పిల్లలతో స్నేహం చేద్దాం

Let's make friends with childrenప్రియ మిత్రులారా! తల్లిదండ్రులారా! ఉపాధ్యాయ పెద్దలారా! ప్రస్తుతం పాఠశాల విద్యార్థులు మార్కులు – ర్యాంకుల రేసులో కొట్టుకుపోతున్నారు. తమ పిల్లలకు సరైన ర్యాంకు రాకపోతే ఇక భవిష్యత్తే లేదనేవిధంగా తల్లిదండ్రులు భయపడుతున్నారు.
‘తమ దగ్గర చదువుకుంటే చాలు – ఇక మీ పిల్లల భవిష్యత్తు బంగారమే’ అన్న చందంగా కార్పొరేట్‌ ప్రైవేట్‌ పాఠశాలలు వ్యాపార ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఆ మోజులో పడిన తల్లిదండ్రుల నుండి రకరకాల ఫీజుల పేరుతో వేలు, లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. పిల్లల భవిష్యత్‌ కోసం తల్లిదండ్రులు ఆ ఉచ్చులోపడి శక్తికి మించి భారాన్ని మోస్తున్నారు. అప్పుల పాలవుతున్నారు. నరకయాతన పడుతున్నారు.
ఈ క్రమంలో పిల్లలు ఇటు తల్లిదండ్రుల నుండి, అటు టీచర్ల నుండి భయంకర ఒత్తిడిని ఎదుర్కొంటూ బాల్యాన్ని కోల్పోతున్నారు. నిరంతరం చదువు, పరీక్షలు, ర్యాంకులు అన్నమాటలే వారిని వెంటాడి వేటాడి వేధిస్తున్నాయి.
ఫలితంగా పిల్లలు తమ సొంత ఆలోచనను, ఆనందాన్ని, వివేకాన్నిన (ఏది మంచి? ఏది చెడు?) పోగొట్టుకుంటున్నారు. సొంత చదువు, సొంత జ్ఞానం లేక పటిష్టమైన బాల్యపు పునాదిని నష్టపోతున్నారు. టీచర్లు చాలామంది యాంత్రికంగా మారి ‘బిల్‌ అండ్‌ బెల్‌’ పద్ధతిలో వ్యవహరిస్తూ పిల్లల్ని అసలు పట్టించుకోవడం మానేశారు. తల్లిదండ్రులు కూడా చాలా మంది ఫీజులు కట్టాం కదా అనీ, టైం లేదనీ, విషయం తెలియకా పిల్లల పట్ల ఉదాసీనంగా / నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పిల్లల్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వారు చెప్పేది వినడం మానేశారు. ఆత్మీయంగా తెలుసుకునే మానవీయ విద్యకు అందనంత దూరంలో వున్నారు ఇప్పుడు చాలా మంది పిల్లలు.
ఈ నేపథ్యంలో మరల ర్యాంకుల కోసం, హోంవర్క్‌లు చేయించేందుకు, పాఠాలు బట్టీయం పెట్టించేందుకు ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా ట్యూషన్‌ సెంటర్లు వెలుస్తున్నాయి. పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టయింది విద్యార్థుల పరిస్థితి.
కాగా, ఏ మాత్రం సమయం చిక్కినా పిల్లలు సెల్‌ఫోన్‌కు అతుక్కుపోతున్నారు. వాటిలో చూడకూడనివి చూస్తూ (పోర్న్‌, బూతు చిత్రాలు), ఆడకూడనివి ఆడుతూ (పబ్జి, బ్లూవేల్స్‌, బెట్టింగ్‌ గేమ్స్‌) తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు. పిల్లలు సెల్‌ఫోన్స్‌తో ఒంటరిగా ఎక్కువ కాలం గడిపితే మానసిక, శారీరక రుగ్మతలకు లోనవుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు కూడా.
