”మావా! మావా! గక్కడేదో అలికిడి అవుతాంది. ఎవురివో మాటలు ఇనొస్తున్నరు” మొగుడు రత్తయ్యను భయంతో అల్లుకు పోయింది మంగి.
”జర సైసు బయపడమాక” అల్లుకున్న మంగి చేతులను నెమ్మదిగా విడిపించుకొని గుడిసెకున్న తడక తలుపును తప్పించి, పిల్లిలా చెవులు రిక్కించాడు. ఎదురుగా గుబురు పొదల్లోంచి వస్తున్న శబ్దం వైపు కళ్ళు చికిలించి చూపు అటుగా సారించాడు. చెట్ల కొమ్మల నీడల మాటున మసక మసకగా వుంది. అక్కడ ఓ ఇద్దరైతే ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్ళలో ఒకడి చేతుల్లో గుడ్డల మూట. ఆ గుడ్డలో ఏదో చుట్టి ఉన్నది. ఇంకొకడేమో అటూ ఇటూ తలతిప్పి చూస్తూ గుసగుసగా ”ఒరేరు! అయ్యగారు జల్ది పారేసి రండని చెప్పిండు గందా. నువ్వేందిరా బొమ్మను పట్టుకున్నట్టు భలే ఇట్టంగ పట్టుకున్నవ్. జల్ది ఆ పొదల్లోకో ఆ మురికి కాలువలోకో ఇసిరెరు”
”కాదు బావా గీ పసిగుడ్డును అట్ల చెయ్యనీకి మనసురాటం లేదు”
”ఏందిరోరు! నీకు పుట్టిన బిడ్డోలె తెగ ఇదై పోతున్నవ్. పెద్దోళ్ళ ఇంటి ఇషయాలు మనకొద్దుగని ముందు నువ్వు ఇసిరేత్తవా! నన్ను ఇసిరేయమంటవా?”
గుంజుకోబోతున్న పసిగుడ్డును గుండెలకు హత్తుకుని ”ఒద్దు బావా! నేనే ఇసిరేత్త తీ..”
”ఓ మాట.. నీ సెల్లికి ఇంకా సంతు అందలేదుగా. గీ గుడ్డు ఆడో మగో తెల్వదు గని తీస్కపోయి పెంచుకుంటే ఎట్లుంటది?”
ఆ మాటలకు అంత చలిలో చెమటలు పట్టినయి కాబోలు బావ అని పిల్వబడిన వాడికి. ఆ గొంతులో వణుకు స్పష్టంగా వినబడుతోంది.
”వామ్మో! ఈ భూమ్మీద నీకూ నాకూ నూకలు చెల్లే రోజు వచ్చినట్టుంది. మనయ్యగారికి తెలిసిందా.. ఇద్దర్నీ ఒక్క దెబ్బతో ఒకేసారి పరలోకం పంపిత్తడు. మా సెల్లె వయసేం బోలేదు. అది కనే రోజులు శాన్నే వున్నయిగని తొరగ కానీరు. ఇక్కడైతే కుక్కలు గిక్కలు లెవ్వని తెలిసి వచ్చినం. లేదంటే పురిటి వాసన పసిగట్టి ఉరుకొత్తరు. ఖండ ఖండలు పీకి తింటూ పండుగ చేసుకుంటయి. తొందరగా గా ముండ్ల పొదల్లోకి విసిరేరు! నోట్లో ఒడ్ల గింజ ఏసినవ్ కదా. ఏడుపు గీడుపు ఇనబడకుండా సచ్చిపోతరట. అదేస్తే..” అంటున్న అతని మాటలకు కీ ఇచ్చిన బొమ్మోలే యాంత్రికంగా తలూపాడు. పురుగు పుట్రా ఉందేమోనని జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ చెట్ల పొదల చాటుకు వెళ్ళాడు. భద్రంగా పట్టుకున్న ఆ మూటను అక్కడ బెట్టి భారంగా బావ అనే వ్యక్తి వెంట కదిలి పోయాడతడు.
ఇదంతా సాటునుండి చూస్తున్న రత్తయ్యకు దిగజెమటలు పట్టినవి. ‘మావ అలికిడి లేదు, ఏమై ఉంటుంది’ అనుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరకు వచ్చింది మంగి.
వెళ్తున్న వాళ్ళను చూసి ”ఏంది మావా! ఎవురు ఆళ్ళు? ఏం జేసిండ్రు” అంటుంటే నిలువుగుడ్లేసుకుని చూస్తున్న రత్తయ్య మంగి మాటలు వాళ్ళెక్కడ వింటారోనని భయంతో నోరు చప్పున మూసేశాడు.
”లాసిగ మాట్టాడమాక” ఆ దీపం బుడ్డి తేపో అన్నాడు. లోపట్నించి తెచ్చిన దీపం బుడ్డి గాలికి పోకుండా ఓ చేయి అడ్డం పెట్టింది. నెమ్మదిగా ఇద్దరూ అడుగులో అడుగు వేసుకుంటూ ఆ మూట దగ్గరకు వెళ్ళారు. అప్పుడే అటువైపు ఓ పాము జరజర పాక్కుంటూ వెళ్ళింది.
