– అధికారులు, కౌన్సిలర్లు బాధ్యతగా పనిచేయాలి
– తాగునీటి, విద్యుత్ అధికారుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ టౌన్
రాష్ట్రానికి తాగునీటి కోసం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో త్వరలోనే కర్నాటక ముఖ్యమంత్రిని కలుస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని బుధవారం నల్లగొండ మున్సిపాలిటీలో తాగునీరు, విద్యుత్ సరఫరాలపై కౌన్సిలర్లు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా 3 నెలల పాటు మున్సిపల్, మిషన్ భగీరథ, ట్రాన్స్‌కో అధికారులు, కౌన్సిలర్లు బాధ్యతగా పని చేయాలని సూచించారు. వర్షాలు లేక ఈ సంవత్సరం బోర్లన్నీ ఎండిపోయా యని, ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 25 ఏండ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని, అందువల్ల నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని అందరూ బాధ్యతగా పని చేయా లని చెప్పారు. ఎక్కడైనా సమస్యలు ఉన్నచోట తక్షణమే పరిష్కరించాలని, విద్యుత్ లైన్లు మార్చా ల్సిన చోట, ట్రాన్స్‌ఫాÛర్మర్లు, ఇతర మెటీరియల్ అవస రమైతే బడ్జెట్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పం పించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ.. కొన్ని వార్డులలో తాగునీటికి ఇబ్బందిగా ఉందని, పట్టణంలో రోజు విడిచి రోజు 20 నుంచి 30 నిమిషాలు తాగు నీరు సరఫరా అవుతోందని, కొన్నిచోట్ల లీకేజీలు అవుతు న్నాయని, వాటిని అరికట్టాలని అన్నారు. జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన మాట్లాడుతూ.. తాగునీటి సమస్యలు ఉంటే అవసరమైతే అదనపు ట్యాంకర్లను పంపించి సరఫరా చేస్తామని, అయితే నీటిని పొదుపుగా.. జాగ్రత్తగా వినియోగించు కోవాలని అన్నారు. అంతకుముందు మిషన్ భగీరథ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు జిల్లాలో ప్రస్తుతం తాగునీటి సరఫరాపై వివరించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డిఆర్‌ఓ డి.రాజ్యలక్ష్మి, మున్సిపల్ చైర్మెన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ చంద్రమోహన్, ఆర్డీఓ రవికుమార్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ పాల్గొన్నారు.