– కోర్టులో ఉన్న విషయాలపై నరేందర్‌రెడ్డి మాట్లాడడం సరికాదు
– దాడి ఘటనలో అన్ని ఆధారాలూ ఉన్నాయి
– విచారణకు సహకరించకుంటే బెయిల్ రద్దు కోరతాం : పరిగిలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఐజీ సత్యనారాయణ
నవతెలంగాణ-పరిగి
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులైన వారినెవ్వరిని వదలబోమని ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. గురువారం పరిగి పట్టణ కేంద్రంలో ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి బుధవారం ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలు విచారణను ప్రభావితం చేసే విధంగా ఉన్నాయని అన్నారు. విచారణనకు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ప్రభావితం చేయొద్దనే నిబంధనలు ఉన్నాయని, దానికి విరుద్ధంగా నరేందర్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారన్నారు. సురేష్ కావాలనే కలెక్టర్ దృష్టి మళ్లించి గ్రామంలోకి తీసుకెళ్ళాడని, పథకం ప్రకారమే సురేష్ అనుచరులు రాళ్ళు, కర్రలతో కలెక్టర్, అధికారులపై దాడి చేశారని తెలిపారు. దాడికి ముందు రోజే పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ కలిసి దాడి చేయాలని పథకం పన్నారన్నారు. దాడికి వారం ముందే పట్నం నరేందర్‌రెడ్డి ఆయా గ్రామాల్లో తిరిగి దాడి చేయాలని ప్రజలను రెచ్చగొట్టారని, అది సోషల్ మీడియాలో వైరల్ కూడా అయిందన్నారు.
దాడి చేసిన 17 మందికి కనీసం భూమి కూడా లేదన్నారు. సురేష్, మహేష్‌ల భూమి ఫార్మా కంపెనీలో పోవడం లేదన్నారు. కలెక్టర్ సౌమ్ముడు కాబట్టి లగచర్లకు పోలీసులు వస్తామంటే వద్దన్నాడని తెలిపారు. ‘అక్రమంగా కేసులు పెట్టారు అనేది తప్పు. నిఘా వైఫల్యం కానే కాదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. పోలీసు బందోబస్తుతోనే అక్కడికి వెళ్ళాం. దాడిలో పాల్గొన్న నిందితులను ఎవ్వరినీ పోలీసులు కొట్టలేదు. జడ్జి ముందు కూడా చెప్పలేదు. నరేందర్‌రెడ్డి ఫోన్ పాస్వర్డ్ చెప్పకుండా విచారణకు సహకరించడం లేదు. సురేష్ తన సిమ్ కార్డు విరిచి ఏదో వాహనంలో పడేశానని చెబుతున్నాడు.’ అని ఐజీ తెలిపారు. వీరు విచారణకు సహకరించకపోతే బెయిల్ రద్దుకు కోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపారు. నిందితుడికి బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్ళిన ఘటనలో జైలు అధికారులపై చర్య తీసుకున్నట్టు తెలిపారు. సురేష్‌కు సంబంధించిన కొన్ని ఆడియోలు తమ వద్ద ఉన్నాయని, సమయమొచ్చినప్పుడు బయటపెడుతా మన్నారు. ‘దాడికి ముందు లిక్కర్ ఎక్కడి నుంచి వచ్చింది. దాడి ప్లాన్‌లో ఎవరెవరూ ఉన్నారు అనేది దర్యాప్తు చేస్తున్నాం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాకే.. ఎఫ్‌ఆర్‌ఐలో పేర్లు చేర్చాం.’ అని తెలిపారు. కోర్టులో విచారణలో ఉన్న కేసుపై నరేందర్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో మాట్లాడటం తగదన్నారు. పోలీసులు శాంతిభద్రతల కోసమే పని చేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో అమాయకులు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఘటనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు. ఈ సమావేశంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.