భూగోళాన్ని ప్రేమిద్దాం

Let's love the planetసరిగ్గా 40 ఏండ్ల కిందట 1984 డిసెంబర్‌ 2న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ నగరంలో ‘యూనియన్‌ కార్బైడ్‌ కెమికల్స్‌’ ఫ్యాక్టరీలో నుంచి విషవాయువులు వెలువడి నగరంలోని వేలాదిమందిని నిమిషాలలో మట్టుబెట్టాయి. ఈ దుర్ఘటన వల్ల 8 నుంచి 10 వేల మంది మరణించగా, 25,000 మంది అనంతర పరిణామాలతో మరణించారు. అంతేకాకుండా పరోక్షంగా 5 లక్షలమందికి పైగా అనారోగ్యాల బారినపడ్డారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక కాలుష్య ఘోరకలి. ఇది ప్రపంచ మానవ చరిత్రలోని పెద్ద విషాదాలలో ఒకటిగా నమోదైంది. ఈ విషాదాంతం ప్రపంచ దేశాలకు ఒక కనువిప్పు కలిగించింది. అందుకే ఈ ఘోరకలిని అందరూ గుర్తుంచుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 2ను ‘జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం’గా ప్రకటించింది.
భోపాల్‌ విషాదం నుంచి ప్రపంచంతోపాటు మన దేశ పాలకులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు నేర్చుకున్నది, సాధించింది మాత్రం పెద్దగా లేదనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచ, దేశ పర్యావరణ స్థితిగతులు రోజు రోజుకూ అత్యంత దయనీయ స్థితికి చేరుకుంటున్నాయి. ఎందుకంటే మానవులు తమ సుఖమయ జీవనం కోసం ప్రకృతి అందించిన వనరులను విచ్చలవిడిగా వాడటం మొదలుపెట్టారు. ప్రధానంగా ఆధునిక జీవనశైలితో సౌకర్యాలు, విలాస వస్తువుల వాడకం పెరిగి కార్బన వాయువుల ఉత్పత్తి అపరిమితమై భూమి వేడెక్కిపోతోంది.
మానవ మనుగడకే ముప్పు
మన చర్యల వల్ల భూమండలం యావత్తూ కర్బన ఉద్గారాలు వ్యాపించి, మానవాళితో పాటు అన్ని జీవరాశులకు మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. పారిశ్రామిక విప్లవంతో మొదట్లో వచ్చిన ప్రగతి చూసి అందరూ గర్వపడ్డారు. అభివృద్ధిలో దూసుకుపోతున్నామని సంతోషించారు. అత్యున్నత ఆవిష్కరణలను కనిపెడుతున్నామని అనుకున్నారు. కానీ మానవ చర్యల వల్ల కాలుష్యం పెరిగి వాతావరణంలో పెనుమార్పులు సంభవించి మానవ మనుగడకే ముప్పు వాటిల్లు తోందని గుర్తించలేక పోయారు. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ఎప్పుడో గుర్తించడమే కాదు హెచ్చరించారు కూడా. వాతావరణంలో కలుస్తున్న కర్బన ఉద్గారాలే భూతాపానికి కారణం అని ఎప్పటినుంచో పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. దీన్ని నివారించకపోతే ప్రళయం తప్పదని నాసా నివేదిక కూడా హెచ్చరించింది.
