సీసీఐ, రైల్వేలైన్‌ సాధనకు ఉద్యమిద్దాం..

సీసీఐ, రైల్వేలైన్‌ సాధనకు ఉద్యమిద్దాం..– రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తల పిలుపు
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)ను పునరుద్ధరించేందుకు సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఏకతాటిపై వచ్చి పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సీనియర్‌ నాయకుడు బండి దత్తాత్రి అధ్యక్షతన మంగళవారం వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి స్థానిక యాదవ సంఘ భవనంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణ, ఆదిలాబాద్‌ నుంచి ఆర్మూర్‌ వరకు రైల్వేలైన్‌ మంజూరు, విమానాశ్రయ నిర్మాణం కోసం 2024 బడ్జెట్‌ సమావేశాల్లోనే నిధులు కేటాయించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ఇందుకు అందరం కలిసి పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామన్నారు. ఈ డిమాండ్లను నెరవేర్చాలని తీర్మానించారు. ఉద్యమానికి అవసరమైన భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. గత ఎన్నికల్లో సీసీఐని తెరిపిస్తామని లబ్దిపొందిన బీజేపీ అనంతరం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసేసిన పరిశ్రమను తక్షణమే తెరిపించాలని డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్‌ నుంచి ఆర్మూర్‌ వరకు రైల్వేలైన్‌ ఏండ్లుగా సర్వేలోనే మగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రలో విమానాశ్రయ నిర్మాణానికి అన్ని అనుకూలతలూ ఉన్నాయని, 369 ఎకరాల భూమి కూడా ఉందని గుర్తుచేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అదే విధంగా పత్తి పంటకు పేరుగాంచిన జిల్లాలో కాటన్‌ ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేయాలని, గిరిజనులు ఎక్కువగా ఉన్నందున ఉట్నూర్‌ కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. వీటిని సాధించడమే ధ్యేయంగా ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. దీనికిగాను ఆదిలాబాద్‌ అభివృద్ధి సాధన పోరాట కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లంక రాఘవులు, పూసం సచిన్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడి, బీఆర్‌ఎస్‌ నాయకులు నారాయణ, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మెన్‌ అల్లూరి సంజీవరెడ్డి, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు నంది రామయ్య, టీఎన్‌జీఓ నాయకుడు సంద అశోక్‌, వివిధ ప్రజా, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు బొజ్జ ఆశన్న, లోకారి పోశెట్టి, రూపేష్‌రెడ్డి, కొండ రమేష్‌, అంబకంటి అశోక్‌, బి.రాహుల్‌, జగన్‌సింగ్‌, మనోజ్‌ పాల్గొన్నారు.