– ప్రజలందరూ భాగస్వాములు కావాలి
– ప్రధాన కూడళ్ళలో చెత్త వేస్తే రూ 5వేలు జరిమానా
– నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
– స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న జిహెచ్ఎంసి
నవతెలంగాణ-పటాన్ చెరు
పటాన్చెరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుదామని అందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్ మహానగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి జిహెచ్ఎంసి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోందని పటాన్ చెరు సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్లలోనీ ప్రధాన కూడళ్లలో జిహెచ్ఎంసి నిబంధనలకు విరుద్ధంగా చెత్తను వేసే 58 పాయింట్లను గుర్తించామన్నారు. గత 20 రోజుల క్రితం ప్రారంభమైన ఈ స్పెషల్ డ్రైవ్ లో ఇప్పటికే 20 చెత్త పాయింట్లలో చెత్తను వేయడాన్ని అరికట్టామన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ ముగిసే లోపు మిగతా చెత్త పాయింట్లలో సైతం పూర్తిగా నిర్మూలిస్తామని తెలిపారు. ప్రజలను చైతన్య పరచడానికి చెత్త తరచుగా వేసే పాయింట్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. జిహెచ్ఎంసి నిబంధనలకు విరుద్ధంగా చెత్తను వేసే సమయంలో గుర్తించి రూ.5 వేల జరిమానాలు విధిస్తామన్నారు. ఇప్పటికే పటాన్చెరు సర్కిల్ లోని డివిజన్లలో అక్రమంగా చెత్తను వేసిన వారిపై జరిమానాలు సైతం విధించినట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రజలు మారకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సురేష్ హెచ్చరిస్తున్నారు. సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్ల ప్రజలందరూ విధిగా తమ చెత్తను, చెత్త సేకరించే వాహనాలకు అందించాలని సూచించారు. లేనిపక్షంలో జిహెచ్ఎంసి తీసుకునే చట్టపరమైన చర్యలకు గురికాక తప్పదన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని శానిటేషన్ సిబ్బంది, స్వయం సహాయక గ్రూపులకు సంబంధించిన ఆర్పీలు సంయుక్తంగా పట్టణంలోని ఇంటింటికి తిరిగి చెత్తను పారవేసే విధి విధానాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దాంతోపాటు పటాన్చెరు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో జిహెచ్ఎంసి అధికారులు గుర్తించిన చెత్త పాయింట్లు వద్ద ప్రజలు చెత్తను వేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దాంతోపాటు ప్రతి పాయింట్ వద్ద ముగ్గులు సైతం వేస్తున్నారు. పట్టణంలోని రుక్మిణి థియేటర్, నాల మసీద్, పోస్ట్ ఆఫీస్ రోడ్డులో గల పాయింటుతో పాటు అన్ని చెత్త పాయింట్ల వద్ద ప్రజలు ఎవరు అక్రమంగా చెత్త వెయ్యకుండా స్వయం సహాయక బందాల ఆర్పీలు, గ్రేటర్ సానిటే షన్ సిబ్బంది చాలా సీరియస్ గా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బంది సురేష్, బాల్ రాజ్, ఆర్పీలు టప్ప సురేఖ, అనిత, మాలతి, తదితరులు పాల్గొన్నారు.