ప్రతి ఒక్కరి చర్యల వల
ఐక్యరాజ్య సమితి ఎప్పటికప్పుడు పర్యావరణానికి జరుగుతున్న ప్రమాదాన్ని నివేదికల రూపంలో వివరిస్తూ మన బాధ్యతలను గుర్తు చేస్తూనే ఉంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అంతర్జాతీయ సంస్థలు, మరెందరో పర్యావరణ నిపుణులు రానున్న పర్యావరణ విపత్తు గురించి తమ నివేదికలలో హెచ్చరిస్తున్నారు. దాంతో ప్రపంచ దేశాలు ఆర్భాటంగా చర్చలు, సదస్సులు ఏర్పాటు చేస్తున్నాయి. అయితే అమలు జరిగింది మాత్రం అత్యల్పం. ప్రతి ఒక్కరి చర్యల వల్ల ప్రపంచం నష్టపోయేది ఎంత అంటూ తమ వంతుగా పర్యావరణానికి తూట్లు పొడుస్తూనే ఉన్నారు. విచారించదగ్గ విషయం ఏమిటంటే ఈ పర్యావరణానికి ఏ మాత్రం హాని చేయని కోట్లాది మూగ జీవరాశులు కూడా మూల్యం చెల్లిస్తున్నాయి. కాలుష్యాన్ని అదుపు చేయలేకపోతే భావితరాల విషయం పక్కన పెడితే ప్రస్తుత తరం ప్రశ్నార్థకం కాబోతోంది. అయినప్పటికీ కర్బన ఉద్గారాల విడుదల ఆగడం లేదు. దాని ఫలితమే ప్రపంచంలో ఒక పక్క అతివృష్టి, అనావృష్టి, మరోపక్క తరిగిపోతున్న అడవులు, భూతాపం, ఇంకొక పక్క తాగే నీరు, పీల్చే గాలి కూడా కలుషితం, వేరొక పక్క భూకంపాలు, అగ్నికి ఆహుతవుతున్న అడవులు, సముద్ర మట్టాలు పెరగడం.. ఇదీ నేటి భూగోళం పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ నేటి మన దైనందిన జీవితంలో ఓ భాగంగా పరిణమించాయి. పర్యావరణానికి హాని చేసే కాలుష్యాలను విడివిడిగా ఒక్కొక్కటి వరిశీలిస్తే దాని తీవ్రత మనకు అవగతం అవుతుంది. జనాభా విస్పోటం, అభివృద్ధి పేరిట మనం సాగిస్తున్న విచ్చలవిడి వినియోగం ఫలితాలు కాలుష్యం రూపంలో మన కండ్ల ముందే కనిపిస్తున్నాయి.
కాలుష్యం అంటే
భౌతిక, థర్మల్‌, జైవిక, రేడియో ధార్మిక ధర్మాల్లో సంభవించే మార్పులు పర్యావరణంలోని జీవుల ఆరోగ్యం, భద్రతకు హాని కలిగే విధంగా ఉండటాన్ని కాలుష్యంగా పరిగణిస్తారు. ఈ కాలుష్యాల రకాలను వరిశీలిస్తే…
వాయు కాలుష్యం
స్వచ్ఛమైన వాయువులో కర్బన అకర్బన మలినాలు చేరి వాయువు స్వచ్ఛత కోల్పోవడాన్నే వాయు కాలుష్యం అనవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా నేడు వాయు కాలుష్యం ప్రధాన సమస్యగా పరిణమించింది. ప్రాణాలను కాపాడే వాయువులో కాలుష్యం చేరిన కారణంగా ప్రాణాలను హరించే వాయువుగా ఇది రూపాంతరం చెందింది. దేశం మొత్తం వాయు కాలుష్యంలో 51 శాతం పారిశ్రామిక కాలుష్యం, 27 శాతం వాహన కాలుష్యం, 17 శాతం వ్యవసాయ వ్యర్థాల దహనం వల్ల కలుగుతుంది. 5 శాతం బాణసంచా కాల్చడం వల్ల అవుతున్నాయి. ఈ కాలుష్యం వల్ల గుండెపోటు మధుమేహం మెదడుపై ప్రభావం, ఆయుక్షీణం, సంతాన లేమి, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్లు వంటి రోగాలు వస్తున్నాయని వైద్యలు నిర్థారించారు. పైగా ఈ వాయు కాలుష్యం అధికమైతే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా పెరుతాయని నిర్దారణ చేశారు.