పులి మీద పుట్రలా ఇప్పుడు పిల్లల వద్దకు చాక్లెట్ల రూపంలో డ్రగ్స్‌ (మత్తు పదార్థాలు) చేరుతున్నాయి. ఈ ప్రమాదకర వాతావరణం నుండి మనం మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.
‘చుట్టూతా చీకటిని చూసి విలపించే కంటే
చేతనైన మేరకు చిరుదీపం వెలిగించడం మేలు’
కొందరు పిల్లల ప్రేమికులు (వయసుతో నిమిత్తం లేకుండా), కొన్ని స్వచ్ఛంద సేవాసంస్థల వారు తమ పరిధిలో ప్రత్యామ్నాయ ట్యూషన్‌ సెంటర్స్‌ను నెలకొల్పి పిల్లల్ని కాపాడే పనిలో ఉన్నారు. వాటినే క్రియేటివ్‌ లెర్నింగ్‌ సెంటర్స్‌ (సి.ఎల్‌.సి) గా పిలుస్తున్నారు. ఈ సృజనాశీల శిక్షణా కేంద్రాలలో రోజుకు రెండు గంటలు ఓ వాలంటీర్‌ / టీచర్‌ దాదాపు 20 మంది పిల్లలతో హాయిగా గడుపుతారు. ఇక్కడ పిల్లలు విజ్ఞానాన్ని ఆనందంగా నేర్చుకుంటారు. (జారుఫుల్‌ లెర్నింగ్‌)
సి.ఎల్‌.సి. టీచర్‌ / వాలంటీర్‌ పాటించవలసిన నియమాలు
1. పిల్లలతో స్నేహం చేయాలి. ఆత్మీయంగా మాట్లాడాలి. తిట్టకూడదు. కొట్టకూడదు. పిల్లలందర్నీ సమంగా చూడాలి. ముఖ్యంగా వెనకబడి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పిల్లలు చెప్పే విషయాలను ఓపిగ్గా వినాలి. బెరుకును, భయాన్ని పోగొట్టాలి. తాను ఉత్సాహంగా వుంటూ పిల్లల్ని ఉత్సాహపరచాలి.
2. పిల్లల పేరు, తరగతి మొదలగు అంశాలతో రిజిస్టరు మెయింటైన్‌ చేయాలి. సి.సి.ఇ. (కాంప్రెహెన్సివ్‌ కంటిన్యుటీ, ఎవాల్యూషన్‌ – సమగ్ర నిరంతర మూల్యాంకన) పద్ధతిలో ప్రతిదీ రికార్డు చేయాలి.
సి.సి.ఇ. రికార్డు
శారీరకంగా : పిల్ల / పిల్లవానిది ఏ మతమైనా, ఏ కులమైనా, దివ్యాంగులైనా సమంగా ఆదరించాలి. ఇంటి వద్ద పేదరికం, ఆకలి, ఇతర కష్టాలు వున్నా ఓపిగ్గా విని ఓదార్పునివ్వాలి. మంచి మాటలు చెప్తూ జీవితం పట్ల ఆశను, అనురక్తిని రేకెత్తించాలి. పిల్లలు మనసు విప్పి మాట్లాడేలా చేయాలి. (పిల్లల్ని వినడం ముందుగా పెద్దలు నేర్చుకోవాలి)
మానసికంగా : పిల్లలు ప్రతివిషయాన్ని సొంతంగా ఆలోచించేలా చేయాలి. కథలు చెప్పాలి. తిరిగి కథలు చెప్పించాలి. అమ్మ గురించి, బడి గురించి, స్నేహం గురించి లేదా ఐస్‌క్రీం గురించి, ఆటలు గురించి వారిని సొంతంగా మాట్లాడేలా చేయాలి. అప్పుడు వారు తమ ఆలోచనకు పదును పెడ్తారు (బట్టీ వద్దు). అలాగే సొంతంగా రాయమని ప్రోత్సహిస్తూ తప్పులు దిద్దాలి. ప్రశ్నలు అడిగేవిధంగా ప్రోత్సహిస్తే వారిలో మానసిక వ్యాయామం పెంపొందుతుంది.
