– పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
– రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు
– పంచాంగం ఆవిష్కరణ
నవతెలంగాణ-కల్చరల్
రైతు కుటుంబాల్లో నవ వసంతాలను తెచ్చి, పున్నమి వెన్నెలను నింపడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. క్రోధినామ తెలుగు సంవత్సర ఉగాది వేడుకలను ప్రభుత్వం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి లో ఘనంగా నిర్వహించారు. క్రోధీనామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. బాచుపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. అనంతరం సంతోష్ కుమార్ శాస్త్రిని సన్మానించారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి.. క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది నవ వసంతంలో రైతులకు మేలు కలగాలని, ప్రజలందరి ఆశయాలు నెరవేరి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉగాది రోజున చేసుకునే షడ్రుచుల సమ్మేళనమైన పచ్చడి జీవితంలోని అనేక అనుభవాలకు ప్రతీకన్నారు. జీవితంలో ఎదురయ్యే అనేక అనుభవాలను ఎదుర్కొని ముందుకు వెళ్లాలని ఇది సూచిస్తుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం సంతృప్తినిచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్ల శంకర్, బీసీ కమిషన్ చైర్మెన్ వకుళభరణం కృష్ణమోహన్, సీఎస్ శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హన్మంత్ రావు, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీఎం ఓఎస్డీ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.