భారతదేశ వ్యాప్తంగా వాయు కాలుష్య పరిస్థితి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే ఎన్నో రెట్లు హీనంగా ఉన్నట్లు ప్రపంచ ప్రఖ్యాత వైద్య విజ్ఞాన పత్రిక లాన్సెట్‌ ఈ మధ్యనే తన పరిశోధనలో తెలిపింది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ వాయు కాలుష్యాన్ని ‘కొత్త రకం పొగాకు’గా వర్ణించింది. ప్రపంచం మొత్తం మీద వాయు కాలుష్యం అధికంగా గల ప్రాంతాలను గుర్తించి వాటికి సూచీలు ఇవ్వడానికై స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎయిర్‌ అనే కమిటీ నియమింపబడింది. ఆ కమిటీ ఇచ్చిన తాజా నివేదిక పరిశీలిస్తే వాయు క్షీణతలో భారత్‌ 5వ స్థానంలో ఉంది. వాయు కాలుష్యం కారణంగా దేశంలో సుమారు 40 శాతం మంది జీవిత కాలం 9 ఏండ్ల వరకు తగ్గిపోతున్నట్లు ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్‌ తన నివేదికలో వెల్లడించింది. దీన్నిబట్టి ఇది చేసే హాని మనకు అర్ధం అవుతుంది.
మన దేశంలో వాయు కాలుష్యం అనగానే ప్రధానంగా ఢిల్లీ గుర్తొస్తుంది. తరచూ అక్కడే వాయు కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఓ) నిర్దేశించిన సురక్షిత పరిధికి పైన, అంతకు సుమారు 10 రెట్లు అధిక స్థాయిలో కలుషిత గాలిని పీలుస్తున్న ప్రజలు భారత్‌లో కనీసం 14 కోట్ల (140 మిలియన్‌) మంది ఉన్నారు. ఆనాటి గణాంకాల మేరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కాలుష్యాన్ని కలిగి ఉన్న 20 నగరాలలో 13 మన దేశంలోనివే కావడం గమనార్హం. ఈ లెక్కన ఒక్క వాయుకాలుష్యమే భారతదేశంలో ఏటా కనీసం 20 లక్షల మంది ప్రాణాలను బలిగొంటున్నట్టు అంచనా.
జల కాలుష్యం
మానవ మనుగడకు ముఖ్యమైంది అన్ని జీవులకూ ప్రాణాధారం నీరు. ఇది లేకుంటే జీవమే లేదు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో మనం ఎన్నెన్నో అద్భుతాలు చేయగలుగుతున్నాం. ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేయగలుగుతున్నాం. అయితే నీటి వనరులను మాత్రం సృష్టించలేకపోతున్నాం. అందుచేత ప్రకృతి ప్రసాదించిన ప్రతి నీటిబొట్టునూ సద్వినియోగం చేసుకోవాలి. అయితే మన తీరు మాత్రం దారుణంగా ఉంది. పరిమిత నీటి వనరులు పదిలంగా వాడుకోకుండా నిర్లక్ష్యంతో నదులు, చెరువులు, సరస్సులు కలుషితం చేసేస్తున్నాం.
జాతీయ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం మానవుడు తన అవసరాలన్నింటికీ ఉపయోగించుకోవడానికి పనికిరాని, కనీసం నాణ్యత లేని నీటిని ‘కలుషిత నీరు’ అంటారు. స్వచ్ఛమైన నీటిలో కర్బన అకర్బన పదార్ధాలు చేరి నీటి స్వచ్ఛత కోల్పోవడాన్ని నీటి కాలుష్యం అంటారు. దీనికి కారణం.. వేగంగా పెరిగిపోతున్న పారిశ్రామికీకరణ. వాటి నుండి విడుదలయ్యే వ్యర్థ, విషపదార్థాలను నదులు, చెరువులు, బావుల్లోకి వదిలేయడమే. గ్రామాల్లో ఉండే కాలువలు కూడా పూర్తి డస్టబిన్స్‌గా తయారయ్యాయి. గృహ వ్యర్థాలన్నీ సమీప కాలువల్లోకి వంపిస్తున్నాం. వీటి వల్ల భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయి. ప్రతిరోజూ దేశ వ్యాప్తంగా పరిశ్రమలు కనీసం నాలుగు కోట్ల లీటర్ల వ్యర్థ పదార్థాలను నదులు, ఇతర నీటి వనరులలోకి విడిచిపెడుతున్నారని ఓ అంచనా. ఈ కలుషిత నీటితో జీవకోటి అనేక
అనర్థాలను ఎదుర్కొంటోంది. అంతేకాదు.. ఈ కాలుష్యం కారణంగా పంట దిగుబడులు 16 శాతం తగ్గుతాయని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు తాగు, సాగు నీరు లభించక చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
గ్రీన్‌ హౌస్‌ వాయువులు..
