పల్లెకు పోదాం..ఓటేద్దాం

Let's go to the village..let's vote– సొంతూళ్లకు ఓటరన్న…కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
– విజయవాడ హైవేపై బారులు తీరిన వాహనాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భాగ్యనగరం పల్లెబాట పట్టింది. హైదరాబాద్‌లో ఉంటూ స్వగ్రామంలో ఓటు ఉన్నవారు కుటుంబ సభ్యులతో కలిసి సొంత గ్రామాల బాట పట్టడంతో మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌ (ఎంజీబీఎస్‌), జూబ్లీ బస్‌స్టాండ్‌లతో పాటు సికింద్రాబాద్‌, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. రైళ్లు, బస్సులు ప్రయాణీకులతో నిండి పోయాయి. ఎలాగైనా ఓటు వేయాలనే తపనతో రిజర్వేషన్‌ లేకున్నా ఇబ్బందులు పడుతూనే ఓటర్లంతా పల్లె బాట పట్టారు. ప్రయాణీకుల రద్దీని బట్టి అదనపు బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నప్పటికి నగరంలోని అన్ని ప్రధాన బస్‌ స్టేషన్లలో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. సాధారణ రోజుల్లో ఎంజీబీఎస్‌ నుంచి 3,500 బస్సులు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళుతుంటాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరో వెయ్యి అదనపు బస్సులను ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. అయినా బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణీకుల రద్దీ కొనసాగుతూనే ఉంది.
కిక్కిరిసిన రహదారులు
గురువారం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవులు ప్రకటించడంతో సొంత కార్లు, ఇతర వాహనాలు ఉన్నవారు కూడా గ్రామాలకు బయల్దేరారు. ఒకేసారి కార్లు అన్ని రోడ్లపైకి రావడంతో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మహబూబ్‌ నగర్‌, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌ జిల్లాలకు వెళ్లేందు బస్టాండ్లలో ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉంది. ఫలితంగా విజయవాడ, బెంగుళూరు హైవేలతో పాటు రాజీవ్‌ రహదారిపై కిలోమీటర్ల కొద్ది వాహనాలు బారులు తీరాయి. కాగా హైదరాబాద్‌లో ఉన్న ఓటర్లకు ర్యాపిడో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఓటర్లకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాదీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.ఓట్లు వేసేందుకు నగర వాసులు సొంతూళ్లకు వెళ్లిపోతుండటంతో భాగ్యనగరం బోసిపోయింది.