మన హక్కుల్ని కాపాడుకుందాం..

Let's protect our rights..ఒక దేశాభివృద్ధి అక్కడున్న మానవవనరుల మీద ఆధారపడుతుందనేది నిర్వివాదాంశం. వారికుండే హక్కులు చక్కగా అమలయ్యేటప్పుడు మాత్రమే వారు ఆయా రంగాల్లో స్వేచ్ఛగా పని చేయగలుగుతారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ప్రతి ఏడాది డిసెంబర్‌ పదిన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మానవ హక్కుల రంగంలో చేసిన కృషికి గాను ఐదేండ్లకోసారి బహుమతిని, ఇంకా ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతిని పొందిన వారికి ఈ రోజున అవార్డును ప్రదానం చేస్తారు.
”మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన” అనేది మానవ హక్కుల చరిత్రలో మైలురాయి వంటిది. ఇవి ఐక్యరాజ్యసమితి మొదటి ప్రధాన విజయాలలో ఒకటిగా నిలిచాయి. ఇది ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుండి విభిన్న చట్టపరమైన సాంస్కృతిక నేపథ్యాలు కలిగిన ప్రతినిధులచే రూపొందించబడడమే కాకుండా మొట్టమొదటి సారిగా ప్రాథమిక మానవ హక్కులను విశ్వవ్యాప్తంగా రక్షించబడాలని నిర్ణయించింది. ఈ ప్రకటన ”జాతి, రంగు, మతం, లింగం, భాష, రాజకీయ, ఇతర అభిప్రాయాలతో సంబంధం లేకుండా మానవుడిగా ప్రతి ఒక్కరూ పొంద వలసిన అమూల్యమైన హక్కులను పొందుపరిచింది.” ప్రతీ వ్యక్తికి గౌరవం, విలువ ఉంటుంది. మానవ హక్కులనేవి సమానత్వం న్యాయానికి సంబంధించినవి. ఇవి వారి వారి జీవితాలను ఎంపిక చేసుకోవడానికి, మానవులుగా వారి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి, స్వేచ్ఛగా, స్వతంత్రంగా, భయం, వేధింపులు, వివక్ష లేకుండా జీవితాన్ని గడపడం కోసం అవసరమైనవి. ప్రతి వ్యక్తి ప్రాథమిక విలువను గుర్తించే మార్గాలలో మొదటిది ”వారి మానవ హక్కులను గుర్తించి గౌరవించడం.” ఇవి ప్రతిరోజూ ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయి. ఈఏడాది థీమ్‌ ” ప్రస్తుత మన హక్కులు, మన భవిష్యత్తు. ” మానవ హక్కుల ప్రాముఖ్యత, ఔచిత్యాన్ని గుర్తించడానికి, ప్రతికూల మూసధోరణులు, అపోహలను ఎదుర్కోవడం ద్వారా అవగాహనలను మార్చడానికి, మానవ హక్కుల కోసం ప్రపంచ ఉద్యమాన్ని పునరుజ్జీవింప జేయడానికి, కార్యాచరణను సమీకరించడానికి ప్రతి ఒక్కరినీ ఇప్పుడే ప్రేరేపించాలాన్నదే దీని సారాంశం.ఈ థీమ్‌ మానవ హక్కుల విద్యపై తక్షణ శ్రద్ధ, ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.జీవించే స్వేచ్ఛ, బానిసత్వం హింస నుండి స్వేచ్ఛ, అభిప్రాయం భావప్రకటనా స్వేచ్ఛ, పని, విద్యాహక్కు, ప్రభుత్వంలో పాల్గొనే హక్కు.
మన దేశంలో చూస్తే ఈ మానవ హక్కులు 30 ఆర్టికల్స్‌గా పొందుపరచబడ్డాయి. అందులో ప్రధానమైన ప్రాథమిక హక్కులు ఆరు. సమానత్వపు హక్కు, స్వేచ్ఛా హక్కు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే హక్కు, మతస్వేచ్ఛ హక్కు, సాంస్కృతిక, విద్యా, రాజ్యాంగ పరిష్కారాల హక్కులు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ అనేది 1993 మానవ హక్కుల పరిరక్షణ చట్టానికి సంబంధించి భారత రాజ్యాంగం ప్రకారం 1993లో స్థాపించబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. పిహెచ్‌ఆర్‌ చట్టంలోని సెక్షన్‌ 2(1) (డి) మానవ హక్కులను రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడిన లేదా అంతర్జాతీయ ఒడంబడికలలో పొందుపరచబడిన, భారతదేశంలోని న్యాయస్థానాలు అమలు చేయగల వ్యక్తి జీవితం, స్వేచ్ఛ, సమాన త్వం, గౌరవానికి సంబంధించిన వాటిని హక్కులుగా పేర్కొంది. మన దేశ పౌర హక్కులను పరిరక్షించడం, ప్రోత్సహించడం ఈ కమిషన్‌ లక్ష్యం. వాతావరణ మార్పు, వ్యాపారం, మానసిక ఆరోగ్యం మెరుగు దలకు సంబంధించిన సమస్యలతో పాటు కమిషన్‌కు ప్రధాన ఆందోళనగా ఉన్న ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో వాయు కాలుష్యంపై నమోదు చేసిన స్వయం ప్రతిపత్తి కేసుల విచారణను కమిషన్‌ కొనసాగిస్తోంది.
జాతీయ కమిషన్‌లు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లతో సమావేశాలు, క్యాంపు సిట్టింగ్‌, ప్రత్యేక రిపోర్టర్‌లు, ప్రత్యేక మానిటర్‌ల సందర్శనలు, మానవ హక్కుల ఉల్లంఘనలను పరిశీలించడం, పర్యవేక్షించడం, మూల్యాంకనం చేయడం, సలహా ఇవ్వడం నివేదించడం, జైళ్లు, అబ్జర్వేషన్‌ హౌమ్‌ లు, పాఠశాలలు, మానసిక ఆరోగ్య సంస్థలు, పోలీస్‌ స్టేషన్‌లు, బాలబాలికల కోసం జువైనల్‌ హోమ్‌లు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖలు, వృద్ధుల గృహాలు, ఆసుపత్రులు, అంగన్‌వాడీలు మొదలైన వాటిలో ఎన్‌హెచ్‌ఆర్‌సి అనుసరించిన కొన్ని సమర్థవంతమైన విధానాలు దేశంలోని మానవ హక్కుల పరిస్థితిని గమనించి సంబంధిత అధికారులకు అవసరమైన సిఫార్సులు చేస్తుంది.ఈ ఏడాది నవంబర్‌ వరకు 44,940 కేసులు నమోదవ్వగా గతేడాది79,364 కేసులు నమోదు చేయబడ్డాయి. ఇందులో ప్రధానంగా మానవ హక్కుల ఉల్లంఘనకు సంబం ధించిన కేసుల్లో ఉత్తరప్రదేశ్‌ 32,666తో మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఈ హక్కులన్నింటిని రక్షించాల్సిన బాధ్యత ఆయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లదే. కానీ అవి విస్మరణకు గురవుతున్న ప్పుడు ప్రశ్నించడం, నిలదీయం కూడా మానవ హక్కే.
(నేడు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం)
– జనక మోహన రావు దుంగ, 8247045230