బాల్యాన్ని బాధ్యతగా తీర్చిదిద్దుదాం

Let's make childhood a responsibilityబాల్యం అందమైన కాలం. ఈ కాలాన్ని బాలలు అందంగా గడపాలి. పిల్లల మనసులు చాలా సున్నితంగా, ప్రతిదీ గ్రహించే స్వభావంతో ఉంటాయి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, సంఘటనలను గమనిస్తూ, వాటిని తమదైన శైలిలో అర్థం చేసుకుంటారు. ఈ ప్రక్రియలో కథలు, కవితలు, పుస్తకాలు, బాలలకు మార్గదర్శకంగా ఉంటాయి. అందుకు కావలసిన ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉంది. బాగా చదివి, మంచి పౌరులుగా, దేశ అభ్యున్నతికి ఉపయోగపడే భవితగా, బాలలను తీర్చిదిద్దాలి.

ప్రతి సంవత్సరం నవంబర్‌ 14న మనదేశంలో బాలల కోసం ఒక ప్రత్యేకమైన రోజును జరుపుకునేదే బాలల దినోత్సవం. ఈ రోజు మన దేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి. చిన్నారులను బాగా ఇష్టపడే నెహ్రూను స్మరించుకుంటూ, ఈ రోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. బాల్యం అంటే ఆనందం, ఉల్లాసంగా ఆడుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, కలలు కనడం. బాల్యమే జీవితానికి మూలం. బాల్యంలో నేర్చుకున్న విలువలు జీవితాంతం మనతో ఉంటాయి. ఈ రోజు బాలల హక్కుల గురించి ప్రజలలో అవగాహన కల్పించడానికి ఉపయోగపడుతుంది. ప్రతి బిడ్డకు సమాన అవకాశాలు లభించాలని బాలల దినోత్సవం రోజు బాలల శారీరక, మానసిక, సామాజిక, అభివద్ధికి, ఊహాశక్తిని, జ్ఞానాన్ని పెంపొందించడానికి కావలసిన భాష అభివద్ధి తోపాటు నైతిక విలువలను, సజనాత్మకత ఆలోచన శక్తిని సామాజిక, నైపుణ్యాలను ప్రోత్సహించాలి. ఈ రోజు బాలలను ప్రేమించడం, అభినందించడం, వారికి కానుకలుగా కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు, తెలుగు సాహితి, సామాజిక, అంశాలకు సంబంధించిన పుస్తకాలను బహుమతులుగా ఇచ్చి వారిలో చదువుకోవాలనే ఆసక్తిని పెంపొందించాలి. స్కూళ్లలో ఈ రోజు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించి, పిల్లలతో పద్యాలు పాడించడం, కవితలు రాయించడం, కథలు చెప్పించడం, చిత్రలేఖనం గీయించడం, నాటకాలు వేయించడం వంటి కార్యక్రమాలతో వారిలో సజనాత్మక శక్తిని పెంపొందించాలి. పిల్లలకు దేశాభివద్ధి పట్ల అవగాహన కల్పించాలి. దేశం అభివద్ధి చెందాలంటే బాలలను బాధ్యతాయుత పౌరులుగా తయారు చేయాలి. మంచి భవిష్యత్తు కోసం బాలలు కష్టపడి చదవాలి. ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనను పెంపొందించాలి. 2020 జాతీయ విద్యా విధానం భారతదేశ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. ఈ విధానం ప్రతి విద్యార్థిని ఒక సమగ్ర వ్యక్తిగా తీర్చిదిద్దడంపై దష్టి సారించింది. తరగతి గది గ్రంథాలయాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యతని ఇచ్చారు. విద్యార్థులు తమ పుట్టినరోజున చాక్లెట్లు, కేకులు, కాకుండా, తమకి ఇష్టమైన కథలు, కవితలు, సాహితి పుస్తకాలను బహుమతిగా ఇవ్వటం వల్ల క్లాస్‌లోని మిగతావారికి అద్భుతమైన జ్ఞానం లభిస్తుంది. దీని వల్ల పిల్లలు మనస్పర్ధలకు, కొట్లాటలకు, దూరంగా ఉండి, వారే ఒకరికొకరు చర్చించుకుంటూ విజ్ఞానాన్ని పెంచుకుంటారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉన్నతమైన వ్యక్తిత్వంతో దేశ భవిష్యత్తు వైపు అడుగులు వేస్తారు. పిల్లలను వాట్సాప్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లకు కాస్త దూరంగా ఉంచి పుస్తకాల పఠనం పై ఆసక్తి చూపే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల మంచి భవిష్యత్తుకై బాటలు వేయాలని ఆశిద్దాం. పాఠ్యపుస్తకాలతో పాటు పలు రకాలైన పుస్తకాలను చదివిద్దాం. నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దుదాం.
(నవంబర్‌ 14 బాలల దినోత్సవం, గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా)