బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుదాం: యండి. జహంగీర్

నవతెలంగాణ  – భువనగిరి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ కూలీల, రైతుల, కార్మికుల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాడుదామని అవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యండి.జహంగీర్ పిలుపు నిచ్చారు. మంగళవారం సుందరయ్య భవన్ భువనగిరిలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షతన  నిర్వహించారు .ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ వ్యవసాయ, సహకార రంగాలను కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి పెద్ద కుట్రలు చేస్తుందని విమర్శించారు. అనేక పోరాటాల ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని, అడవి హక్కుల చట్టాన్ని సక్రమంగా అమలు చేయకుండా వాటికి అనేక తూట్లు పొడుస్తుందన్నారు. మొత్తంగా ఎత్తివేయాలనే కుట్రలో భాగంగా అనేక తప్పుడు పద్ధతులు అనుసరిస్తుందని ఆవేదన వెలిబుచ్చారు. కేంద్ర రంగాలైన రైల్వే, రక్షణ, విద్యుత్తు, పబ్లిక్ సర్వీస్ లను ప్రైవేటు పరం చేయాలని ఆలోచనలను రోజురోజుకు తీవ్రతం  చేస్తుందన్నారు .వాటిలో అధిక పెట్టుబడులను ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు ఇస్తుందని దీనికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయాలని   కోరారు. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఇప్పటికైనా నిత్యవసర వస్తువుల పైన విధించిన జీఎస్టీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వంట గ్యాస్ లపై ఎక్సైజ్ సుంకం కూడా తగ్గించాలని కోరినారు. ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరించి 14 రకాల నిత్యావసర వస్తువులను అందించాలని, ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ మాట్లాడుతూ ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, రైతాంగ పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తూ రైతులకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని, 2022 విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్నారు. ఫిబ్రవరి 26న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామీణ బంద్ ,సమ్మెను కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు .ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు , రాచకొండ రాములమ్మ  జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య  జిల్లా సహాయ కార్యదర్శి గుంటోజి శ్రీనివాస్ చారి , సల్లూరి కుమార్ , కూకుట్ల చొక్కాకుమారి జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ బాలయ్య , దొడ్డి బిక్షపతి ,బోయ యాదయ్య , ఎర్ర ఊశయ్య , మెతుకు అంజయ్య , కొండాపురం యాదగిరి, రాపోతు పద్మ , బొల్లెపల్లి కిషన్ ,మానే సాలయ్య పాల్గొన్నారు.