– మతతత్వ రాజకీయాలను అనుమతించం
– ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటునూ గెలవకుండా చూస్తాం : కేరళ సీఎం పినరయి విజయన్
తిరువనంతపురం: కేరళలో బీజేపీ మతతత్వ రాజకీయాలపై ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ హెచ్చరికలు పంపారు. ఆ పార్టీ ఆటలు రాష్ట్రంలో సాగనివ్వబోమని చెప్పారు. కాషాయపార్టీ మతతత్వ రాజకీయాలను వామపక్షాలు అనుమతించబోవని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకుండా చూస్తామని విజయన్ అన్నారు. దేశానికి, ప్రజలకు సంఘ్ పరివార్ విసురుతున్న సవాళ్లను వామపక్షాలు అధిగమిస్తాయనీ, వారిని అధికారం నుంచి తరిమికొట్టేందుకు కృషి చేస్తాయని మీడియా సమావేశంలో విజయన్ చెప్పారు. ” బీజేపీని అధికారం నుంచి దించాలనే లక్ష్యంతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. అందుకే జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌లో చురుకుగా చేరాం. మేము ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాం. బీజేపీ మొత్తం 20 స్థానాల్లో(కేరళలో) ఓటమిని చవిచూడటమే కాదు.. ఈసారి ఏ నియోజకవర్గంలోనూ రెండో స్థానం దక్కించుకోలేకపోతుంది” అని విజయన్ అన్నారు. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయనీ, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ప్రయోజనం లేదని ఆయన అన్నారు. ”గత ఐదేండ్ల అనుభవంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం వల్ల ప్రయోజనం లేదని ప్రజలు అర్థం చేసుకున్నారు. దేశంలో ప్రమాదకర విధానాలను అమలు చేస్తున్న బీజేపీని గద్దె దించేందుకు వామపక్షాలు ప్రజల నుంచి ఓట్లు అడుగుతున్నాయి” అని విజయన్ చెప్పారు. మతతత్వ ఫాసిస్టులతో పోరాడిన చరిత్ర వామపక్షాలకు ఉన్నదన్నారు. కొన్ని ఓట్ల కోసం తాము తమ రాజకీయాలను మార్చుకోబోమని విజయన్ స్పష్టం చేశారు. కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడ ప్రధానంగా అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్), యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)ల మధ్య పోటీ ఉన్నది.