– విద్యా, వైద్యం, ఉపాధికి ప్రణాళికలు
– భద్రాద్రి ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– కరకట్ట మరమ్మతులకు ప్రణాళికలు : తుమ్మల
– గిరిజన గ్రామాల్లో రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలి : కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లంకి దక్కని ప్రోటోకాల్
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
గిరిజన కుటుంబాలకు మేలు జరిగే విధంగా విద్యా, వైద్యం, ఉపాధి ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆదివారం భద్రాచలం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టితోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు
హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రెసిడెన్షియల్ ఆశ్రమ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. పదిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ఉన్నత చదువులకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. గిరిజన గ్రామాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు 100 పడకల ఆస్పత్రి నుంచి పీహెచ్సీ వరకు అంబులెన్స్ సౌకర్యాలు కల్పించాలన్నారు. పీహెచ్సీల్లో సరిపడా సిబ్బంది లేకపోతే స్థానిక యువతను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవాలని సూచించారు. పాలకమండలిలో చేసిన ప్రతి నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు.
మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. భద్రాచలం ఏజెన్సీని గోదారి వరదల నుంచి కాపాడేలా కరకట్ట మరమ్మతులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. భద్రాచలం రక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఐటీడీఏ నుంచి వచ్చే ప్రతి రూపాయి గిరిజన అభివృద్ధికి ఖర్చు చేయాలని ఆయన కోరారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన గిరిజన యువతకి ఉపాధి అవకాశాలు చూపించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గిరిజన గ్రామాల్లో రోడ్డు విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన ఐటీడీఏ పాలకమండలి సమావేశాలు ఏండ్ల తరబడి జరగటం లేదని, కొత్త ప్రభుత్వంలోనైనా కచ్చితంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన గ్రామాల్లో అనేక సమస్యలు తిష్ట వేశాయని, వాటి పరిష్కారానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
భద్రాచలం ఎమ్మెల్యేకు దక్కని ప్రోటోకాల్
ఆదివారం భద్రాచలంలో జరిగిన ఐటీడీఏ పాలకమండలి సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుకి ప్రోటోకాల్ దక్కలేదు. ఈ సమావేశానికి స్థానిక శాసనసభ్యుడే అధ్యక్షత వహించాల్సి ఉండగా అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. కనీసం వేదిక మీదకే ఆహ్వానించకపోవడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ అనే కారణంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అధ్యక్షత వహించే అవకాశాన్ని ప్రభుత్వ పెద్దలు కల్పించలేదని ఆరోపించారు. సమావేశంలో ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, కోరం కనకయ్య, తెల్లం వెంకటరావు, ఎమ్మెల్సీ తాతా మధు, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక అలా, ఓఎస్డీ కృష్ణ భాస్కర్, భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ తదితరులు పాల్గొన్నారు.