మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం

– మహిళలపై జరుగుతున్న అన్ని రకాల దాడులను ప్రతిఘటిద్దాం
– పిఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎం.సతేక్క పిలుపు
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
అంతర్జాతీయ మహిళా పోరాటం దినం స్ఫూర్తితో దేశంలో మోడీ అనుసరిస్తున్న మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని, మహిళలపై జరుగుతున్న అన్ని రకాల దాడులను ప్రతిఘటించాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు ఎం. సతేక్క పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని హస కొత్తూర్ గ్రామంలో ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యు) హస కొత్తూర్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మండల నాయకురాలు కే. శోభ అధ్యక్షతన  అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు సతేక్క మాట్లాడుతూ మహిళ హక్కుల కోసం, అంతర్జాతీయ శ్రామిక మహిళ హక్కుల పోరాట దినంను స్ఫూర్తిగా తీసుకొని శ్రామిక మహిళలందరూ పోరాటాలకు సిద్ధపడాలని పిలుపును ఇచ్చారు.నేడు సమాజంలో అన్ని వర్గాల స్త్రీల పట్ల ఇంట, బయట తీవ్ర వివక్షత, పురుష దురహంకార దాడులు కొనసాగుతూ పురుషాధిపత్యం రాజ్య మేలుతున్నదని అన్నారు. భారతదేశంతో సహా అన్ని దేశాలలో మతాలకు అతీతంగా ఇంటి లోపల ,ఇంటి బయట ఫ్యాక్టరీలలో, ఆఫీసులో, రైళ్లలో బస్సులలో, రోడ్డు పైన స్త్రీని ఒక వ్యాపార వస్తువుగా పెట్టుబడిదారి వ్యవస్థ సమాజం పరిగణిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలో పేద, దళిత ఆదివాసి మైనార్టీ స్త్రీలపై దోపిడీ, అణిచివేత, లైంగిక దాడులు, వరకట్న దురాచారాలు, ప్రేమ పేరుతో జరిగే దాడులు, దౌర్జన్యాలు రోజు రోజు పెరిగిపోతున్నాయాన్నారు. అన్నీ రకాల హింసలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. దోపిడీ అణిచివేతల మూలాలు వ్యక్తిగత ఆస్తి, పితృస్వామ్య వ్యవస్థ ఏర్పడడంలోనే ఉన్నాయని, సనాతన ధర్మం పేరుతో మళ్ళీ వంచనకు గురించేస్తున్నారన్నారు. మహిళాలను మరింత అణిచివేతకు, దోపిడీకి గురిచేయ్యడానికి మతోన్మాధులు కుట్రచేస్తురన్నారు. అందుకే స్త్రీ హక్కుల ఉద్యమం, పితృస్వామ్యం రద్దు, వ్యక్తిగత ఆస్తి రద్దు అనే జంట లక్ష్యాలను కలిగి ఉండి ఉద్యమాలను నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. వివిధ రంగాలలో పనిచేస్తున్న మహిళా కార్మికులకు భద్రతకై సమానత్వం కై మనువాదాన్ని, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ బలోపేతం చేస్తు, కార్మిక ,రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వానికి  వ్యతిరేకంగా పోరాడాలని పిఓడబ్ల్యు  ఈ సందర్భంగా పిలుపునిస్తోందని ఆమె పేర్కొన్నారు. మహిళలు హక్కల కోసం పోరాటం చేయడం తప్ప మరోమార్గం లేదన్నారు.కార్యక్రమంలో  సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు సురేష్, డివిజన్ నాయకులు సత్యనారాయణ గౌడ్, మండల కార్యదర్శి అశోక్,పిఓడబ్ల్యూ కమ్మర్ పల్లి మండల నాయకురాలు శోభ, గ్రామ నాయకులు లక్ష్మి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.