కార్బన్‌ డై ఆక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్లు, క్లోరో ఫ్లోరో కార్బన్లు, హైడ్రోకార్బన్లు, మీథేన మొదలైనవాటిని గ్రీన్‌ హౌస్‌ వాయువులు అంటారు. ఇవి భూమిని వేడెక్కిస్తాయి. ఈ వాయువులు సూర్యుని నుండి వచ్చే రేడియేషన్ని ఆపి, భూ ఉపరితలం నుండి ఉష్ణాన్ని బయటకు పోకుండా చూస్తాయి. వాతావరణంలో ఈ వాయువులు ఎక్కువతై భూతాపం అధికమవుతుంది. దీనికి పరిశ్రమల నుండి వెలువడే వాయువులే కాదు.. రిఫ్రిజిరేటర్ల నుండి విడుదలయ్యే క్లోరో ఫ్లోరో కార్బన్లు, ఆకులు, టైర్లు, ప్లాస్టిక్‌ కవర్ల వంటి చెత్త తగలబెట్టడం వల్ల కూడా భూతాపం అధికమవుతుంది.
శబ్ద కాలుష్యం
శబ్దం శ్రావ్యంగా ఉంటే అది సంగీతం. చెవులను బాధిస్తే అది శబ్ద కాలుష్యం. హారన్లు, సైరన్లు, రైళ్లు, విమానాలు, బోరు వేయడం.. వంటి నిర్మాణ పనుల్లో వచ్చే విపరీత ధ్వనులు, రోడ్ల వెడల్పు, భవనాల కూల్చివేత, పరిశ్రమల నుండి వెలువడే శబ్దాలు.. ఇలా వివిధ రూపాలలో ఏర్పడే రణ గొణ ధ్వనులు అన్నీ శబ్ద కాలుష్యం లేదా ధ్వని కాలుష్యంగా పరిగణిస్తారు. ఈ శబ్ద ప్రభావం మనిషి ఏకాగ్రతను దెబ్బ తీయడమే కాకుండా అలసటకు గురయ్యేలా చేస్తుంది. గుండె కొట్టుకొనే వేగం పెరుగుతుంది. ఫలితంగా హైపర్‌ టెన్షన్‌ ఆపై హార్ట్‌ ఎటాక్‌లకు దారి తీస్తుంది. ఒత్తిడితో రక్తపోటు తీవ్రమై ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ప్రధానంగా పిల్లల మెదడుపై, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆధునికత పెరిగేకొద్దీ ఈ శబ్ద కాలుష్యం వేగం పుంజుకుంది. పూర్వం పండుగలకు, ఏదన్నా ప్రధాన వేడుకలకు బాణా సంచా కాల్చేవారు. ఇప్పుడు ప్రతీ చిన్న కార్యక్రమానికి వినియోగించడం పరిపాటి అయ్యింది. దాంతోపాటు వాహనాలకు బీకర శబ్దాలు వచ్చే సైలెన్సర్లు వాడటం అభిరుచిగా మారిపోయింది. సంగీతాన్ని కూడా పెద్ద పెద్ద శబ్దాలతో ఆస్వాదించడం ఆహ్లాదంగా పరిణమించింది.
