– ఎన్టీఏను రద్దు చేయాలి…
– నీట్-2024 పరీక్ష తిరిగి నిర్వహించాలి
– సుప్రీంకోర్టు జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి
– జాతీయ స్థాయి పరీక్షల సమగ్రతను కాపాడాలి
– ఎస్‌ఎఫ్‌ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ డిమాండ్
నవతెలంగాణ-కొత్తగూడెం
జాతీయ స్థాయి పరీక్షల సమగ్రతను కాపాడుకుందామని, ఎన్టీఏను రద్దు చేయాలని, నీట్-2024 పరీక్ష తిరిగి నిర్వహించాలని, సుప్రీంకోర్టు జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని, జాతీయ స్థాయి పరీక్షల సమగ్రతను కాపాడాలని ఎస్‌ఎఫ్‌ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నీట్-2024, యూజీసీ నెట్ పరీక్షల అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఏ) ను రద్దు చేయాలని, జాతీయ స్థాయి పోటీ పరీక్షల సమగ్రతను కాపాడాలని, నీట్ పరీక్షను తిరిగి నిర్వహించాలని, మెడికల్ సీట్ల భర్తీ అధికారం రాష్ట్రాలకే వదిలేయాలనీ, ఉమ్మడి జాబితాలోని అంశమైన విద్యపై రాష్ట్రాల హక్కులను లాగేసుకుని విద్యపై పూర్తి నియంత్రణకు కేంద్రం యత్నిస్తోందని లక్ష్మీదేవిపల్లి, పాలకేంద్రం వద్ద ప్లకార్డులతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.అభిమన్యు, బి.వీరభద్రం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యా కేంద్రీకరణకు ప్రయత్నిస్తోందని, విద్యా కేంద్రీకరణతో విపరీతమైన అధికారులు చేజిక్కి, అధికార దుర్వినియోగంతో పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీస్ వంటి సమస్యలు పుట్టుకొస్తున్నాయన్నారు. సుప్రీం కోర్టు చొరవ తీసుకుని నీట్ కౌన్సిలింగ్ తక్షణమే ఆపి, తిరిగి పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మందా నాగకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు రామ్ చరణ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.