రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

– ఆప్‌ సదస్సులో వక్తలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ దిడ్డి సుధాకర్‌ అధ్యక్షతన హైదరాబాద్‌ బషీర్‌ బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ‘రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని దేశాన్ని రక్షించండి’ అనే అంశంపై ఆప్‌, టీజేఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు తదితరులు మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోకపోతే ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారుతందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలను పట్టించుకోకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నదని విమర్శించారు. బీజేపీ విధానాల కారణంగా ఏ దేశంలో లేనంత అసమానతలు నెలకొన్నాయని చెప్పారు. దేశంలో రాజ్యాంగం రక్షించబడాలన్నా… ప్రజాస్వామ్యం పరిరక్షింపబడాలన్నా… ఇండియా కాపాడాబడాలన్నా బీజేపీ ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్‌ ప్రధాన కార్యదర్శి ఎన్‌. రమేశ్‌, ఆర్థిక నిపుణులు డి.పాపారావు, రాష్ట్ర మైనార్టీ కమిషన్‌ చైర్‌ పర్సన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, ఆప్‌ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్‌, డాక్టర్‌ అన్సారీ, ఎంఎ.మజీద్‌, మహిళా విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హేమ జిల్లోజు, నర్సింగ్‌ యమున గౌడ్‌, అధికార ప్రతినిధులు ఫణిభూషణ్‌, జావేద్‌ షరీఫ్‌, దివ్యాంగ విభాగం కన్వీనర్‌ దర్శనం రమేష్‌, మైనారిటీ కమిటీ కన్వీనర్‌ ఆఫ్జల్‌, డాక్టర్స్‌ విభాగం కన్వీనర్‌ డాక్టర్‌ లాఖ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.