నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
బాల్యవివాహాల రహిత జిల్లాగా నల్లగొండలో తీర్చిదిద్దుతామని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గౌరవ సభ్యులు పొనుగోటి అంజన్ రావు అన్నారు. శనివారం ఆశ్రిత ఎన్జీవో ఆధ్వర్యంలో బాల్యవివాహాల రహిత భారత్ కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ భవన్ లో ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ నాగరాజు అధ్యక్షతన మహిళ, శిశు సంక్షేమ శాఖవారి భాగస్వామ్యంతో బాల్య వివాహల రహిత జిల్లాగా చేసేందుకు జిల్లాస్థాయి కన్వర్జెన్సీ సమావేశము వివిధ లైన్ డిపార్ట్మెంట్స్ తో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాల్యవివాహాల నిరోధక చట్టం ఏర్పడి 18 సంవత్సరాలు అవుతున్న నేటికి బాల్యవివాహాలు జరగడం దురదృష్టకరమని అన్నారు. బాల్యవివాహాల నిర్మూలన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయుటకు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలతో జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అన్నారు. బాలల సంక్షేమ సమితి జిల్లా చైర్మన్ చింత కృష్ణ మాట్లాడుతూ జరగబోయే బాల్యవివాహాలను ముందస్తుగా గుర్తించి సంబంధిత అధికారులకు లేదా చైల్డ్ లైన్ సర్వీస్ కు సమాచారం అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి మాట్లాడుతూ బాల్యవివాహాలు, బాల కార్మికులు, బాలల లైంగిక వేధింపులు, బాలల అక్రమ రవాణా నాలుగు అంశాల మీద పనిచేయుటకు ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడాన్నీ స్వాగతిస్తున్నామని, స్వచ్ఛంద సంస్థలు అధికారులు సమన్వయంతో పని చేద్దామని అన్నారు. సహాయ కార్మిక శాఖ అధికారి అరుణ మాట్లాడుతూ 14 సంవత్సరాల లోపు పిల్లలు పనిలో ఉన్నట్లు దృష్టికి వస్తే కార్మిక శాఖకు లేదా హెల్ప్ లైన్ కు సమాచారం అందించాలని, 18 సంవత్సరాల లోపు పిల్లలు ప్రమాదకరమైన పనులలో ఉన్నట్లయితే కార్మిక శాఖ దృష్టికి తెలుపాలని అన్నారు. అనంతరం యూనిసెఫ్ ప్రతినిధి డేవిడ్ రాజ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీడీపీఓ లకు, సూపర్ వైజర్స్ కు డీసీపియు స్టాఫ్ స్వచ్ఛంద ప్రతినిధులకు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి సభ్యులు కొండ వెంకన్న, ఈద భాస్కర్, ఎర్ర శివరాజ్, డిసిపిఓ గణేష్, సంస్థ జిల్లా కో ఆర్డినేటర్స్ మాధవి రెడ్డి, పర్వతాలు, శోభరాణి, ఏఎల్ఓ రాజు, ఏహెచ్టియు ప్రతినిది యాదగిరి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సుమలత, నాగమణి, పగడాల నాగయ్య, పొదిల్ల శ్రీనివాస్, గౌతమ్ రెడ్డి, మునీష్, హరీష్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ మహేష్, సిడిపివోలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.