ఉద్రిక్తంగా చలో సెక్రెటేరియేట్‌

– ఏవీ కాలేజీ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల ర్యాలీ
– అడ్డుకున్న పోలీసులు…అక్కడే బైటాయించిన ఉద్యమకారులు
– బలవంతంగా అరెస్ట్‌…వాగ్వివాదం, తోపులాటల మధ్య తరలింపు
– సర్కారుకు బుద్ధి చెప్పి తీరుతాం….కె.యాదానాయక్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరినందుకు వారిని బలవంతంగా అరెస్టు చేశారు. కాంట్రాక్ట్‌ వ్యవస్థను రద్దు చేస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నినదించినందుకు పోలీసులు బలవంతంగా వారి గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. సమాన పనికి సమాన వేతనమివ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఛలో సెక్రెటేరియట్‌ చేపట్టిన కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను ట్యాంక్‌ బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్దే అడ్డుకుని అరెస్టు చేసి తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాదిగా తరలి వచ్చిన వారిని వరసగా ఈడ్చు కుంటూ వ్యాన్‌లలో ఎక్కించు కుని మరీ తీసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీ సులు- కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. గత కొన్ని నెలలుగా దశలవారీగా పోరాటాలు చేస్తున్న కాం ట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలు బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన మోసానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీయుఎం హెచ్‌ఇయూ- సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో సోమవారం ఛలో సెక్రెటేరియేట్‌ చేపట్టారు. ఈ నేపథ్యంలో దోమలగూడలోని ఏ.వీ.కాలేజీ నుంచి సెక్రెటేరియట్‌ వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలు తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలనీ, పరీక్షా విధానం రద్దు చేయాలనీ, పీఆర్సీ బకాయిలను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. శాంతియుతంగా సచివాలయం వైపునకు వెళ్తున్న వారిని అప్పటికే అంబేద్కర్‌ విగ్రహం వద్ద మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్ది సేపు పోలీసులు- కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల మధ్య వాగ్వాదం జరిగింది. ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలంటూ ఉద్యమకారులు నిలదీశారు. పోలీసులు అడ్డు కున్నందుకు నిరసనగా అక్కడే రోడ్డుపై బైటాయించి ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. అప్పటికే చుట్టు ముట్టిన పోలీసులు టీయుఎంహెచ్‌ఇయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదా నాయక్‌తో పాటు నాయ కులు, కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎం లను పెద్ద ఎత్తున అరెస్టు చేసి అక్కడ్నుంచి ఆయా పోలీస్‌ స్టేషన్లకు తరలిం చారు. అరెస్టయిన వారిలో రాష్ట్ర అధ్యక్షులు ఎండి. ఫసియుద్దిన్‌, రాష్ట్ర కోశాధికారి ఏ.కవిత, హైదరాబాద్‌ నగర అధ్యక్షులు జె.కుమార్‌ స్వామి,రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్మయి, వివిధ జిల్లాల నాయకులు మంగా, భాగ్య, పుష్పలత, స్వప్న, మంజుల, వెంకటమ్మ, లక్ష్మీబాయి, రమా, షీలా, భవాని, ధనలక్ష్మి, కళావతి, రాజేశ్వరి, బాలమణి, దైవమనితో పాటు హైదరాబాదు రంగారెడి, మంచిర్యాల, ములుగు, వరంగల్‌, కరీంనగర్‌ యాదాద్రి వికారాబాద్‌, మహబూబ్‌ నగర్‌ ,నాగర్‌ కర్నూల్‌, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్‌, భూపాలపల్లి, హనుమకొండ తదితర జిల్లాలో కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను తదితరులున్నారు. అరెస్ట్‌ చేసిన వారిని సాయంత్రం 5 గంటల తర్వాత విడుదల చేశారు.
పెద్ద ఎత్తున ఆందోళనా పోరాటాలు
అక్రమ అరెస్టులను టీయుఎంహెచ్‌ ఇయూ తీవ్రంగా ఖండించింది. కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎలు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు సమ్మె చేస్తే ప్రభుత్వం కమిటీ వేసిందని గుర్తుచేశారు. నెల రోజులైనా రెగ్యులర్‌ చేయలేదు. పరీక్ష రద్దు కాలేదు. ఏరియర్స్‌ ఇవ్వకపోవడంతో ఏఎన్‌ఎంలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలిపారు. కాంట్రాక్టు ఏఎన్‌ఎంలను యధావిధిగా రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళ నలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
డైరెక్టర్‌తో చర్చలు సఫలం
ఛలో సెక్రెటరియేట్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు టీయుఎంహెచ్‌ఇయూ ప్రతినిధులతో చర్చించారు. ఇప్పటికే పోరాటం ఫలితంగా సమ్మె కాలపు వేతనాలు విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. పీఆర్సీ బకాయిలు సుమారు రూ.33.54 కోట్లను వారం రోజుల్లో విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ నెల 16 లేదా 17న ఉన్నతాధికారుల కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చిస్తుందని చెప్పారు. అదే విధంగా పరీక్షను డిసెంబర్‌ వరకు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. దీంతో ఆందోళనలను వాయిదా వేస్తున్నట్టు యూనియన్‌ నాయకులు ప్రకటించారు. డీహెచ్‌తో చర్చలు జరిగిన వారిలో యూనియన్‌ గౌరవాధ్యక్షులు భూపాల్‌, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ ఫసియుద్దీన్‌, కె.యాదానాయక్‌, రాష్ట్ర కోశాధికారి కవిత, లీలావతి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.