ఇలా మారుతున్న కాలానికి అనుగుణంగా శబ్ద కాలుష్య తీవ్రత కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ధ్వని కాలుష్యం కారణంగానే ఏటా దాదాపు రెండు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. యూరప్‌ దేశాలలో దాదాపు సగం మంది పౌరులు శబ్ద కాలుష్యం బారిన పడినవారే. అమెరికాలో చాలామంది వినికిడి సమస్యలతో తల్లడిల్లుతున్నారు. జర్మనీలో అర కోటి మందికి వరకు దీని బారిన పడినవారే, జపాన్‌ ఈ ధ్వని కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రత్యేక చట్టం తీసుకురావడమే కాకుండా దాని అమలులో పటిష్ట చర్యలు కూడా తీసుకుంది. మన దేశంలో మాత్రం చట్టాలు అలంకారప్రాయమే తప్ప అదుపు చేసే పటిష్టమైన యంత్రాంగం కొరవడింది.
ప్లాస్టిక్‌ కాలుష్యం
ప్లాస్టిక్‌ వస్తువులు, కణాలు-ప్లాస్టిక్‌ సీసాలు, బ్యాగులు, మైక్రోప్లాస్టిక్‌లు వంటివి భూమి యొక్క వాతావరణంలో పేరుకుపోవడాన్ని ప్లాస్టిక్‌ కాలుష్యం అంటారు. ఇది వన్యప్రాణులు, ఆవాసాలు, మానవ జనాభాను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఆధునిక సమాజంలో ప్లాస్టిక్‌ ఉత్పత్తులను విస్తృతంగా ఉపయోగించడం, వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థలు సరిగా లేకపోవడంతో ఇది అప్రతిహతంగా పెరిగిపోతూ వస్తున్నది. ప్రపంచాన్ని ప్లాస్టిక్‌ కాలుష్యంతో ముంచి వేయటంలో మనం ముందున్నామని నేచర్‌ జర్నల్‌ తాజా అధ్యయనం తేల్చింది. ప్రపంచంలో ఏటా 25.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ తయారవుతోంది. 5.2 కోట్ల టన్నులకు పైగా బహిరంగ ప్రదేశాల్లో కాల్చి వేయటం వల్ల వాతావరణంలో కలిసిపోతోంది. గుండెజబ్బులకు, శ్వాసకోశ వ్యాధులకు, క్యాన్సర్ల వంటి ప్రాణాంతకాలకు, నరాల సమస్యలకు దారితీస్తున్నాయి. మితిమీరిన ప్లాస్టిక్‌ వినియోగంతో మనకు తెలియకుండానే సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులు (మైక్రోప్లాస్టిక్స్‌) అన్నివైపులా ఆవహిస్తున్నాయి. పర్వతాలు, అడవులు, రిజర్వాయర్లు, నదులు, సముద్రాల్లో ఇవి చేరిపోతున్నాయి. సగటున ప్రతి గంటకూ మనం గాలిద్వారా 11.3 ప్లాస్టిక్‌ సూక్ష్మ రేణువులను పీల్చుకునే ప్రమాదంలో ఉన్నాం.
నేల కాలుష్యం
నేల అంటే నిర్జీవ పదార్థం కాదు. లక్షలాది సూక్ష్మజీవులు, పోషకాలతో కూడి వుండేదే సుసంపన్నమైన నేల. దురదృష్టవశాత్తు వ్యవసాయం కోసం విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాలు భూమిని నిస్సారంగా, నిర్జీవంగా మార్చి భూ కాలుష్యానికి కారణం అవుతున్నాయి. నగర శివార్లలో ఉండే పరిశ్రమల నుండి విడుదలయ్యే విష రసాయనాలను ఇష్టారాజ్యంగా బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తున్నాయి. కొందరైతే ఏకంగా బోర్లు వేసి మరీ వ్యర్థాలను భూమిలోకి పంపిస్తున్నారు. దీని వల్ల నేల కాలుష్యంతో పాటు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఆటవీ క్షీణత వల్ల భూసారం క్షీణత ఏర్పడుతుంది. మన సౌకర్యం కోసం వాడే 50 మైక్రాన్ల మందం కంటే తక్కువ ఉన్న పాలిథిన్‌ కవర్ల వల్ల భూమిపొర తన సహజత్వాన్ని కోల్పోతోంది. అలాగే ప్లాస్టిక్‌ వ్యర్థాలను దగ్ధం చేయడం వల్ల డ్రైయాక్సిన్‌ వాయువు గాలిలో కలిసి క్యాన్సర్‌కు కారణమవుతుంది. వర్షపు నీరు భూగర్భంలోకి చేరకుండా ఈ ప్లాస్టిక్‌ అడ్డుకుంటుంది. పశువులు, వివిధ జీవాలు ప్లాస్టిక్‌ వ్యర్థాలు తిని మృత్యువాత పడుతున్నాయి. వాటి మాంసం తినడం వల్ల మనం కూడా అనేక అనారోగ్యాలకు గురి అవుతున్నాం. దీంతో పాటు చెరువులు, నదులు, సముద్రాలలో అనేక జల చరాలు ఈ ప్లాస్టిక్‌ తీవ్రతకు నశించిపోతున్నాయి.
