– ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే స్ఫూర్తితో విద్యా, ఉపాధి అవకాశాల కోసం ఉద్యమిద్దామని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షులు అర్ఎల్ మూర్తి పిలుపునిచ్చారు. ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమిలో సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి ఆర్ఎల్ మూర్తి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మమత పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతి అంటే దండ వేసి దండం పెట్టడం మాత్రమే కాదని ఆమె జీవిత త్యాగాలను ప్రతి విద్యార్థి చదవాలని కోరారు. మనుధర్మ శాస్త్రం ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వీర వనిత ఆమె అని అన్నారు. మహిళలు, విద్యార్థినిలు సావిత్రిబాయి ఫూలే స్ఫూర్తితో హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం ముసుగులో విద్యారంగంలోకి మనుధర్మ శాస్త్రాన్ని ప్రవేశ పెడతున్నరని విమర్శించారు. దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు, కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నదని చెప్పారు. సావిత్రిబాయి ఫూలే పేరుతో విద్యార్థినిలకు రాష్ట్ర ప్రభుత్వం ఫెలోషిప్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మమత మాట్లాడుతూ మోడీ ప్రభుత్వానికి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లు అమల్లో వారి కపట వైఖరి కనబడిందని చెప్పారు. అశ్లీల సాహిత్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ అధ్యక్షులు లెనిన్ గువేరా అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.