీ పార్లర్‌’కు, పెర్ఫ్యూమ్స్‌కు చేస్తున్న వ్యయం అంచనాలకు అందుటలేదంటే అతిశయోక్తి కాదు.
ఆయుర్వేద వైద్య శాస్త్రంలో కూడా వివిధ ప్రాంతాల్లో లభించే స్థానిక పూలు, బెరడులు కాండాలు, చెట్టు ఆకుల నుంచి అత్తర్లు, సెంట్లు తయారు చేసేవారని వుంది. మొఘలులు పాలించే సమయంలో మరెన్నో పెర్ఫ్యూమ్స్‌, మంచి సువాసన కలిగిన అత్తర్లు మన దేశంలోకి ప్రవేశించాయి. మధ్య ఆసియా, సౌత్‌ ఈస్ట్‌ దేశాలతో పెర్ఫ్యూమ్‌ వ్యాపారం ఆరోజుల్లోనే విరివిగా జరిగేది. ఈ వ్యాపారం సాంస్కతిక సంబంధాలు బలపడటానికి దోహదం చేసింది.
అత్తరు రాసుకోవడం, వాడటం అనేది వ్యక్తిగత స్టేటస్‌కి చిహ్నంగా భావించేవారు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లోని ‘కనోజ్‌’ ఆరోజుల్లోనే ‘పెర్ఫ్యూమ్స్‌ కాపిటల్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరుగాంచింది. ముఖ్యంగా ఇక్కడ తయారైన రోజ్‌, జాస్మిన్‌, శాండిల్‌ వుడ్‌, అగర్‌ వుడ్‌తో తయారైన అత్తర్లు దేశంలోనే కాకుండా, ప్రపంచంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కసౌలి, గుజరాత్‌ లోని భావనగర్‌ (రోజ్‌ అత్తర్లు), ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ వివిధ అత్తర్లుకు ప్రసిద్ధి చెందాయి. ఇవి నేటికీ ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకీ సువాసనలు వెదజల్లుతున్నాయి.
ఇక దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు శాండిల్‌ వుడ్‌ అత్తర్లుకు ప్రసిద్ధి చెందింది. జాస్మిన్‌ అత్తర్లకు తమిళనాడులోని మధుర, వివిధ పరిమళాలు వెదజల్లే వాటితో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ అత్తర్లు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగపడేలా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి అనేక రకాలైన అత్తర్లు, సెంట్లు, పెర్ఫ్యూమ్‌ తయారవుతున్నాయి. భారతీయుల జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. అదే సమయంలో వివిధ దేశాలకు అత్తర్లు, సెంట్లు, పెర్ఫ్యూమ్స్‌ ఎగుమతి చేయడం ద్వారా అనేక కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. భారతీయ జీవితంలో మతపరమైన కార్యక్రమాల్లో, పూజా సమయంలో, వినోదం, వివాహాలు పుట్టినరోజు సందర్భంగా వివిధ వేడుకల్లో వీటిని వాడుతూ పరిమిళ భరితమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నోఏళ్లుగా చిన్న పిల్లల నుండి పండు ముదుసలి వరకూ వ్యక్తిగతంగా అత్తర్లు సెంట్లు పెర్ఫ్యూమ్‌ వాడుతూ ఆనందాన్ని పొందుతూ, ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవితం గడుపుతున్నారు.
– ఐ ప్రసాదరావు