‘వామ్మో! ఇంకా నయ్యం. ఆ పసిగుడ్డును కరవలేదు’ అనుకుంటూ ఆ మూటను పట్టుకొని లోపలికి వచ్చిండ్రు.
లోపలికి తీసుకొని రాంగానే ఎక్కా బుడ్డి వత్తి ఎగదోసింది మంగి. ఆ వెల్తురులో పసిగుడ్డు ముఖం చంద్ర బింబమోలే కన్పించింది.
”అబ్బా! మావా ! ఇటు సూడు ఆ ముఖం ఎంత సక్కంగుందో” అంది.
”అవునే మంగీ! భలే ముద్దుగుంది”
ఇద్దరూ పిల్లో పిలగాడో సూద్దాం అనుకుంటూ గుడ్డలు ఇప్పి చూసేసరికి ఆడపిల్ల. పక్కనే ఓ వడ్ల గింజ. సంపేటోడికి మనసు రాక ఆ గింజ పక్కన ఏసిండట్టుంది అనుకున్నరు.
గుడ్డలు తీసేతల్కి గా పసిగుడ్డు కొద్దిగా వణికింది. పాలకోసం తల అటుఇటూ కదిల్చింది. ”అమ్మో! బిడ్డకు సలేత్తాంది” గబగబా వాళ్ళ గుడ్డలతో పాటు తన మెత్తటి చీర తెచ్చి వెచ్చగా చుట్టింది మంగి. వెచ్చదనం కలగ్గానే నిద్రలోకి జారుకుంది.
‘ఏం చేద్దాం! అంటే ఏం చేద్దాం!’ అనుకున్నరు. ఇద్దరిలో ఒకటే ప్రశ్న. ఆ పసిగుడ్డును వదిలేయ బుద్ది కాలేదు.
”మావా! మనం ఈ బిడ్డను బతకనిద్దాం. వదిలేత్తే కళ్ళముందే అన్నాయమై పోయిద్ది. మనం పెంచుకుందాం!” అంది.
”ఇక్కడే అయితే ఎవరికైనా అనుమానం వత్తది. ఎంటనే ఈ తలం విడిచి పోవాల మరి” అన్న మావ మాటలకు సరేనని సంబురంగా తల ఊపింది.
గబగబా పెట్టే బేడా సర్దింది. చీరనొకటి తీసుకుని జోలె కట్టింది. ఆ పసిదాన్ని అందులో వెచ్చగా పడుకోబెట్టి గుండెలకు హత్తుకుంది.
***
తల మీద ఓ మూట, ఇంకో భుజానో మూట. రత్తయ్య, మంగి ఆ అమాస చీకట్లో ఓ బంగారు బతుకమ్మను బతకనిచ్చేందుకు, నిండు నూరేళ్ళ జీవితం ఇచ్చేందుకు పయనమయ్యారు. కూలీనాలీ చేసుకొని పెంచుతామనే ధైర్యం వాళ్ళ మనసు నిండా. మానవీయ విలువలు వారి హదయం నిండా పొంగి పొర్లతున్నాయి. ప్రేమతో ఆ బిడ్డతో బయలుదేరారు. తాము కొనుక్కున్న ఆ గుడిసె, ఆ స్థలం వదిలి వెళ్తున్నామన్న బాధ లేదు. ఆ బిడ్డను బతికించాలన్న ఆలోచన తప్ప.
ఆ బిడ్డ వాళ్ళింట్లో ఓ కర్ణుడిలా పెరుగుతుంది. ఈ సమాజంలో మరో బతుకునిచ్చే బతుకమ్మై తన ఉనికిని చాటుకుంటుంది.
ఆ ఇద్దరి ప్రేమానురాగాల మాటలే అందుకు కారణం.
***
”ఏమయ్యా! ఓ మావా! మన బుడ్డది బల్లో మస్తుగా సదువుతోందట. గీ ఆణిముత్తెం మనకెంత మంచి పేరు తెస్తుందో సూశినవా మావా!” అనగానే మురిపెంగా ”ఒక్కపిల్ల సాలు సాలు అంటివి. తోడొకర్ని కందామంటే వద్దు వద్దు అంటివి. ఇంకోర్ని కంటే కన్న పేగని ఈ బిడ్డ మీద పేమ తగ్గిపోద్దని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేపిస్తివి” అంటున్న రత్తయ్య నోటి మీద వేలేసి ”లాశిగ మాట్లడకు. ఉష్! మన కరుణమ్మ, బంగారు తల్లి వస్తోంది” నడిచొస్తున్న ఆ చదువుల తల్లి కోసం హత్తుకునేందుకు మురిపెంగా చేతులు చాపారు ఇద్దరూ.
– వురిమళ్ల సునంద, 9441815722