నవతెలంగాణ – కమ్మర్ పల్లి
కాంగ్రెస్ పార్టీ గత తొమ్మిది నెలల క్రితం ఎన్నికల హామీలో భాగంగా ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని నిర్వహించ తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా జిల్లా నాయకులు సారా సురేష్ కోరారు. శనివారం మండల కేంద్రంలోని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈనెల 22న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోస్టర్లు ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చే్తామని, 420 సమస్యలను పరిష్కారిస్తామని ఓట్లు వేయించుకొని అధికారులకు వచ్చిందన్నారు. నేటికీ ఏ ఒక్కటి కూడా సరిగ్గా అమలు జరపలేని పరిస్థితిలో కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నదని విమర్శించారు. పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని, ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు రూ.5లక్షలు ఇస్తామని, ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు ఇస్తామని, బీడీ కార్మికులందరికీ జీవన భృతి రూ.4016, రైతులందరికీ సంవత్సరానికి రూ.12 వేల ఇస్తామని, మహిళలందరికీ గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తామని, ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు.,మహిళలందరికీ ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చి, బస్సుల సంఖ్య పెంచకుండా ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల స్త్రీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలను అమలు చేయాలని, రెండు లక్షల రుణమాఫీ ఎలాంటి నిబంధన లేకుండా అమలు చేస్తామని చెప్పి, అనేక కొరవీలు పెడుతున్నారని, సాంకేతిక లోపాలు ఉన్నాయని చెప్పి వాటి అమలు చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. వంద రోజులలో అమలు చేస్తానన్న సమస్యలన్నీ అమలు చేయాలని, తక్షణమే పోడు భూముల సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీటికి పరిష్కార మార్గం పోరాట మార్గమే ఏకైక మార్గమని ప్రజానీకానికి గుర్తు చేస్తున్నామన్నారు. పోరాటం చేయకుండా ఏ సమస్య కూడా పరిష్కారం కాదని, పాలకుల కండ్లు తెరిపించవలసిన అవసరం ఉందన్నారు. ఈనెల 22న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా మండల కార్యదర్శి బి.అశోక్, పార్టీ మండల నాయకులు వి.బాలయ్య, టి.బాలకిషన్, పెద్ది రాజేశ్వర్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.