ఆటలాడడం మనుషుల సహజ లక్షణం. పాకే వయసు నుంచే పిల్లలు ఆటల వైపు మొగ్గు చూపుతారు. బుడి బుడి అడుగులు వేసే వయసులో చేతికందిన వస్తువులతో తోచిన రీతిలో ఆటలాడతారు. ఆ వయసులోని వారికి ప్రమాదాలకు తావులేని ఆటబొమ్మలను ఇవ్వాలి. సమవయస్కులైన పిల్లలు కూడా జత చేరితే పిల్లలు మరింత ఉత్సాహంగా ఆటలాడతారు. కాస్త ఊహ తెలిసిన వయసు వచ్చాక వీధుల్లోకి వెళ్లి ఆరుబయట స్నేహితులతో ఆటలాడేందుకు ఇష్టపడతారు. ఆటల వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. ఆటల్లోని సహజ వ్యాయామం వల్ల శరీరం తీరుగా ఎదుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తోటి పిల్లలతో ఆడుకోవడం వల్ల సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయి. బృందంతో కలిసి పని చేయడం, బృందానికి నాయకత్వం వహించడం, బృందం గెలుపు కోసం కృషి చేయడం వంటి లక్షణాలు పిల్లల్లో సహజ సిద్ధంగానే పరిణతిని పెంచుతాయి.
క్రీడలతోనే ఆరోగ్యంగా ఉండడం సాధ్యమవుతుంది. కానీ చిన్నారులు ఆడుకునేటప్పుడు తల్లిదండ్రులు వారిని అడ్డుకొని పొరపాటు చేస్తున్నారు. ఆటల వల్ల పిల్లలు చదువును నిర్లక్ష్యం చేస్తారని, దుందుడుకుగా మారిపోతారని చాలా మంది పెద్దలు అనుకుంటూ ఉంటారు. అవన్నీ కేవలం అపోహలు మాత్రమే అని నిపుణులు అంటున్నారు. నిజానికి ఆటల వల్లనే పిల్లలు మరింత చురుకుగా తయారవుతారు. కాసేపు ఆటలాడుకుని, విశ్రాంతి తీసుకున్న తర్వాత చదువుకున్నట్లయితే పిల్లలు మంచి ఫలితాలు సాధించగలుగుతారని ఎన్నో అధ్యయనాల్లో రుజువయింది. తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడం వల్ల నలుగురితో ఎలా మెసలుకోవాలో తెలుసుకుంటారు. సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచుకోగలుగుతారు. అన్నిటి కంటే ముఖ్యంగా శారీరకంగా దృఢంగా ఎదుగుతారు. క్రీడల వల్ల ఆరోగ్యానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయి.
తరచూ క్రీడలు ఆడటం వల్ల స్థూలకాయం రాదు. క్రీడలు శరీరానికే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా దోహదపడతాయి. ఆందోళన, దిగులు, కుంగుబాటు వంటి మానసిక సమస్యలను అధిగమించడానికి వ్యాయామం, క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆటలు ఏకాగ్రతను పెంచుతాయి. సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తాయి. దీనివల్ల జీవితంలోని ఒడిదుడులకులను తట్టుకునే శక్తి ఏర్పడుతుంది. బృందంతో కలసి పని చేయడం, లక్ష్యాలను నిర్ధేశించుకుని, ఒకరకమైన స్పష్టతతో లక్ష్య సాధన దిశగా ముందుకు సాగడం, క్రమశిక్షణ వంటి సానుకూల లక్షణాలు క్రీడల వల్ల అలవడతాయని పరిశోధనాత్మక వ్యాసాలు తెలియజేస్తున్నాయి.
అయితే ఆధునికత పెరిగిన కొద్ది జనాలు ఆటలకు దూరమవుతున్నారు. ముఖ్యంగా పిల్లలనైతే ఆటలాడే వయసులో మోయలేని చదువుల భారం కుంగదీస్తోంది. క్రీడా మైదానాలు లేని ఇరుకిరుకు పాఠశాలల్లో చదువుకునే పిల్లలు ఆటలకు దూరమవుతున్నారు. దీనివల్ల కొందరుబ బాల్యంలోనే స్థూలకాయం బారిన పడుతున్నారు. ఇంకొదరు రోగనిరోధక శక్తి నశించి, తరచూ అనారోగ్యాలకు గురవుతున్నారు. ఆటలు ఆడే వారికన్నా టీవీల్లో వచ్చే క్రికెట్ మ్యాచ్‌లు, టెన్నిస్ మ్యాచ్‌లు, ఫుట్‌బాల్ మ్యాచనలు చూసే జనాలే ఎక్కువవుతున్నారు. ఆటలు ఆడితేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కుదిరితే స్టేడియంలో, కుదరకుంటే ఇంట్లోనే టీవీల్లో క్రీడల మ్యాచ్‌లు చూసినంత మాత్రానే ఆరోగ్యానికి ఒరిగేదేమీ ఉండదు. కనుక చూస్తూ కూర్చోకుండా లేచి ఆటలు ఆడదాం…