ఉష్ణ కాలుష్యం
పరిసర నీటి ఉష్ణోగ్రతను మార్చే ఏదైనా ప్రక్రియ ద్వారా నీటి నాణ్యత క్షీణించడాన్ని ఉష్ణ కాలుష్యం లేదా థర్మల్‌ కాలుష్యం అంటారు. ఉష్ణ కాలుష్యానికి కారణం విద్యుత్‌ ప్లాంట్లు, పారిశ్రామిక తయారీదారులు నీటిని శీతలీకరణిగా ఉపయోగించడం. దీని వల్ల అధిక ఉష్ణోగ్రత వద్ద సహజ వాతావరణంలోకి తిరిగి వస్తుంది. ఉష్ణోగ్రతలో మార్పు ఆక్సిజన్‌ సరఫరాను తగ్గిస్తుంది. పర్యావరణ వ్యవస్థ కూర్పును ప్రభావితం చేస్తుంది. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా థర్మల్‌ కాలుష్యం పెరుగుతోందని, ఫలితంగా జలచరాలకు తీరని నష్టం జరుగుతోందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. థర్మల్‌, అణు విద్యుత్తు కేంద్రాలు, పరిశ్రమల నుంచి వెలువడే ఉష్ణం చాలా తక్కువగా యంత్రాలు పనిచేయడానికి
ఉపయోగపడితే, ఎక్కువ భాగం వ్యర్థ ఉష్ణంగా బయటకు వెలువడుతోంది. ఇది పరిసరాలను వేడెక్కిస్తోంది. ఈ వ్యర్థాలను చల్లబరచడానికి సమీపంలోని నదులు/ జలాశయాల ఉపయోగిస్తారు. ఆ విధంగా విడుదలైన ఉష్ణ జలాలను నదులు/జలాశయాల్లో వదులుతారు. అప్పుడు జలాశయాల నీటి ఉష్ణోగ్రత సుమారు 6 నుంచి 10 డిగ్రీల వరకు పెరుగుతోంది. ఫలితంగా నీటిలోని ఆక్సిజన్‌ పరిమాణం తగ్గి జలచరాల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది.
సృష్టిలో గొప్పదైన జీవ వైవిద్యానికి ముప్పు మొదలైంది. ఇటువంటి వైపరీత్యాలు అన్నింటికీ కారణం నిస్సందేహంగా మనిషే. తన అవసరాలు పెరిగే కొద్దీ ప్రకృతి అందించిన సహజ వనరులను మితిమీరి వినియోగించడం మొదలు పెట్టిన నాటి నుంచి పర్యావరణంలో సమతూకం దెబ్బతినడం ఆరంభమైంది. అన్ని దేశాలు అభివృద్ధే ధ్యేయంగా ఆర్ధిక కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అభివృద్ధికి, పర్యావరణానికి గల విలోమ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని సుస్థిరాభివృద్ధి ధ్యేయంగా ప్రతీ దేశం నడుచుకోవాలని పర్యావరణ వేత్తలు అంతర్జాతీయ సంస్థలు ఘోషిస్తున్నాయి. వారి ప్రకారం భావితరాల ప్రయోజనాలను నష్టపరచకుండా ప్రస్తుత తరం ప్రకృతి వనరుల దుర్వినియోగాన్ని అరికట్టాలి. అయితే ఈ కాలుష్యం ఇలాగే కొనసాగితే భావితరాల సంగతి పక్కన పెడితే మన మనుగడ కొనసాగడమే ప్రశ్నార్థకం కానుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విపత్తును దృష్టిలో ఉంచుకుని పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రభుత్వాలు తమ కార్యాచరణ మొదలుపెట్టాలి. చట్టాలు కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా పటిష్టంగా వాటిని అమలు చేయాలి.