చదువు పరంగా : ఎఫ్‌.ఎల్‌.ఎన్‌. (ఫౌండేషన్‌ లిటరసీ న్యూమరసి – ప్రాథమిక చదువు గణితం) 6,7 తరగతులు వచ్చేసరికి సొంతంగా చదవడం, రాయడం, మాట్లాడడం కచ్చితంగా రాయాలి. తదనుగుణమైన ప్రణాళిక ప్రతి విద్యార్థికి అనుగుణంగా వాలంటీర్‌ / టీచర్‌ వేసుకోవాలి. ఆ విధమైన టి.ఎల్‌.ఎమ్‌. (టీచర్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌)ను జాగ్రత్తగా రూపొందించుకోవాలి లేదా సేకరించుకోవాలి.
3. పిల్లల తల్లిదండ్రులతో కనీసం మూడ్నెల్లకు ఓ సారైనా సమావేశం కావాలి. పిల్లల ఎదుగుదల గురించి వారికి చెప్పాలి.
ఇదే అసలైన చదువని, జీవితానికి నిజమైన పునాదని టీచర్‌ / వాలంటీర్‌ గ్రహించాలి. నమ్మాలి. తదనుగుణమైన జంట కృషి (ఈచ్‌ ఒన్‌ – టీచ్‌ ఒన్‌) జట్టు కృషి (గ్రూప్‌ వర్క్‌) పిల్లలకు ఇచ్చి అభ్యాసం (ప్రాక్టీస్‌) చేయించాలి.

1. కథలు చెప్పాలి, చెప్పించాలి.
2. పాటలు పాడాలి, పాడించాలి.
3. ఆటలు ఆడాలి, ఆడించాలి.
4. నాటకాలు వేయాలి, వేయించాలి.
5. క్రాఫ్ట్‌వర్క్‌ చేయాలి, చేయించాలి.
6. బొమ్మలు గీయాలి, గీయించాలి.
7. మంచి సినిమాలు చూపించాలి, చర్చించాలి.
8. పాఠ్యేతర పుస్తకాలు, పత్రికలు చదివించాలి. చదువును ఇష్టంగా మార్చాలి (లవ్‌ రీడింగ్‌)
వీటితో పాటు అప్పుడప్పుడు పిల్లల్ని చుట్టుపక్కల ప్రదేశాలకు తీసుకెళుతూ, ఆ ప్రాంతాల గురించి అక్కడి ప్రజలు పనిచేసే వృత్తుల గురించి చెబుతూ వీలైనంత ఎక్కువగా లోకజ్ఞానాన్ని తెలపాలి. వారు అడిగే ప్రశ్నలకు చిరునవ్వుతో బదులివ్వాలి. తెలియకపోతే తెలుసుకుని చెప్పాలి. ప్రకృతి జ్ఞానాన్ని, సామాజిక జ్ఞానాన్ని వివరించాలి.
సృజనశీల శిక్షణా కేంద్రం (సి.ఎల్‌.సి)

చక్కటి భాష చదవడం, రాయడం నేర్చుకుంటారు. పాటలు పాడడం, కథలు చెప్పడం, ఆటలు ఆడడం, నాటకాలు వేయడం అన్నవి చదువులో భాగమే. చిన్నప్పటి నుండే సొంతంగా ఆలోచించడం, మాట్లాడడం, క్రమశిక్షణతో వ్యవహరించడం తెలుసుకుంటారు. అరమరికలు లేకుండా స్నేహం చేయడం, ఆత్మీయంగా కలిసిమెలిసి నడవడం, శ్రమను గౌరవించడం, ప్రశ్నించడం, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడం నేర్చుకుంటారు. అంతిమంగా మంచి భారతీయ పౌరులుగా ఎదిగేందుకు పునాదులు వేయడం ఈ కేంద్రం లక్ష్యం.
కె.శాంతారావు
995975723