– డీివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్
– ఆర్టీసీ క్రాస్ రోడ్డులో భగత్‌సింగ్ సందేశ్ ర్యాలీ
నవతెలంగాణ – ముషీరాబాద్
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా.. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణాలను అర్పించిన విప్లవ వీర కిశోరాలు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ పోరాట స్ఫూర్తితో.. అసమానతలు లేని సమాజం కోసం యువత ఉద్యమించాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ అన్నారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ 93వ వర్ధంతి సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్క్ నుంచి ఆర్టిసీ క్రాస్ రోడ్డు వరకు భగత్‌సింగ్ సందేశ్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన అనంతరం వెంకటేశ్ మాట్లాడుతూ.. భారతదేశ విముక్తి కోసం 23 ఏండ్ల వయసులోనే ప్రాణాలర్పించిన గొప్ప విప్లవ వీర కిషోరాలు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ అని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భగత్‌సింగ్ ఆలోచనలకు విరుద్ధంగా మతాన్ని రాజకీయ సాధనగా వాడుకుంటూ.. మతోన్మాద విధానాలతో ప్రజల మధ్య విభజన సృష్టిస్తోందని తెలిపారు. తినే తిండిపై, కట్టే బట్టపై ఆంక్షలు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే రచయితలు, మేధావులు, విద్యార్థులు, యువత, ప్రగతిశీల శక్తులు, దళితులు, మైనార్టీలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు జరుగుతున్నాయని చెప్పారు. చరిత్రలో భగత్‌సింగ్ జీవిత చరిత్రను కనుమరుగు చేసేందుకు ప్రయాత్నాలు చేస్తున్నారని తెలిపారు.
భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో అన్యాయాలు, అక్రమాలు, అవినీతి అంతంపైనా, మతోన్మాదానికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ఉద్యమించాలని సూచించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్‌ను, గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు నిరంతరం నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అశోక్ రెడ్డి, లెనిన్, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హష్మీబాబు, జావిద్, శ్రీనివాస్, నాగేందర్ ప్రశాంత్, చరణశ్రీ, సహన, డీవైఎఫ్‌ఐ మాజీ నాయకులు విజరుకుమార్, మహేందర్, శ్రీనివాసరావు, జేకే శ్రీనివాస్, అజరు బాబు తదితరులు పాల్గొన్నారు.