– రిజర్వేషన్లతోనే సమానత్వం
– మందకృష్ణ, మోత్కుపల్లి ఎక్కడికి పోయారు?
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కాంగ్రెస్‌కు అండగా ఉండాలి : రాజ్యాంగ పరిరక్షణ దీక్షలో కాంగ్రెస్ నేతలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాజ్యాంగంపై బీజేపీ కుట్రలు సాగనివ్వబోమని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే, ఎస్సీ, ఎస్టీ,బీసీలకు రిజర్వేషన్లు ఉంటాయని వారు తెలిపారు. రిజర్వేషన్లను రక్షించుకునేందుకు ఆయా వర్గాలు కాంగ్రెస్‌కు అండగా నిలవాలని కోరారు. రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తుంటే మందకృష్ణ, మోత్కుపల్లి నర్సింహులు ఎక్కడిపోయారని ప్రశ్నించారు. దాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ ఎస్సీ విభాగం అధ్యక్షులు ప్రీతమ్ అధ్యక్షతన రాజ్యాంగ పరిరక్షణ దీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని ప్రీతమ్ ఈ సందర్భంగా విమర్శించారు. ముగింపు సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వారికి నిమ్మసర మిచ్చి దీక్షను విరమింపజేశారు. ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో కులగణన చేస్తామంటూ రాహుల్‌గాంధీ బహిరంగంగా ప్రకటించారని గుర్తు చేశారు. బీజేపీ దాని గురించి మాట్లాడం లేదని విమర్శించారు.దేశంలో అసమానతలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదన్నారు. అందుకోసం రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధు యాష్కీగౌడ్ మాట్లాడుతూ రోహిత్ వేముల ఆత్మహత్య కేసును ముగించడం సరైందికాదన్నారు. కుల వివక్షతతోనే రోహిత్ చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాంతాచారి తల్లిని కూడా కేసీఆర్ అవమానిచ్చారని గుర్తు చేశారు. అందువల్ల బడుగు, బలహీన వర్గాలు ఐక్యం కావాల్సిన అవసరముందన్నారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు మాట్లాడుతూ ఈసారి బీజేపీకి 400 సీట్లు వస్తే ఇష్టమెచ్చినట్టుగా రాజ్యాంగాన్ని మార్చేస్తుందని హెచ్చరించారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ కుట్రలను సీఎం రేవంత్‌రెడ్డి చేధించారనీ, అందుకే మోడీకి భయం పట్టుకుందన్నారు. మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజ్యాంగంపై కుట్ర జరుగుతుంటే, మందకృష్ణ, మోత్కుపల్లి నర్సింహులు ఎక్కడిపోయారని ప్రశ్నించారు. ఈ దీక్షలో ప్రజాసంఘాల జేఏసీ చైర్మెన్ గజ్జెల కాంతం, కాంగ్రెస్ నేత సతీష్ మాదిగ, మానవతారారు, ఆరేపల్లి మెహన్, ఊట్ల ప్రసాద్ తదితరులు మాట్లాడారు.