వర్ధమాన దేశాలు కూడా పర్యావరణ రహిత విధానాలు చేపడుతూ ముందుకు వెడుతున్నాయి. పౌర సమాజం నుంచి కూడా ఏ విధమైన స్పందన కనిపించడం లేదు. ఏవో కొన్ని స్వచ్చంధ సంస్థలు మాత్రం చిత్తశుద్ధిలో తమ వంతు బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మనుషుల్లో మాత్రం పర్యావరణ పరిరక్షణ విషయంలో ఆశించిన చైతన్యం రాలేదనే చెప్పవచ్చు. ప్రాథమిక విద్య నుండి పర్యావరణ విద్య అందించి అందరిలో చైతన్యం తీసుకురావాలని ప్రభుత్వ ఆశయం. అయితే విద్యా సంస్థల్లో ఈ సబ్జెక్టు బోధన తూతూ మంత్రంగానే కొనసాగిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయి.. అంటూ విమర్శల బాణాలు ఎక్కు పెట్టే మనం మాత్రం కాలుష్య వృద్ధికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులు అవుతున్నాం. ప్రభుత్వాల చిత్తశుద్ధితో పాటు ప్రజల బాధ్యత కూడా ప్రధానమైంది. ప్రస్తుత పరిస్థితులలో ప్రకృతిలో తిరిగి పొందలేని సహజ వనరుల వినియోగం విషయంలో పొదుపు పాటిస్తూ సాంప్రదాయేతర ఇంధన వనరులైన సౌరశక్తి, పవన శక్తి వంటి వాటిపై దృష్టి పెట్టి ఆచరణలో తీసుకు రాగలిగితే చాలా వరకు ప్రమాదాన్ని అరికట్టవచ్చు. అంతకన్నా ముఖ్యంగా వనరుల వినియోగం విషయంలో 3ఆర్‌ సూత్రాన్ని పాటించాలి. అవి 1) తగ్గించడం (రెడ్యూస్‌), 2) తిరిగి వాడటం (రీ యూజ్‌), 3) పునరుద్ధరణ (రీసైక్లింగ్‌) వంటి పద్దతులు మనిషి జీవితంలో భాగం కావాలి.
మహాత్మాగాంధీ చెప్పినట్లు ‘ప్రకృతి ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చగలదు. కానీ వారి దురాశను కాదు’ అనే మాటను వాస్తవంలో పాటించి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగానికి ప్రాధాన్యం కల్పించినప్పుడు ఈ భూగ్రహంపై మనం కొంత కాలంపాటు మనుగడ సాగించగలం. మనతో పాటు భావితరాలకు అవకాశం కల్పించినవాళ్లమవుతాం. ఈ భూగ్రహంపై నేనూ ఒక భాగం అన్న స్పృహ ప్రతి ఒక్కరిలో ఉండాలి. పర్యావరణానికి భౌగోళిక, రాజకీయ సరిహద్దులు ఉండవు. ప్రపంచంలో ఎక్కడా స్వచ్ఛమైన వాతావరణం లేదు కాబట్టి ఇక్కడ కూడా ఉండదని భావించలేం. మనకు ఉన్న భూగోళం ఒకటే.. వాతావరణమూ ఒకటే. దీన్ని పరిరక్షించుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ చైతన్యం రావాలి.

– రుద్రరాజు శ్రీనివాసరాజు, 9441239578